
మలయాళంలో విమర్శకుల ప్రశంసలు పొందిన హార్ట్ టచ్చింగ్ మూవీ ‘సూత్రవాక్యం’. ఇప్పుడు తెలుగు ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఈటీవీ విన్ వేదికగా ఆగస్టు 21న, అమెజాన్ ప్రైమ్‌లో ఆగస్టు 27న విడుదలైంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మొదటి రోజు నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ఇప్పుడు అరుదైన రికార్డును నెలకొల్పింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ మినిట్స్ పైగా సాధించి, డిజిటల్ ప్రపంచంలో తన సత్తా చాటింది.
ఎందుకింత సంచలనం?
పోలీసు వ్యవస్థపై ఉన్న సంప్రదాయ ఆలోచనలను ప్రశ్నిస్తూ ఈ సినిమా తెరకెక్కింది. పోలీసులు అంటే కేవలం నేరాలను పరిష్కరించే వారే కాకుండా, ఖాళీ సమయంలో పిల్లలకు పాఠాలు చెప్పి సమాజంలో మార్పు తీసుకురావాలనే విప్లవాత్మకమైన అంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ ఆలోచనకు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరితమైన కథనం తోడవ్వడంతో ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. యూజియాన్ జాస్ చిరమ్మల్ దర్శకుడిగా ఈ మూవీతో పరిచయం అయ్యాడు. నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించడం విశేషం. ఇంత గొప్ప కంటెంట్ కలిగిన "సూత్రవాక్యం" చిత్రాన్ని నిర్మించే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉందని అన్నారు.
కథాంశం ఏమిటంటే..
పోలీస్ అధికారి క్రిస్టో జేవియర్ (షైన్ టామ్ చాకో) కేవలం విధులు నిర్వర్తించడమే కాకుండా, తన స్టేషన్‌లోనే పిల్లలకు పాఠాలు చెబుతుంటాడు. ఇది స్కూల్ టీచర్ నిమిషా (విన్సీ ఆలోషియస్)కు నచ్చదు, ఆమె క్రిస్టోపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తుంది. మరోవైపు, క్రిస్టో ట్యూషన్ చెప్పే ఆర్య అనే అమ్మాయి (అనఘా)పై ఆమె సోదరుడు వివేక్ (దీపక్ పరంబోర్) చెయ్యి చేసుకుంటాడు. క్రిస్టో అతడిని హెచ్చరిస్తాడు. ఆర్యకు ఆమె స్నేహితుడు అఖిల్‌తో ఉన్న సాన్నిహిత్యం నచ్చక, వివేక్ వారిద్దరిపై దాడి చేస్తాడు.
ఈ ఘటన తర్వాత వివేక్ అదృశ్యమవుతాడు. అతడి కోసం క్రిస్టో జేవియర్ దర్యాప్తు మొదలుపెట్టగా, ఊహించని విధంగా మరో హత్య కేసు బయటపడుతుంది. ఆర్య స్నేహితుడు అఖిల్.. ఓ యువతి మృతదేహం దగ్గర పోలీసులకు దొరుకుతాడు. ఇంతకీ ఆ మరణించిన అమ్మాయి ఎవరు? ఆమెకు వివేక్ కేసుతో సంబంధం ఉందా? ఈ మిస్సింగ్, మర్డర్ కేసులను క్రిస్టో జేవియర్ ఎలా పరిష్కరించాడు? అన్నదే ఈ సినిమా కథ. ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్‌ను చివరి వరకు పంచుతుంది. పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్ ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా కథ సాగుతోంది. ఈ మూవీ థియేటర్లలోనే కాకుండా.. ఓటీటీలోనూ దూసుకెళ్తూ ఆదరణ పొందుతోంది.