43 మంది MROలు, రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు

43 మంది MROలు, రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు
  • కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో అవకతవకలపై విచారించి నివేదిక ఇచ్చిన విజిలెన్స్ 

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో అక్రమాలు, అవకతవకలు నిజమేనని నిర్ధారణ అయింది. ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేయగా అవకతవకలు నిజమేనని తేలింది. అనర్హులకు డబ్బులు చెల్లించి వారి వద్ద నుంచి లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల్లో అనర్హులకు నగదు చెల్లించిన తాహశీల్దార్లు,ఆర్ఐలు, విఆర్ఏలు 43 మంది అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ నివేదికలో వెల్లడైంది.  
క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్, ఎంఐఎం లీడర్లు, వారి అనుచరులు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు, తాహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, మరికొందరు బ్రోకర్లు కలసి అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో నిగ్గుతేలింది. రాష్ట్రంలో  10 జిల్లాలకు చెందిన 43 మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది పేదలను ఏ విధంగా దోచుకున్నదీ విజిలెన్స్ విభాగం తన నివేదికలో స్పష్టంగా వివరించింది. విచారణలో బయటపడ్డ అక్రమాల్లో మచ్చుకు కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి. 
ఆదిలాబాద్  ఆర్డీవో ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం దరఖాస్తుల ప్రక్రయలో రూ. 86.09 లక్షల  మొత్తం  దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గుడి హత్నూర్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెం. 148/2020 కింద నిందితునిపై ఐపీసీ 420, 403, 409 సెక్షన్ల కింద అలాగే ఐటీ యాక్ట్ 66 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 
వరంగల్ అర్బన్ (ప్రస్తుత హనుమకొండ) జిల్లా: ధర్మసాగర్ తాహశీల్దార్ ఆఫీసు కేంద్రంగా అవినీతి జరిగింది. ఇక్కడి తాహశీల్దార్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా భారీ ఎత్తున లంచాలు స్వీకరించినట్లు విజిలెన్స్ నివేదిక పేర్కొంది. ఇందుకోసం తాహశీల్దార్ కొందరు ప్రజా ప్రతినిధులను, ఇతరులను బ్రోకర్లుగా నియమించుకుని వసూళ్లకు పాల్పడినట్లు నివేదికలో స్పష్టంగా ఉంది. తాహశీల్దార్ లంచాల భాగోతపు వసూళ్లలో మాజీ ఎంపీపీ గుడి వెనుక దేవేందర్, నారాయణగిరి సర్పంచ్ కర్ర సోమిరెడ్డితోపాటు సోంపల్లి కరుణాకర్ ప్రమేయమున్నట్లు విజిలెన్స్ నిర్ధారించింది.
ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన మొత్తం 43 మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్దిదారుల దరఖాస్తు ప్రక్రియలో లంచాల రూపంలో వసూళ్లకు పాల్పడినట్లు విజిలెన్స్ నివేదిక వివరించింది. దరఖాస్తుదారుల నుంచి రూ. వెయ్యి నుంచి పది వేల వరకు వసూళ్లు చేసినట్లు కూడా విజిలెన్స్ నివేదిక ప్రస్తావించింది. లంచాల రూపంలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు అధికారులు. అక్రమాలకు పాల్పడిన 43 మంది రెవెన్యూ సిబ్బందిలో తాహశీల్దార్లు, డిప్యూటీ తాహశీల్దార్లు, వీఆర్వోలు, వీఆర్ ఏలతోపాటు స్థానికులు మరికొందరి ప్రమేయం ఉన్నట్లు విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించింది. అయితే వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ తాహశీల్దార్ గా విజిలెన్స్ జాబితాలో తొలి పేరుగా ప్రస్తావించిన ఎం. రాజ్ కుమార్ ఎవరనే అంశంపై రెవెన్యూ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. 
వాస్తవానికి ఈ పేరుతో తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం అమలు చేస్తున్న కాలం నుంచి, అంటే గడచిన ఏడేళ్ల కాలంలో రాజ్ కుమార్ అనే పేరుగల అధికారి ఎవరూ ఇక్కడ తాహశీల్దార్ గా పనిచేసిన దాఖలాలు లేవు. గత కొంత కాలంగా సీహెచ్ రాజు అనే అధికారి మాత్రమే ఇక్కడ తాహశీల్దార్ గా పనిచేస్తున్నారు. ఈ పథకం కోసం దరఖాస్తు సమర్పణ సమయంలోనే ధర్మసాగర్ తాహశీల్దార్ రాజ్ కుమార్. వూలూనే దిలావనక అబిదక లంచాలు స్వీకరించినట్లు విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. జిల్లాల వారీగా అక్రమార్కులకు పాల్పడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

వరంగల్ రూరల్ జిల్లా: ఎంఆర్ఐలు పరకాల ఏ సంపత్ కుమార్, శాయంపేట హేమ నాయక్, సంగెం ఆనంద్ కుమార్, చెన్నారావుపేట సిహెచ్ స్వామి, నల్లబెల్లి వి సదయ్య, దుగ్గొండి జ్యోతి, నర్సంపేట గడ్డం ఉమా. 
జనగామ జిల్లా: జనగామ తల్లూరి కృష్ణ ప్రసాద్, స్టేషన్ ఘనా పూర్ కృష్ణస్వామి, నర్మెట్ల బీ నరసింహ నాయక్, తరిగొప్పుల రంజిత్ నాయక్, జాఫర్ గడ్ రాంబాబు, పాలకుర్తి కే రవి, భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి దేవేందర్, కంప్యూటర్ ఆపరేటర్ నరేష్, ములుగు గనాపూర్ శ్రావణ్.
మహబూబాద్ జిల్లా: మహబూబాబాద్ గూడూర్ తాహసిల్దార్ శైలజ, కేసముద్రం రిటైర్డ్ తాహసిల్దార్ ఎం వెంకట్ రెడ్డి, మహబూబాబాద్ తాహసిల్దార్ ఎం రంజిత్ కుమార్.
నల్గొండ జిల్లా త్రిపురం తాహసిల్దార్ కేసి ప్రమీల, ఆర్ఐ విగ్నేశ్వర రెడ్డి, ఆర్ఐ జోషి, నిడమనూరు తాహసిల్దార్ హెచ్ ప్రమీల, తిరుమలగిరి తాహసిల్దార్ పాండు నాయక్, దామరచర్ల ఆర్ఐ నాగరాజు, మిర్యాలగూడ టౌన్ ఆర్ ఐ శ్యాంసుందర్, రూరల్ ఆర్ ఐ సత్యనారాయణ, వేములపల్లి ఆర్ఐ సోయిరాం, ఆర్ ఐ శ్రీధర్ రెడ్డి, నక్రేకల్ తాహసిల్దార్ జంగయ్య, కేతపల్లి తాహసిల్దార్ వెంకటేశ్వర్లు.
సూర్యాపేట జిల్లా: నూతనకల్  ఏఆర్ ఐ సుజిత్ కుమార్.
ఆదిలాబాద్: జిల్లా కార్యాలయం లో సీనియర్ అసిస్టెంట్ నదీం, మీ సేవ నిర్వాహకులు సిందే అచ్యుత్, జాదవ్ శ్రీనివాస్, మొయినుద్దీన్, బాలకృష్ణ, సునీల్, మీసాల శంకర్, జ్ఞానేశ్వర్, దినేష్, నిర్మల. 
నాగర్ కర్నూల్ జిల్లా: కల్వకుర్తి ఆర్ఐ శశికాంత్, కొల్లాపూర్ విఆర్వో నవీన్ రెడ్డి, వంగూరు ఆర్ఐ సీతారాం నాయక్, ఆర్ ఐ మంజుల, ఉప్పునుంతల ఆర్ఐ పద్మ.
 నిజామాబాద్ జిల్లా బాల్కొండ డిప్యూటీ తాహసీల్దార్ జానకి, ముప్పకల్ ఆర్ఐ గంగాధర్, నిజామాబాద్ సౌత్ తాహసీల్దార్ ప్రసాద్, ఆర్ ఐ రాజు,నిజామాబాద్ నార్త్ నారాయణ తాహసిల్దార్ నారాయణ, డిప్యూటీ తాహసీల్దార్ మధు, ఆర్ఐ దశరథ్ అలీతోపాటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, సర్పంచులు. వీరిలో ధర్మసాగర్ మాజీ ఎంపీపీ గుడి వెనుక దేవేందర్, నారాయణగిరి సర్పంచ్ కర్ర సోమిరెడ్డి, సోంపల్లి కర్నకర్, వేలేరు మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేష్, ఎంపీపీ కె.సి.రెడ్డి సమ్మిరెడ్డి, పాలకుర్తి గూడూరు వీఆర్ఏ ఎల్లయ్య, భూపాలపల్లి మీసేవ సెంటర్ నిర్వాహకుడు తిరుపతి, మహబూబాబాద్ గూడూరు విఆర్వో ఉప్పలయ్య, గూడూరు సురేందర్, వైస్ ఎంపీపీ వీరన్న.కేసముద్రం తహసీల్దార్ టైపిస్ట్ వెంకన్న, బ్రోకర్ లింగమూర్తి, వీఆర్వో కొమ్మాలు, సదా రపు సత్యనారాయణ, వెంకటగిరి సర్పంచ్, కేసముద్రం సర్పంచ్ ప్రభాకర్, స్టేషన్ సర్పంచ్ బట్టు శీను, కేసముద్రం టీఆర్ఎస్ ప్రెసిడెంట్ వీరు నాయక్.
నిజామాబాద్ జిల్లా: బాల్కొండ టిఆర్ఎస్ ఉపసర్పంచ్ అబ్దుల్ వాహిద్, ఎంపీపీ సామ వెంకట్ రెడ్డి, మల్లెల లక్ష్మణ్, భీంగల్ మున్సిపల్ కోఆప్షన్ మేంబర్ మోహిన్, అశ్వక్, కరీం, మోసిన్, సలీం, రబ్బానీ.
మహబూబాబాద్ తాహసిల్దార్ కార్యాలయం:  జూనియర్ అసిస్టెంట్ కీర్తన్, నల్గొండ జిల్లా ముకుందాపురం ఆర్ ఐ రామారావు, పంచాయతీ సెక్రటరీ శ్రీదేవి, బ్రోకర్ సైదిరెడ్డి, దొర పల్లి నాగరాజు, తిరుమలగిరి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ రవి, ఆర్ ఐ ఈషాక్, బ్రోకర్ శంకర్ నాయక్, జవహర్ లాల్, ముని నాయక్, నకిరేకల్ ఆర్ఐ రాంప్రసాద్, కంప్యూటర్ ఆపరేటర్ రాజు, కేతపల్లి ఆర్ఐ శ్యాంసుందర్ రెడ్డి, అసిస్టెంట్ ఆర్ఐ రాజ్యలక్ష్మి, కంప్యూటర్ ఆపరేటర్ సాగర్.