15 రోజుల వ్యవధిలో 44 లక్షల ఓట్లు ఓకే.. ఆందోళనల వేళ ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌ క్లియరెన్స్‌..‌‌‌‌‌‌‌!

15 రోజుల వ్యవధిలో 44 లక్షల ఓట్లు ఓకే.. ఆందోళనల వేళ ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌ క్లియరెన్స్‌..‌‌‌‌‌‌‌!
  • ఆందోళనల వేళ ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌!
  • అనూహ్యంగా అన్నీ మార్చేసిన ఈసీ 
  • రాష్ట్రంలో 92.88 లక్షల అనామలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓటర్లలో 74 లక్షలు ఓకే
  • మొన్నటిదాకా హియరింగ్‌‌‌‌‌‌‌‌ పేరుతో‌‌‌‌‌‌‌‌ కొర్రీలు
  • రాత్రికి రాత్రి ఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్పులు 

హైదరాబాద్, వెలుగు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల ఆందోళనలు ఉధృతమవుతున్న వేళ ఎన్నికల సంఘం (ఈసీ) తీరులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్న మొన్నటిదాకా నిబంధనల పేరుతో ఓటర్లను ముప్పుతిప్పలు పెట్టిన యంత్రాంగం.. ఆందోళనల సెగ తగలగానే 92.88 లక్షల అనామలీస్ ఓటర్లలో దాదాపు 74 లక్షల మందిని అర్హులుగా తేల్చింది. 

సీఈసీకి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తిన కేవలం 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే ఏకంగా 44 లక్షల ఓట్లకు ఎలాంటి విచారణ లేకుండా ఆన్‌‌లైన్‌‌లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొన్నటివరకు ప్రత్యక్ష విచారణ, పత్రాలు తప్పనిసరి చేసిన ఈసీ.. ఇప్పుడు గంపగుత్తగా ఓట్లను ఓకే చేయడం, ఈఆర్‌‌వో నెట్ సాఫ్ట్‌‌వేర్‌‌లోనూ ఆకస్మిక మార్పులు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆందోళనల ఒత్తిడి తట్టుకోలేకే ‘ఆటోమేటిక్ ఎలిజిబుల్’ నిర్ణయం తీసుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఉరికురికి నోటీసులు.. ఆందోళనలతో వెనక్కి

సర్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి నో–మ్యాపింగ్, ఇంటిపేరు లేదా పేర్లలో చిన్నపాటి అక్షర దోషాలు, పుట్టిన తేదీల్లో స్వల్ప వ్యత్యాసాల పేరుతో 92.88 లక్షల మందికి నోటీసులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో సరైన విచారణ లేకుండానే సాఫ్ట్‌‌వేర్ ఆధారంగా అనామలీస్ జాబితాలో చేర్చడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సాధారణ ప్రజలు, వృద్ధులు, కూలీలు ఓటు హక్కును కాపాడుకునేందుకు పనులు మానుకుని ఈఆర్‌‌వో కార్యాలయాలు, హియరింగ్ క్యాంపుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. 

గత నెల 23 నాటికి 40 రోజుల హియరింగ్ తర్వాత కేవలం 30 లక్షల మందినే అర్హులుగా తేల్చడంతో మిగిలిన వారి ఓట్లు రద్దవుతాయనే భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో సర్ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని, అసలైన ఓటర్లను జాబితా నుంచి తప్పిస్తున్నారని ప్రతిపక్షాలు, సీజేపీ ప్రతినిధులు భగ్గుమన్నారు. ఈసీ ఏకపక్షంగా, పారదర్శకత లేకుండా వ్యవహరిస్తోందంటూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. 

ఈ నిరసనలతో ఈసీ తీవ్ర ఆత్మరక్షణలో పడిపోయి, రాజకీయ దుమారం నుంచి బయటపడేందుకు నిబంధనలు సడలించినట్లు విమర్శలు వచ్చాయి. వారం, పది రోజుల కిందటి వరకు ఉన్న ప్రతి ఓటరు వ్యక్తిగతంగా ఈఆర్‌‌వో కేంద్రం లేదా హియరింగ్ క్యాంపునకు హాజరు కావాలన్న నిబంధనను ఎత్తేసింది. 

స్వల్ప తప్పులకు పుట్టిన తేదీ, నివాస ధ్రువీకరణ పత్రాల కొర్రీలను పక్కనబెట్టి, కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండానే ఉన్నచోటు నుంచే సమస్య పరిష్కరించుకునే అవకాశం ఇచ్చింది. ‘వీలైనంత వరకు అందరినీ ఓకే చేయండి.. ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దు’ అంటూ ఈసీ ఉన్నతస్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బందికి అంతర్గత ఆదేశాలు వెళ్లినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

ముసాయిదా జాబితాపై అనుమానాలు

అనామలీస్ పరిధిలోని 92 లక్షల మందిలో 74 లక్షల మందికి చకచకా క్లియరెన్స్ రావడంతో, ముసాయిదా జాబితా (డ్రాఫ్ట్ రోల్) ప్రకటనకు ముందే తొలగించిన 73.39 లక్షల ఏఎస్‌‌డీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్) ఓటర్లపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో నిర్దేశిత చిరునామాలో లేని ఆబ్సెంట్ 11.25 లక్షలు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన (షిఫ్టెడ్) 45.18 లక్షలు, మరణించిన 9.22 లక్షలు, రెండు చోట్ల పేర్లు నమోదైన డూప్లికేట్ ఓటర్లు 6.7 లక్షలు, ఇతరులు 1.02 లక్షల మంది ఉన్నారని ఈసీ వెల్లడించింది. 

ప్రస్తుత ఓటర్ల మాదిరిగానే ఈ 73 లక్షల మందిలోనూ సాంకేతిక కారణాలతో పక్కనపెట్టినవారు ఉన్నారేమోననే అనుమానాలు మొదలయ్యాయి. పైగా ఏఎస్‌‌డీ జాబితాలో పేరు ఉన్నంత మాత్రాన ఓటు పూర్తిగా రద్దయినట్లు కాదని, పొరపాటున పేరు చేరితే క్లెయిములు, అభ్యంతరాల సమయంలో ఫామ్ 6తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి తుది జాబితాలోకి తిరిగి చేర్చుకోవచ్చని ఈసీ ప్రకటించింది. ఈ ప్రకటననే ఎక్స్‌‌పర్ట్స్ కూడా ప్రస్తావిస్తూ, ప్రస్తుత అనామలీస్ ఓటర్ల విషయంలో అనుసరించిన విధానంపైనా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.