బచావో బాపూ.. దేశంలో ఓటు హక్కును కాపాడాలంటూ మహాత్మునికి వేడుకోలు

బచావో బాపూ.. దేశంలో ఓటు హక్కును కాపాడాలంటూ మహాత్మునికి వేడుకోలు
  • రాజ్ ఘాట్ వద్ద ఇండియా కూటమి నిరసన
  • కేంద్రానికి, సీఈసీకి సద్బుద్ధి ప్రసాదించాలని ప్రార్థన 
  • ఓట్ చోరీపై మూడో రోజూ కొనసాగిన ఆందోళనలు
  • దేశాన్ని హైజాక్ చేసిన మోదీ, అమిత్​ షా, జ్ఞానేశ్
  • ఓట్లు దొంగిలించారు..రాజ్యాంగం ధ్వంసమైంది 
  • ఈసీ, కేంద్రం తీరుపై ప్రతిపక్ష నేత రాహుల్ ఫైర్​  
  • దేశ ఓటు హక్కును కేంద్రం లాక్కుంటోంది: ఖర్గే 
  • నేడు రాష్ట్రపతికి కూటమి ఎంపీల వినతి పత్రం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీల నేతలు వరుసగా మూడో రోజు నిరసనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్  ఓటు చోరీతో దేశాన్ని హైజాక్ చేశారంటూ గురువారం మహాత్మా గాంధీ స్మారక కేంద్రమైన రాజ్ ఘాట్ వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. ‘కేంద్రంలోని బీజేపీ సర్కారుకు, సీఈసీకి సద్బుద్ధి ప్రసాదించాలని’ కోరుతూ ప్రతిపక్ష నేతలు మహాత్మా గాంధీ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. 

సీఈసీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్​ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఇతర పార్టీల ఎంపీలు ఢిల్లీలో మంగళవారం నుంచి రోజూ నిరసనలు తెలుపుతున్నారు. మొదటిరోజు సీఈసీ ఆఫీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో ఆకాశవాణి భవన్‌‌‌‌‌‌‌‌ వద్ద రాహుల్, ప్రియాంక ఎనిమిది గంటలపాటు బైఠాయించారు. 

బుధవారం ఓ హోటల్‌‌‌‌‌‌‌‌లో లంచ్ మీటింగ్ తర్వాత బస్సుల్లో జంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్దకు బయలుదేరేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గురువారం మాత్రం గత రెండు రోజులకు భిన్నంగా నిరసనలు ప్రశాంతంగా కొనసాగాయి. ముందుగా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆధ్వర్యంలో కన్నాట్‌‌‌‌‌‌‌‌ప్లేస్‌‌‌‌‌‌‌‌లోని మోయెట్స్ రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీఎంసీ, ఎస్పీ ఎంపీలు లంచ్ మీటింగ్‌‌‌‌‌‌‌‌కు హాజరయ్యారు. 

అనంతరం అందరూ కలిసి రాజ్ ఘాట్ వద్ద శాంతియుత నిరసనకు కూర్చోవాలని నిర్ణయించారు. ఆ తర్వాత వారు రెస్టారెంట్ బయట నిలిపిన ఏసీ బస్సుల్లో రాజ్ ఘాట్ బయలుదేరారు. సెంట్రల్ ఢిల్లీ నుంచి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్ ఘాట్ వరకు కాంగ్రెస్ కార్యకర్తలు బస్సుల వెంట నడుచుకుంటూ వెళ్లారు. గాంధీ సమాధి వద్ద పూలమాలలు సమర్పించి నేతలు నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే బైఠాయించి శాంతియుతంగా నిరసన తెలిపారు. ఆ తర్వాత రాహుల్, ఖర్గేతోపాటు ప్రతిపక్ష నేతలంతా తిరిగి వెళ్లిపోయారు.  

ఓటు హక్కును కేంద్రం లాక్కుంటోంది: ఖర్గే 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల ఓటు హక్కును లాక్కుంటోందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. రాజ్ ఘాట్ వద్ద జరిగిన బైఠాయింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ చోరీని ప్రతిపక్షాలు దేశం ముందు అనుకుంటున్నాయని చెప్పారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్‌‌‌‌ వంటి గొప్ప నాయకులు మనకోసం సాధించిన స్వాతంత్ర్యాన్ని మోదీ, అమిత్ షా లాక్కుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలతో పాటు టీఎంసీకి చెందిన అభిషేక్ బెనర్జీ, మేనకా గురుస్వామి, సాకేత్ గోఖలే, సమీరుల్ ఇస్లాం, ఎస్పీకి చెందిన రాజీవ్ రాయ్, మొహిబుల్లా, సీపీఎంకు చెందిన బ్రిట్టాస్, సీపీఐకి చెందిన సంతోష్, ఆర్జేడీకి చెందిన సుధాకర్ సింగ్ కూడా ఈ లంచ్ మీటింగ్, నిరసనలో పాల్గొన్నారు.   

నేడు పార్లమెంట్‌‌‌‌ భవనంలో భేటీ.. నిరసనలు 

కేంద్ర ప్రభుత్వం, సీఈసీకి వ్యతిరేకంగా శుక్రవారం కూడా తమ నిరసన కొనసాగిస్తామని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రకటించారు. అంతకుముందుగా ఉదయం తాము పార్లమెంటు భవనంలో సమావేశమయ్యే అవకాశం ఉందని  తెలిపారు. శుక్రవారం నిరసనల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించనున్నారో మాత్రం వెల్లడించనప్పటికీ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని పలువురు నేతలు తేల్చిచెప్పారు. 

కాంగ్రెస్ నేత, మీడియా, పబ్లిసిటీ విభాగం అధిపతి పవన్ ఖేరా విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఇండియా కూటమి ఎంపీలు, నేతలు రాజ్ ఘాట్ వద్ద ఎలా శాంతియుతంగా నిరసన తెలిపి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారో మీరు చూశారు. మేం ఈ ప్రభుత్వానికి, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌కు సద్బుద్ధి ప్రసాదించాల్సిందిగా ప్రార్థించాం. అలాగే దేశంలో ప్రజాస్వామ్యంతో పాటు ప్రతి ఓటరు ఓటు హక్కును కాపాడాలని ప్రార్థించాం’’ అని తెలిపారు. 

ఈ నిరసన శుక్రవారం కూడా కొనసాగుతుందని సీపీఎం నేత జాన్ బ్రిట్టాస్ పేర్కొన్నారు. ‘‘జ్ఞానేశ్ కుమార్ రాజీనామా సమర్పించే వరకు ఇండియా కూటమి నిరసన కొనసాగుతుంది. జ్ఞానేశ్ కుమార్‌‌‌‌ను రక్షించాలని నరేంద్ర మోదీ, అమిత్ షా చూస్తే, వారు కూడా ఆయనతో పాటే మునిగిపోతారు. మేం పూర్తి సంకల్పంతో, దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నాం”అని అన్నారు. సీపీఐ నేత పి. సంతోష్ కూడా స్పందిస్తూ.. ‘‘మేం రేపు కూడా మా నిరసనను కొనసాగిస్తాం. జ్ఞానేశ్ కుమార్ త్వరగా రాజీనామా చేస్తే దేశానికి మంచిది’’ అని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల ఐక్యత చెక్కుచెదరలేదని సీపీఎం నేత వి. శివదాసన్ తెలిపారు.

ఆ నలుగురినీ చట్టం ముందు నిలబెడతాం: రాహుల్ 

భారత రాజ్యాంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ధ్వంసం చేశారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ నలుగురినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతామని స్పష్టం చేశారు. కన్నాట్ ప్లేస్, ఔటర్ సర్కిల్‌‌‌‌లోని మోయెట్స్ రెస్టారెంట్‌‌‌‌లో ప్రతిపక్ష ఎంపీలు, నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడారు.

  ‘‘మేం 300 మంది ఎంపీలం శాంతియుతంగా నిరసన తెలపాలని కోరుకుంటున్నాం. మొదటి రోజు ఎన్నికల కమిషన్ కార్యాలయం సమీపంలో మమ్మల్ని అడ్డుకున్నారు. రెండవ రోజు జంతర్ మంతర్ వెళ్లకుండా అడ్డగించి, కొట్టారు. మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, జ్ఞానేశ్ కుమార్ దేశాన్ని హైజాక్ చేశారు. వారు రాజ్యాంగాన్ని ధ్వంసం చేశారు. ఓట్లను దొంగిలించారు. ఆ నలుగురు చట్టం ముందు దోషులుగా నిలబడతారు. ఇది మా హామీ, అది జరగడం మీరు చూస్తారు” అని ఆయన స్పష్టం చేశారు.