వీధుల్లో నిరసనల పేరుతో అరాచకం.. రాహుల్, ప్రియాంక పై బీజేపీ ఫైర్

వీధుల్లో నిరసనల పేరుతో అరాచకం.. రాహుల్, ప్రియాంక పై బీజేపీ ఫైర్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఇండియా కూటమి నేతలు చేపట్టిన నిరసనలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. వీధుల్లో నిరసనల పేరుతో కాంగ్రెస్ నాయకులు అరాచకానికి పాల్పడుతున్నారని ఆరోపించింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ అధికార ప్రతినిధులు ప్రదీప్ భండారి, సిద్దార్థ్ యాదవ్ మాట్లాడారు. రాహుల్, ప్రియాంకల నేతృత్వంలో ఢిల్లీలో అరాచకం సృష్టించే యత్నం జరుగుతోందని సిద్దార్థ్ యాదవ్ తెలిపారు. ఈ నిరసనల్లో సాధారణ ప్రజలు ఎవరూ పాల్గొనడం లేదని విమర్శించారు. 

రాహుల్ గాంధీ ఒక మహిళా కానిస్టేబుల్‌‌ను అనుచితంగా తాకారని, ప్రియాంక గాంధీ ఒక మహిళా పోలీసు అధికారి కడుపులో గుద్దారని, ఇది ఆమోదయోగ్యం కాదని చెప్పారు. మరో బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి మాట్లాడుతూ.. నేపాల్, బంగ్లాదేశ్‌‌ల మాదిరిగా భారత్‌‌లోనూ అరాచకం సృష్టించాలనేది కాంగ్రెస్ వ్యూహమని ఆరోపించారు. సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఎన్నికల సంఘం అంశంపై వీధుల్లో నిరసనలు చేపట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. న్యాయ ప్రక్రియను ప్రభావితం చేసేందుకే రాహుల్ గాంధీ ఈ డ్రామాలు ఆడుతున్నారని, దేశంలో అశాంతిని సృష్టించడానికి కొన్ని అంతర్జాతీయ శక్తులు రాహుల్ గాంధీతో కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు.