సైబరాబాద్​లో 44 పెలికాన్ సిగ్నల్స్

సైబరాబాద్​లో 44 పెలికాన్ సిగ్నల్స్

మాదాపూర్,వెలుగు: పాదచారులు సేఫ్​గా రోడ్డు దాటేందుకు సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. శుక్రవారం గూగుల్ ఆఫీసు వద్ద పెలికాన్ సిగ్నల్​ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..సైబరాబాద్ కమిషనరేట్ లో శుక్రవారం ఒక్కరోజే మొత్తం 44 పెలికాన్ సిగ్నళ్లను రంభించామన్నారు. వీటిని ఆపరేట్ చేసేందుకు ఇద్దరు చొప్పున ట్రాఫిక్ వార్డెన్లు ఉంటారన్నారు. సైబారాబాద్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు దాటుతూ చనిపోతున్న పాదచారుల సంఖ్య ఏటా పెరుగుతుందన్నారు. దీన్ని నివారించేందుకే పెలికాన్ సిగ్నల్​ను అందుబాటులోకి తెచ్చామని సీపీ వివరించారు. కార్యక్రమంలో మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్దన్, ఏడీసీపీ శ్రీనివాస్ రెడ్డి, నర్సింహారెడ్డి, డీసీపీ సందీప్, ఏసీపీలు, ట్రాఫిక్ వలంటీర్లు పాల్గొన్నారు. 

పెలికాన్ సిగ్నల్ ఇలా పనిచేస్తుంది...

రద్దీ ప్రదేశాల్లో పాదచారులు రోడ్డు దాటేందుకు  ఏర్పాటు చేసినదే పెలికాన్​ సిగ్నల్.  ట్రాఫిక్ రద్దీ ఉన్న చోట రోడ్డు దాటాలనుకునేవారు రోడ్డుకు ఒకవైపు ఉన్న పెలికాన్ సిగ్నల్ బాక్స్ దగ్గరకు వెళ్లాలి. ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ పడేందుకు బటన్ ప్రెస్ చేయాలి. 30 సెకన్లకు రెడ్ సిగ్నల్​పడుతుంది. ఆ తర్వాత పాదచారులు అందరూ రోడ్డు దాటాలి. పాదచారులు రోడ్డు దాటే టైమ్ వారికి గ్రీన్​ సిగ్నల్ చూపిస్తుంది. ఈ సిగ్నల్ 21 సెకన్ల పాటు ఉంటుంది. ఈ టైమ్ లోనే అందరూ రోడ్డు దాటాల్సి ఉంటుంది. ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉంటే పెలికాన్ సిగ్నల్ దగ్గర ఉన్న ట్రాఫిక్ వార్డెన్లు..  గ్రీన్ సిగ్నల్ టైమ్​ను పెంచుతారు.