10 రాష్ట్రాల్లో ఎన్‌‌ఐఏ సోదాలు.. తెలంగాణలో ఒకరు సహా 44 మంది అరెస్ట్

10 రాష్ట్రాల్లో ఎన్‌‌ఐఏ సోదాలు..   తెలంగాణలో ఒకరు సహా 44 మంది అరెస్ట్

   హైదరాబాద్‌‌, వెలుగు :  మానవ అక్రమ రవాణా ముఠాలపై నేషనల్‌‌ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌‌ఐఏ) బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచి సోదాలు జరిపింది. తెలంగాణలో ఒకరిని, మిగిలిన తొమ్మిది రాష్ట్రాల్లో మరో 43 మందిని అరెస్ట్ చేసింది. వీరి వద్ద రూ.20 లక్షల నగదు, 4,550 యూఎస్ డాలర్స్, డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్స్, సిమ్‌‌ కార్డులు, పెన్‌‌డ్రైవ్స్‌‌, ఆధార్‌‌‌‌కార్డ్స్‌‌, పాన్‌‌కార్డ్స్‌‌ తో పాటు ఫోర్జరీ డాక్యుమెంట్స్‌‌ను స్వాధీనం చేసుకుంది. నాలుగు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. ఎన్‌‌ఐఏ హెడ్‌‌క్వార్టర్స్‌‌ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది.

రోహింగ్యాల అక్రమ వలసలు

భారత్​– బంగ్లాదేశ్‌‌ బార్డర్​మీదుగా దేశంలోకి  రోహింగ్యాల అక్రమ చొరబాట్లు, మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు అసోం పోలీసులకు సమాచారం అందింది. దీనిపై సెప్టెంబర్‌‌ 9న అసోం స్పెషల్ టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు కేసు నమోదు చేశారు. రోహింగ్యాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారనే సమాచారంతో గత నెల 10న ఎన్‌‌ఐఏ గౌహతి బ్రాంచ్‌‌ మరో కేసు నమోదు చేసింది. దేశంలోకి ప్రవేశించిన రోహింగ్యాలను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా సోదాలు జరిపింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌‌(బీఎస్‌‌ఎఫ్‌‌) సహకారంతో ఎన్‌‌ఐఏ స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించింది.

నాలుగు కేసులు, 55 ప్రాంతాల్లో సోదాలు

గౌహతి, చెన్నై, బెంగళూరు, జైపూర్‌‌‌‌ సహా దేశవ్యాప్తంగా 55 ప్రాంతాల్లో ఎన్ఐఏ వరుస సోదాలు జరిపింది. హ్యూమన్ ట్రాఫికింగ్‌‌, అక్రమ చొరబాట్లకు సంబంధించిన 4 కేసులు నమోదు చేసింది. బుధవారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో త్రిపురలో 21 మందిని, కర్నాటకలో పది మందిని, అసోంలో ఐదుగురిని, వెస్ట్‌‌బెంగాల్‌‌లో ముగ్గురిని, తమిళనాడులో ఇద్దరిని, తెలంగాణ, పుదుచ్చేరి, హరియాణలో ఒక్కొక్కరి చొప్పున మొత్తం 44 మందిని అరెస్ట్ చేసింది. రాజస్థాన్‌‌, జమ్మూ కాశ్మీర్‌‌లో కూడా తనిఖీలు చేపట్టింది. మానవ అక్రమ రవాణా, అక్రమ చొరబాట్లు, దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న రోహింగ్యాలను గుర్తిస్తున్నట్లు ఎన్‌‌ఐఏ స్పష్టం చేసింది. దర్యాప్తులో భాగంగానే సోదాలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది.