డేంజర్ బెల్స్!...గ్రేటర్ వరంగల్ లో ప్రమాదకరంగా ఓల్డ్ బిల్డింగులు

డేంజర్ బెల్స్!...గ్రేటర్ వరంగల్ లో ప్రమాదకరంగా ఓల్డ్ బిల్డింగులు
  • ట్రైసిటీ వ్యాప్తంగా 495 భవనాల గుర్తింపు
  •     మెయిన్ జంక్షన్లలోనే అత్యధికం
  •     పైపై మెరుగులు దిద్ది షాపులు నిర్వహిస్తున్న ఓనర్లు
  •     ఏటా నోటీసులకే పరిమితమవుతున్న ఆఫీసర్లు 
  •     వానలకు ముందే చర్యలు చేపడితే మేలు

హనుమకొండ, వెలుగు:  గ్రేటర్ వరంగల్ నగరంలో శిథిల భవనాలు మృత్యుకూపాలను తలపిస్తున్నాయి. వందేండ్ల కింద కట్టిన ప్రభుత్వ భవనాలు కనీస రిపేర్లకు నోచుకోక ప్రమాదకరంగా మారగా, ప్రైవేటు బిల్డింగులు పైపై మెరుగులద్దుకుని డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. భారీ వర్షాలు కురిసిన సమయంలో కుప్పకూలి జనాల ప్రాణాలు తీస్తున్నాయి. ఏటా వర్షాకాలానికి ముందే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓల్డ్ బిల్డింగ్స్ పై చర్యలు తీసుకోవాల్సిన జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు లైట్ తీసుకుంటున్నారని, నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.  

గ్రేటర్ సిటీలో 495 ఓల్డ్ బిల్డింగ్స్..

గ్రేటర్ వరంగల్ నగరంలో వందేండ్ల కింద డంగు సున్నం, మట్టితో నిర్మించిన భవనాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వరంగల్, హనుమకొండలోని మెయిన్ సెంటర్లలోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. కాగా, ఓల్డ్ బిల్డింగులతో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో దాదాపు ఐదేండ్ల కింద వరంగల్ నగరంలోని పాత బంగ్లాల లెక్కలు తీశారు. జీడబ్ల్యూఎంసీ టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి దాదాపు 908 బిల్డింగులు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించారు. వాటన్నింటికీ నోటీసులు జారీ చేసి, వరంగల్ చౌరస్తాలోని ఒక బిల్డింగును కూల్చేశారు. ఆ తర్వాత కొందరు యజమానులు పాతబడిన బంగ్లాలను సొంతంగా తొలగించుకున్నారు. కాగా, గతేడాది వరకు వరంగల్ నగర వ్యాప్తంగా 495 శిథిల భవనాలు ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించి, నోటీసులు జారీ చేసి వదిలేశారు.

మీద మెరుగులు.. లోన శిథిలం

ట్రై సిటీలో చాలాచోట్ల శిథిల భవనాలను కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వరంగల్ చౌరస్తా, మండిబజార్, బట్టలబజార్, హనుమకొండ చౌరస్తా, ఇతర మెయిన్ జంక్షన్లలోని పాత బంగ్లాలకు పైపై మెరుగులు, హైఫై హంగులతో వివిధ షాపులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి నగరంలోని పురాతన బిల్డింగులు, పాతబడిన ఇండ్లను గ్రేటర్ టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ ఆఫీసర్లు తనిఖీ చేయాల్సి ఉంటుంది. 

బిల్డింగ్ జీవితకాలం, ప్రస్తుతం దాని పరిస్థితి, రిపేర్లు చేస్తే ఎంతకాలం పనికొస్తుందనే విషయాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన వాటికి రిపేర్లు చేయించుకునేలా ఆదేశాలివ్వాలి. మరీ ప్రమాదకరంగా ఉన్నవాటిని కూల్చేసేలా చర్యలు చేపట్టాలి. కానీ, కొంతమంది ఓనర్లు తమకు వచ్చే ఆదాయం, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆఫీసర్లను మేనేజ్​చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. దీంతోనే వర్షాలు కురిసిన సమయంలో శిథిల బిల్డింగులు కూలిపోయి అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. 

డేంజర్ జోన్ లో ప్రాణాలు..

వరంగల్ చార్ బౌళిలో దాదాపు మూడేండ్ల కింద ఓల్డ్ బిల్డింగ్ కూలి ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఆ తర్వాత మండిబజార్ లో పాత ఇల్లు కూలిపోయి ఇద్దరు చనిపోయారు. ఈ ఘటన కొద్దిరోజులకే మరో ఇల్లు కూలి ఒకరు మృత్యువాతపడ్డారు. ఇలా అడపాదడపా పాత బంగ్లాలు కూలి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నా, ఆఫీసర్లు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నగరంలోని ప్రైవేటు బిల్డింగులతో పాటు పలు ప్రభుత్వ భవనాలు కూడా డేంజర్ లో ఉండటం కలవరానికి గురి చేస్తోంది. 

వందలాది మంది చదివే ప్రభుత్వ ఐటీఐ బిల్డింగ్ తో పాటు ఎంజీఎం ఆస్పత్రిలో వివిధ బ్లాకులు, ఇతర ప్రభుత్వ ఆఫీసులు కూడా శిథిలావస్థకు చేరాయి. మరికొద్దిరోజుల్లోనే వర్షాలు ప్రారంభం కానున్నాయి. భారీ వర్షాలు కురిస్తే జనాల ప్రాణాలకు ముప్పు కలిగే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా గ్రేటర్ ఆఫీసర్లు శిథిల భవనాలపై తగిన చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.