ఢిల్లీలో ప్రార్థన మందిరం సమీపంలో కూల్చివేతలు: స్థానిక అల్లర్లతో హై టెన్షన్

ఢిల్లీలో ప్రార్థన మందిరం సమీపంలో కూల్చివేతలు: స్థానిక అల్లర్లతో హై టెన్షన్

అక్రమ నిర్మాణాల కూల్చివేత క్రమంలో పాత ఢిల్లీలో ఉద్రికత్త నెలకొంది. ఢిల్లీలోని రాంలీలా మైదానం సమీపంలో సయ్యద్ ఫయిజ్ ఇలాహి మసీదు దగ్గర  అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండగా  ఆందోళన కారులు అడ్డుకున్నారు. పోలీసులు, అధికారులపై ఆందోళన కారులు రాళ్లు రువ్వారు. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనకారుల దాడిలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. 

హైకోర్టు ఆదేశాలతో బుధవారం (జనవరి 7) తెల్లవారు జామున తుర్క్ మాన్ గేట్ సమపీంలోని సయ్యద్ ఫయిజ్ ఇలాహి మసీదు సమీపంలో ఢిల్లీ మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. వందేళ్ల నాటి మసీదు, స్మశాన వాటిక ను ఆనుకొని ఉన్న భూముల్లో అక్రమ నిర్మాణాలను 15 బుల్డోజర్లతో  కూల్చివేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా దూసుకొచ్చిన కొందరు యువకులు.. బారికేడ్లను దాటుకొని వచ్చి అధికారులు,పోలీసు సిబ్బందిపై రాళ్ళు రువ్వారు. దీంతో ఆందోళన కారులను చదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. 

గత ఏడాది నవంబర్‌లో తుర్క్‌మాన్ గేట్ సమీపంలోని రాంలీలా గ్రౌండ్‌లోని 38వేల940 చదరపు అడుగుల భూమిపై ఆక్రమణలను తొలగించేందుకు ఢిల్లీ హైకోర్టు ఎంసీడీ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యుడి)కి మూడు నెలల సమయం మంజూరు చేసింది. ఈక్రమంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఘటన తర్వాత అల్లర్లకు కారణమైన ఆందోళన కారులను గుర్తించేందుకు  పోలీసులు  సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఆందోళనకారులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలువురి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.