రెవెన్యూ సదస్సులు సాగదీతకేనా?

రెవెన్యూ సదస్సులు సాగదీతకేనా?
  • రెవెన్యూ సదస్సులు సాగదీతకేనా
  • భూ సమస్యలపై ఇప్పటికే మూడుసార్లు దరఖాస్తుల స్వీకరణ
  • మళ్లీ కొత్తగా తీసుకునేందుకు సదస్సులు
  • ఇప్పటికే ధరణిలో 5 లక్షల దరఖాస్తులు పెండింగ్  
  • 8.50 లక్షల సాదాబైనామా అప్లికేషన్లదీ ఇదే పరిస్థితి 
  • రెవెన్యూ చట్టంలో సవరణలే పరిష్కారమంటున్న నిపుణులు
  • రెవెన్యూ సదస్సుల్లో ఎమ్మెల్యేల పెత్తనంపై అభ్యంతరాలు

హైదరాబాద్, వెలుగు:  భూసమస్యలపై ఇప్పటికే మూడు సార్లు దరఖాస్తులు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్వీకరించేందుకు సిద్ధమైంది. వాట్సాప్​ లో ఒకసారి, ధరణిలో గ్రీవెన్స్ రిలేటెడ్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్  మాడ్యూల్​లో మరోసారి, ధరణిలోనే మాడిఫికేషన్​ రిక్వెస్ట్ అప్లికేషన్ ద్వారా ఇంకోసారి  అప్లికేషన్లు తీసుకున్నది. ఈసారి నేరుగా రైతుల నుంచే వినతులు తీసుకోబోతున్నది. ధరణిలోని వివిధ గ్రీవెన్స్​ మాడ్యూల్స్​ ద్వారా గతంలో పెట్టుకున్న దరఖాస్తులే సుమారు 5 లక్షల వరకు పెండింగ్ లో ఉన్నాయని, వాటినే పరిష్కరించని ప్రభుత్వం ఈ నెల 15  నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో వచ్చే అర్జీలను ఎలా పరిష్కరిస్తుందనే ప్రశ్న తలెత్తుతున్నది. సీఎం కేసీఆర్​ సొంత నియోజకవర్గంలో ధరణి పైలట్ విలేజ్​ గా తీసుకున్న ఒక్క ములుగు గ్రామంలోనే 272 దరఖాస్తులు రాగా.. 132 దరఖాస్తులు  నెల రోజులైనా పరిష్కారానికి నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా అక్కడో సమస్య, ఇక్కడో సమస్య లేదని, ప్రతి ఊరిలో  200 నుంచి 300 భూసమస్యలు ఉన్నాయని ధరణి సమస్యలపై పని చేస్తున్న రెవెన్యూ, లీగల్ ఎక్స్​ పర్ట్స్​ చెప్తున్నారు. సబ్ కమిటీ సిఫార్సులను అమలు చేసినా సగం సమస్యలు తీరేవని, కానీ ధరణిలో మాడ్యుల్స్​ తీసుకురాకుండా మరోసారి అప్లికేషన్లు తీసుకోవడం సాగదీతకేననే విమర్శలు వినిపిస్తున్నాయి .

పరిష్కారం చూపుతలే

సీఎం కేసీఆర్​ 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ను ప్రారంభించగా, అదే ఏడాది నవంబర్ 2 నుంచి పోర్టల్ యాక్టివిటీ ప్రారంభమైంది. భూవివాదాలు, సమస్యలు లేకుండా చేయడం కోసమే ధరణి పోర్టల్ తీసుకొచ్చినట్లు సీఎం అప్పట్లో ప్రకటించారు. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా రూపొందించిన డేటా ఆధారంగా ధరణి పోర్టల్ రూపొందించగా.. ఆ డేటా ఆధారంగానే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, విరాసత్, నాలా కన్వర్షన్ జరిగాయి. ఇవి తప్ప.. భూరికార్డుల ప్రక్షాళనలో జరిగిన తప్పిదాలను సవరించుకోవడం, మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులను సరిదిద్దడం, రికార్డుల్లో తప్పులు, భూమి స్వభావంలో దొర్లిన తప్పులు వంటి అనేక సమస్యలకు ధరణి పరిష్కారం చూపలేదు. 

– ధరణి ద్వారా అంతా బాగుందని కొన్నాళ్లు ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చినప్పటికీ.. 2021 జూన్ ఫస్ట్ వీక్​ లో  మంత్రి కేటీఆర్ ట్విట్టర్​ అకౌంట్​కు భూసమస్యలపై వినతులు వెల్లువెత్తాయి. దీంతో జూన్​ 5న తొలిసారిగా ధరణి పోర్టల్‌‌‌‌కు సంబంధించిన ఫిర్యాదులు, విజ్ఞప్తులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్, ఈ-–మెయిల్ ఐడీని ప్రభుత్వం ప్రకటించింది. వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్లు పరిష్కరించాలని ఆదేశించింది. దీంతో రోజుకు 2 వేలకుపైగా ఫిర్యాదుల చొప్పున 10 రోజుల్లో 23 వేల ఫిర్యాదులు అందాయి.  కానీ పది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.  సమస్యలు పంపిన బాధితులకు ‘దగ్గర్లోని మీసేవ కేంద్రానికి వెళ్లి ధరణి పోర్టల్ లోని గ్రీవెన్స్ రిలేటెడ్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్ ద్వారా అప్లై చేసుకోండి’ అంటూ సీసీఎల్ఏ నుంచి మెస్సేజ్ లు వెళ్లాయి. 

– ధరణి పోర్టల్ లో జూన్ 15న తొలిసారిగా గ్రీవెన్స్​ ఆన్ స్పెసిఫిక్​ ల్యాండ్ మ్యాటర్స్​ అనే ఆప్షన్​ అందుబాటులోకి వచ్చింది. ఈ ఆప్షన్​ లో భూసేకరణకు సంబంధించిన వినతులు, కరెక్షన్​ ఆఫ్​ ల్యాండ్ నేచర్, మిస్సింగ్ సర్వే నంబర్, డిజిటల్​ సైన్​ పెండింగ్​, ఆధార్​ నంబర్ లో తప్పులు, ఆధార్​ లింక్​ చేయకపోవడం, తండ్రి/భర్త పేరులో తప్పులు, కులం, జెండర్ వివరాల్లో తప్పులు, ఫొటో మిస్ మ్యాచ్ లాంటి సమస్యలపై ధరణి పోర్టల్ ద్వారా అప్పటికే పాస్​ బుక్స్​ కలిగిన వ్యక్తులు అప్లై చేసుకునేందుకు సర్కార్ వీలు కల్పించింది. కేవలం ఈ మాడ్యుల్ ద్వారానే 2021 డిసెంబర్ వరకు 2,26,625 అప్లికేషన్లు రాగా, ఈ ఏడాది మరో లక్ష వరకు అప్లికేషన్లు రావొచ్చని అంచనా. అసలు ఈ దరఖాస్తులు ఏ అధికారి లాగిన్​లోకి వెళ్లాయో ఇప్పటికీ ఎవరికి తెలియని పరిస్థితి.  

– రాష్ట్రంలో లక్షలాది ఎకరాల పట్టా భూములు పొరపాటున ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో చేరాయి. ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమల  కోసం ఒక సర్వే నంబర్​లో కొంత భూమిని సేకరిస్తే.. మొత్తం సర్వే నంబర్ నే ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చింది. అలాగే పట్టా భూములను కూడా ప్రభుత్వ భూములుగా, రెవెన్యూ ల్యాండ్స్ ను ఫారెస్ట్ , ఎండోమెంట్, వక్ఫ్ ల్యాండ్స్ గా మార్చడంతో నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. మాజీ సైనికులు, ఫ్రీడం ఫైటర్ల కు ఇచ్చిన అసైన్డ్ భూములు కూడా ఇదే జాబితాలో ఉన్నాయి. ఇలాంటి బాధితులు ధరణిలో అప్లికేషన్​ పెట్టుకునేందుకు ప్రభుత్వం 2021 మార్చి 26న ‘గ్రీవెన్స్ రిలేటింగ్ టు ఇన్​క్లూజన్ ఇన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్’ అనే ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో బాధితుల నుంచి సుమారు 2.50 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో సగానికిపైగా అప్లికేషన్లు పరిష్కారానికి నోచుకోవడం లేదు. 

– ఈ ఏడాది మే 28న ధరణిలో మాడిఫికేషన్​ రిక్వెస్ట్ అప్లికేషన్​ ద్వారా  పాస్‌‌‌‌బుక్‌‌‌‌లో పేరు సరిచేసుకోవడం, నేచర్ ఆఫ్ ల్యాండ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్‌‌‌‌లో మార్పులు, భూవిస్తీర్ణంలో హెచ్చుతగ్గులు సవరించడం, సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్ మిస్సయితే చేర్చడం, నోషనల్ ఖాతా నుంచి పట్టా భూమిగా మార్చడం, భూమి అనుభవంలో మార్పులకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. దరఖాస్తు ఫీజుగా రూ.1,000 వసూలు చేస్తున్నది. ఈ ఆప్షన్​ ద్వారా ఇప్పటికే 75 వేల అప్లికేషన్లు రాగా.. ప్రభుత్వానికి రూ. 7.50 కోట్ల ఆదాయం సమకూరినా సమస్యలు తీరలేదు. 

కొత్త రెవెన్యూ చట్టంలో సవరణలుచేస్తే తప్ప!

సాదాబైనామా(తెల్లకాగితాలు)పై భూములు కొనుగోలు చేసిన రైతులకు పట్టాదారు పాస్​ బుక్స్​ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న  ప్రధాన సమస్య ఇది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు సాదాబైనామాలతో కొనుగోలు చేసిన భూములను రెగ్యులరైజ్​ చేసుకునేందుకు 2016లో ప్రభుత్వం అవకాశమిచ్చింది. దీంతో 11.19 లక్షల మంది అప్లై చేసుకోగా 6.18 లక్షల అప్లికేషన్లను క్లియర్​ చేసింది. వివిధ కారణాలతో మిగతా వారికి పాస్​ బుక్స్​ జారీ కాలేదు. 2020 అక్టోబర్, నవంబర్ నెలల్లో రెండు విడతలుగా  మరోసారి 8.13 లక్షల సాదాబైనామా అప్లికేషన్లను ప్రభుత్వం తీసుకుంది. పట్టాదారు పాస్​ బుక్స్, ఆర్వోఆర్​ యాక్ట్ – 1971 ప్రకారమే వీటిని పరిష్కరించాల్సి ఉంది. అంతకుముందే  సెప్టెంబర్​లో రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్  యాక్ట్​ – 2020 అమల్లోకి రావడంతో.. పరిష్కారానికి చాన్స్ లేకుండాపోయింది. కొత్త రెవెన్యూ చట్టంలో సవరణలు చేస్తే తప్ప సాదాబైనామా అప్లికేషన్లకు మోక్షం కలిగేలా లేదు. 

కొలిక్కి రాని పైలట్ ప్రోగ్రాం

ఇటీవల సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్​లో భూసమస్యల పరిష్కారం కోసం పైలట్ గ్రామంగా ఎంపిక చేసిన ఒక్క ములుగు గ్రామంలోనే జూన్​ 14 నుంచి 24 వరకు 11 రోజుల్లో 272 అర్జీలు వచ్చాయి. ఇందులో ధరణి మాడ్యూల్స్​ పరిధిలోని 140 అప్లికేషన్లను మీసేవ కేంద్రాల్లో  నమోదు చేయించి, కలెక్టర్​ లాగిన్​ కు పంపించారు. ముగ్గురు  తహసీల్దార్లతోపాటు 25 మంది రెవెన్యూ  సిబ్బంది  11 రోజులు  ములుగులో మకాం వేసి, భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నప్పటికీ  భూరికార్డుల సవరణకు ధరణిలో మాడ్యూల్స్​ లేకపోవడం, ఆఫీసర్లు చేసిన తప్పులను కలెక్టర్ స్థాయిలో సరిదిద్దే అవకాశం లేక 132 అప్లికేషన్లను ఉన్నతాధికారులకు పంపారు. ఇందులో ఒకరి పేరు మీద ఉన్న భూమి వేరొకరి పేరిట రావడంలాంటి సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. కాగా, ఈ నెల 15 నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో ఎమ్మెల్యేల సారథ్యంపై విమర్శలు వస్తున్నాయి. చాలా చోట్ల  కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి అనచరులపై భూకబ్జా ఆరోపణలు ఉన్నాయని, అలాంటి వారి చేతికి బాధ్యతలు అప్పగిస్తే సామాన్య రైతుల పరిస్థితి ఏమిటని భూచట్టాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ధరణిలో ఆప్షన్లు లేకుండా ఎలా మారుస్తరు

కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ఇప్పటికే ధరణిలో ఉన్న భూరికార్డులను మార్చడానికి సివిల్ కోర్టులకు తప్ప ఎవరికి అధికారం లేదు. అందులో తప్పులున్నా చట్టం ప్రకారం చూసినప్పుడు ఆ రికార్డే ఫైనల్. సరిదిద్దాలంటే చట్ట సవరణ అవసరం. సాదాబైనామా దరఖాస్తులను రెగ్యులరైజ్​ చేయాలన్నా కొత్త చట్టాన్ని సవరించాల్సిందే. ధరణిలో ఆప్షన్లు ఇవ్వకుండా, చట్టంలో సవరణ లు చేయకుండా సమస్యలు పరిష్కారం కావు. 


-  వి.లచ్చిరెడ్డి, టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు