మొసళ్లు మింగాయా..? గోదావరి నదిలో గల్లంతైనపెద్దపల్లి జిల్లా యువకుని ఆచూకీపై గ్రామస్తుల అనుమానం..

మొసళ్లు మింగాయా..? గోదావరి నదిలో గల్లంతైనపెద్దపల్లి జిల్లా యువకుని ఆచూకీపై గ్రామస్తుల అనుమానం..

పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖాన్ సాయిపేట సమీపంలో యువకుడు గోదావరినది లో గల్లంతైన ఘటన గ్రామస్తులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. నదిలో మునిగిన వ్యవసాయ మోటార్ ను తీసే క్రమంలో సోమవారం (అక్టోబర్ 13) నీళ్లలోకి వెళ్లిన ఖాన్ సాయిపేట గ్రామ యువకుడు  గావిడి సూరి  బయటకు రాలేదు. దీంతో మొసళ్లు తినేశాయేమోననే అనుమానంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. 

నదిలో మునిగిన మోటారు బయటికి తీసేందుకు గురిసింగ రాజు, గావిడి సూరి అనే ఇద్దరు కూలీలు నీటిలో మునిగారు. నీటిలో మునిగిన గావిడి సూరి మళ్లీ బయటికి రాకపోవడం తో భయంతో మరో కూలీ గురిసింగ రాజు ఒడ్డుకు చేరాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.

ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో మొసలి మింగిందా లేదా నీటిలో గల్లంతయ్యాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు, గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు. గోదావరిలో ఇప్పటికే చాలా సార్లు మొసళ్ళు కనబడ్డాయని.. ఇది మొసళ్ళ అభయారణ్యం గా పిలుస్తారని గ్రామస్తులు తెలిపారు. యువకుడి ఆచూకీ కోసం పోలీస్, ఫైర్ శాఖల అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.