ఏక్నాథ్ ఏం చేయబోతున్నారు ?

ఏక్నాథ్ ఏం చేయబోతున్నారు ?

ఏక్నాథ్ షిండే సహా 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ అనర్హత నోటీసులు జారీ చేశారు. మిగతా వారికి కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఏక్ నాథ్ షిండే అండ్ టీం అస్సాంలోని గౌహతిలో తాము ఉంటున్న హోటల్ కు సీనియర్ న్యాయ నిపుణులను పిలిపించి చర్చించినట్లు తెలుస్తోంది. వారి నుంచి న్యాయ సలహాలు తీసుకున్నట్లు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో ఏక్ నాథ్ షిండే ముందున్న మార్గాలేంటి ? రానున్న రోజుల్లో ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ? అనేది ఆసక్తికరంగా మారింది.

అనర్హత వేటు పడితే.. కోర్టుకు

ఒకవేళ డిప్యూటీ స్పీకర్ జారీ చేస్తున్న అనర్హత నోటీసులకు ఏక్ నాథ్ షిండేతో ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు సరైన సమాధానం ఇవ్వలేకపోతే పరిస్థితులు మరోలా మారొచ్చు. ముందస్తు ప్రకటనతో.. ఈనెల 22న నిర్వహించిన పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి రెబల్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారని శివసేన అధినాయకత్వం ఆరోపిస్తోంది. డిప్యూటీ స్పీకర్ కు ఇటీవల చేసిన ఫిర్యాదులోనూ ఈ అభియోగాలనే పేర్కొంది.  ఇవి నిరూపితమై 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే.. ఏక్ నాథ్ చేస్తున్న తిరుగుబాటు ప్రయత్నాలన్నీ విఫలమయ్యే చాన్స్ ఉంది.  చివరకు ఎమ్మెల్యే పదవిని కూడా ఆయన కోల్పోవాల్సి రావచ్చు. ఒకవేళ అలాంటి చర్యలు తీసుకునే పరిస్థితే ఏర్పడితే షిండే కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే అదంతా సుదీర్ఘ ప్రక్రియ. 
 
మరో పార్టీలో ఎమ్మెల్యేల విలీనం

మరో మార్గంగా ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర గవర్నర్ కు లేఖ రాసి.. అవిశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించాలని కోరే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.  ఒకవేళ ఈ మేరకు గవర్నర్ ను వారు కోరాలంటే.. తొలుత మూడింట రెండోవంతు  రెబల్ ఎమ్మెల్యేలను మరేదైనా పార్టీలో విలీనం చేయాల్సి ఉంటుందని అంటున్నారు.   

‘బాల్ థాక్రే’ సిద్ధాంతాల వాదనకు విఘాతం కలుగకుండా.. 

ఒకవేళ శివసేన రెబల్ ఎమ్మెల్యేల వర్గం ఏదైనా పార్టీ లో చేరితే.. వాళ్లు చెబుతూ వస్తున్న ‘బాల్ థాక్రే’ సిద్ధాంతాల వాదనకు విఘాతం కలుగుతుంది. ఈనేపథ్యంలో  స్వతంత్ర ఎమ్మెల్యే బచ్చు కుడుకు చెందిన ప్రహార్ జనశక్తి పార్టీలోకి రెబల్ ఎమ్మెల్యేలను విలీనం చేసే అవకాశాలు ఉండొచ్చని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి.. 

ఇవన్నీకాకుండా.. శివసేన నాయకత్వం మొత్తాన్ని చేజిక్కించుకోవాలని ఏక్ నాథ్ షిండే భావిస్తే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ఎదుట అందుకు తగిన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే శివసేన క్షేత్ర స్థాయి కార్యకర్తల మద్దతు తమకే ఉందని ఉద్ధవ్ థాక్రే చెబుతున్నారు.  అధి నాయకత్వంపై తిరుగుబాటు చేసే హక్కు పార్టీ శ్రేణులకు లేదని స్పష్టం చేస్తున్నారు.  

ఉద్ధవ్ తో చర్చలు.. 

శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేతో చర్చలు జరిపి, తన డిమాండ్లను నెరవేర్చాలని ఏక్ నాథ్ షిండే కోరొచ్చు. కానీ మాటల యుద్ధం ముదిరిన ప్రస్తుత తరుణంలో వారిద్దరు ఒకచోటకు చేరి, చర్చలు జరిపే అవకాశాలు దాదాపు లేవని పరిశీలకులు చెబుతున్నారు.