
భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. వర్షాల కారణంగా రాయగఢ్ జిల్లాలోని మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 30 మందికిపైగా కనిపించకుండా పోయారు. భారీ వర్షాల కారణంగా మహడ్ తలైలో కొండ చరియలు విరిగిపడ్డాయని, దీనివల్ల ఐదురు మరణించారని జిల్లా కలెక్టర్ నిధి చౌదరి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన రెస్క్యూ టీం.. ఘటనాస్థలానికి చేరుకొని 15 మందిని కొండ చరియల కింది నుంచి వెలికి తీసినట్లు తెలిపారు. శిథిలాల కింద సుమారు 30 మంది చిక్కుకుపోయి ఉంటారని ఆమె తెలిపారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయకచర్యలు కొనసాగిస్తున్నాయన్నారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందు జాగ్రత్తగా రాష్ట్రంలో రెడ్ మరియు ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది.