
- కాశ్మీర్‌లో ఐదుగురు జవాన్లు మృతి.. మరో ఆరుగురికి గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లా మాచేడి ఏరియాలో ఇండియన్ ఆర్మీ కాన్వాయ్‌పై టెర్రరిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కథువా నుంచి 150 కి.మీ దూరంలో ఉన్న మాచేడి–-కిండ్లీ–-మల్హర్ రోడ్డుపై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ దాడి జరిగింది. గాయపడిన సోల్జర్లను వెంటనే ఆర్మీ ఆస్పత్రికి తరలించారు.
టెర్రరిస్టులు మొదట కాన్వాయ్‌పై గ్రనేడ్ విసిరారని అధికారులు వెల్లడించారు. వెహికల్ ఆగిపోవడంతో జవాన్లపై కాల్పులు జరిపారని చెప్పారు. జవాన్లు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపేలోపే టెర్రరిస్టులందరూ దగ్గరలోని అడవిలోకి పారిపోయారని వివరించారు. సమాచారం అందుకున్న వెంటనే అదనపు బలగాలు ఘటనాస్థలానికి చేరుకుని కూంబింగ్ చేపట్టినట్లు తెలిపారు.
48 గంటల్లో రెండో అటాక్
గడిచిన 48 గంటల్లో జమ్మూ ప్రాంతంలో జవాన్లపై టెర్రరిస్టులు దాడికి పాల్పడటం ఇది రెండోసారి. ఆదివారం రాజౌరీ జిల్లాలోని ఆర్మీ క్యాంపుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ సైనికుడికి గాయాలయ్యాయి. కాగా.. జమ్మూకాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. శనివారం ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్లలో పారా ట్రూపర్‌తో సహా ఇద్దరు సైనికులు మరణించారు. మరో జవాన్ గాయపడ్డాడు