
- లడఖ్‌లో ఆకస్మిక వరదలతో ప్రమాదం
- రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఖర్గే, రాహుల్, ప్రియాంక సంతాపం
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో శనివారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటుచేసుకుంది. లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్(వాస్తవ నియంత్రణ రేఖ) సమీపంలో భారత జవాన్లు విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు చనిపోయారు. విన్యాసాల్లో భాగంగా సోల్జర్లు టీ-72 యద్ధ ట్యాంక్‌తో ష్యోక్ నదిని దాటుతుండగా ఆకస్మిక వరద వచ్చిందని అధికారులు చెప్పారు. దీంతో నీటి ఉధృతికి నదిలో ట్యాంక్ మునిగిపోయిందని.. అందులోని జవాన్లు కొట్టుకుపోయారని చెప్పారు. సైన్యం వెంటనే సహాయక చర్యలు చేపట్టిందని.. జవాన్ల కోసం నదిలో గాలించిందని వివరించారు. అయితే, దురదృష్టవశాత్తూ వారంతా మృతి చెందినట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. మృతుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి కూడా ఉన్నారని వెల్లడించారు. కాగా, సోల్జర్ల మృతిపై కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.