
- జేఎన్టీయూహెచ్లో మూడు రోజుల పాటు నిర్వహణ
- ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభించే అవకాశం
- ప్రభుత్వానికి వివరాలు పంపిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: జేఎన్‌టీయూహెచ్ వేదికగా ఫిబ్రవరిలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఐదువేల మంది ప్రతినిధులు అటెండ్ అయ్యే అవకాశం ఉందని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐఎస్ సీఏ) అంచనా వేసింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జేఎన్టీయూహెచ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
మొత్తం 14 అంశాలపై చర్చించనున్నారు. దానికి తగ్గట్టు పేపర్ ప్రజెంటేషన్స్, సెమినార్స్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ, అగ్రికల్చర్, టెక్నికల్, కెమికల్ సైన్స్, ఫిషరీస్, యానిమల్.. ఇలా వివిధ స్పెషలైజేషన్స్ పై పేపర్ ప్రజెంటేషన్ ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా సైంటిస్టులు, డీఆర్డీఏ, సీఎస్ఐఏ, రీసెర్చ్ స్కాలర్స్, సీనియర్ ప్రొఫెసర్లు పేపర్స్ సబ్మిట్ చేయనున్నారు. వీటిలో నుంచి కొన్నింటిని ఐఎస్‌సీఏ ఫైనల్ చేస్తుంది. వారికి సదస్సులో ప్రజెంట్ చేసే అవకాశం ఇస్తుంది.
14 స్పెషలైజేషన్ ప్రజెంటేషన్లు
జేఎన్టీయూహెచ్లోని క్రికెట్ గ్రౌండ్లో మొదటి రోజు ఇనాగ్రల్ సెషన్ పెట్టేలా వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో.. సుమారు 6వేల మంది పాల్గొనేలా ఫెసిలిటీలు కల్పిస్తున్నారు. జేఎన్టీయూహెచ్తో పాటు సుల్తాన్ పూర్ జేఎన్టీయూ కాలేజ్‌లో ప్రజెంటేషన్స్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సుల్తాన్ పూర్ కాలేజీలో మూడు లేదా నాలుగు స్పెషలైజేషన్స్ నిర్వహించనున్నట్టు తెలిసింది.
14 స్పెషలైజేషన్ ప్రజెంటేషన్స్‌కు 14 కమిటీలతో పాటు కో ఆర్డినేషన్ కమిటీని జేఎన్టీయూహెచ్ ఏర్పాటు చేయనున్నది. దీంతో పాటు సదస్సు నిర్వహణ కోసం రిసెప్షన్ కమిటీ, ఫుడ్ కమిటీ, ట్రాన్స్ పోర్ట్ కమిటీ, మీడియా కమిటీ, ప్రింటింగ్ పబ్లిసిటీ కమిటీ, కల్చరల్ కమిటీ... అంటూ 15 ప్యానెల్స్‌ను ఫామ్ చేసింది.
విద్యాశాఖ సెక్రటరీకి సదస్సు వివరాలు
మరోపక్క ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు నిర్వహణకు జేఎన్టీయూ అధికారులు ప్రభుత్వ అనుమతి కోసం అప్లై చేశారు. తాజాగా విద్యాశాఖ సెక్రటరీ బుర్ర వెంకటేశంకు వర్సిటీ అధికారులు వివరాలు అందజేశారు. కాగా, సీఎంవోకు సమాచారం అందించి, ఆ తర్వాత స్పష్టత ఇవ్వనున్నారు. అయితే, ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో సర్కారు పెద్దలకు సమాచారం లేకుండా ముందుగానే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు జేఎన్టీయూహెచ్ ఉన్నతాధికారులు అంగీకరించడంపై కొంత విమర్శలు వినిపిస్తున్నాయి.
23 నుంచి ప్రారంభం..?
109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ఫిబ్రవరి 23 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించాలని ఐఎస్‌సీఏ భావిస్తున్నది. ప్రధాని మోదీ షెడ్యూల్ కోసం వెచిచూస్తున్నట్టు తెలిసింది. ఇదే షెడ్యూల్ ఫైనల్ అయితే, 23న ప్రధాని సదస్సును ప్రారంభించే అవకాశం ఉంటుంది. కాగా, ఫిబ్రవరి 22 ఐఎస్‌సీఏ కౌన్సిల్ సమావేశంతో పాటు ఎగ్జిక్యూటీవ్ కమిటీ మీటింగ్ జేఎన్టీయూలోనే ఉండనున్నది. మూడు రోజుల సెమినార్ తర్వాత, 26న ఐఎస్‌సీఏ జనరల్ బాడీ సమావేశం ఉంటుంది. ఈ భేటీలో కొత్త కమిటీని ఎన్నుకుంటారు.