లో దుస్తులు విప్పాలని ఆదేశించిన వారిపై కేసులు

లో దుస్తులు విప్పాలని ఆదేశించిన వారిపై కేసులు

కేరళలో జులై 17న నీట్ పరీక్షకు హాజరైన పలువురు విద్యార్థినులను లో దుస్తులు( బ్రా)  విప్పాలంటూ బలవంతం చేసిన ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు మహిళలు పరీక్షల నిర్వహణ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి తోడ్పాటు అందించే ఒక ఏజెన్సీ ద్వారా నియమితులైనట్లు గుర్తించారు. మిగతా ఇద్దరు మహిళలు కొల్లాంలోని ఆయూర్ లో ఉన్న ఓ ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేస్తున్నట్లు వెల్లడైంది. లో దుస్తుల్లో మెటాలిక్ హుక్ ఉన్నందున వాటిని తొలగించాకే పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలని ఈ ఐదుగురు మహిళలు షరతు విధించారని బాధిత విద్యార్థినులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపై ఐపీసీ 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

జులై 17న అసలేం జరిగింది ? 

కేరళలోని కొల్లాంలో ఉన్న మార్ తోమా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో నీట్ పరీక్షా కేంద్రం ఏర్పాటైంది. మామూలుగా మెటల్ వస్తువులు నీట్ పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అయితే  పరీక్ష రోజున( జులై 17న) ఈ నిబంధనను సాకుగా చూపించి అవమానకరంగా ప్రవర్తించారు.  లో దుస్తుల్లో (బ్రా) మెటాలిక్ హుక్ ఉన్నందున, వాటిని తొలగించాకే పరీక్షా కేంద్రంలోకి రావాలని షరతు విధించారు. దీంతో దాదాపు 100 మంది విద్యార్థినులు చేసేదేం లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నిబంధనను పాటించారు. ఎగ్జామ్ అనంతరం విద్యార్థినుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో తామంతా మానసిక వేదనకు గురయ్యామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఆరోపణలను మార్ తోమా కాలేజీ యాజమాన్యం ఖండించింది. తమ కళాశాలలో కేవలం పరీక్ష నిర్వహించేందుకు మాత్రమే అనుమతులిచ్చామని, తనిఖీలు, బయోమెట్రిక్ వంటివి వేరే వ్యక్తులు చూసుకున్నారని తెలిపింది.