వరంగల్‍ పద్మాక్షి, సిద్ధేశ్వర, వీరపిచ్చమాంబ ఆలయ భూముల కబ్జా

వరంగల్‍ పద్మాక్షి, సిద్ధేశ్వర, వీరపిచ్చమాంబ ఆలయ భూముల కబ్జా
  • ఆలయ భూములు కబ్జా వీడేనా?
  • లోకాయుక్తలో భూముల పరిరక్షణకు నేటికి 5 ఏండ్ల పోరాటం
  • జడ్జి మొట్టికాయలతో అప్పట్లో డిజిటల్‍ సర్వే చేసిన ఆఫీసర్లు 
  • ఆక్రమణలని తెలిసినా కూల్చట్లే, కోర్టు పిలిస్తే వెళ్లట్లే..
  • కబ్జాదారులకు మంత్రి సురేఖ వార్నింగ్‍ 

వరంగల్, వెలుగు: ఓరుగల్లు నడిబొడ్డున హనుమకొండ పద్మాక్షి ఆలయ భూములను కబ్జా చేసినవారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఐదేండ్ల కింద జులై 22న భూముల పరిరక్షణకు కొందరు సామాజికవేత్తలు కోర్టుకు వెళ్లారు. జడ్జి మొట్టికాయలు వేయడంతో  సర్వే చేపట్టిన అధికారులు కబ్జాలు నిజమేనని రిపోర్ట్​ సైతం ఇచ్చారు. కానీ, చర్యలు తీసుకోవాలనే డైరెక్షన్‍ను మాత్రం పట్టించుకోవట్లేదు. కోర్టు వాయిదాలకు వెళ్లట్లేదు. అధికారులు కావాలనే కోర్టుకు హాజరు కాకుండా కబ్జాదారులకు తెరవెనుక సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

భూముల విలువ రూ.300 కోట్లు..

ఏండ్ల నుంచి ఇక్కడి ప్రజలు హనుమకొండ పద్మాక్షి ఆలయం వద్ద బతుకమ్మ ఆడుకుంటారు. ఈ స్థలాలపై కొందరి లీడర్ల కండ్లు పడ్డాయి. ఇక్కడ గజం స్థలం రూ.40 నుంచి 50 వేల చొప్పున ఎకరానికి రూ.15 కోట్ల నుంచి రూ.20 పలుకుతోంది. దీంతో దాదాపు రూ.150 కోట్లు విలువ చేసే పద్మాక్షి, సిద్దేశ్వర, వీరపిచ్చమాంబ ఆలయాలకు చెందిన సుమారు 10 ఎకరాల స్థలాన్ని కార్పొరేటర్లు, లీడర్లు, బిల్డర్లు, విద్యావేత్తల ముసుగులో ఉన్నోళ్లు కబ్జా చేశారు. ఇవేగాక హనుమకొండ చౌరస్తా చిన్న, పెద్ద కోవెల ప్రాంతంలోని రంగనాయకస్వామి, బ్రాహ్మణవాడ, ములుగు రోడ్డు, పెద్దమ్మగడ్డ ఏరియాల్లోని ఆలయాలకు సంబంధించిన 9.32 ఎకరాలు, వరంగల్​వేణుగోపాలస్వామి గుడికి చెందిన 1.11 ఎకరాల భూమిపై అక్రమార్కుల కండ్లు పడ్డాయి. వీటి విలువ సైతం తక్కువలో తక్కువ రూ.150 కోట్లు ఉంటుంది. మొత్తంగా బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.300 కోట్లు పలుకుతోంది. 

లోకాయుక్త ఆదేశాలతో కబ్జా తేల్చిన్రు..

హనుమకొండ పద్మాక్షి ఆలయానికి అధికారుల లెక్కల ప్రకారమే 72.23 ఎకరాలు, సిద్ధేశ్వర టెంపుల్ 882, 889, 922 సర్వే నంబర్​లో 24.03 ఎకరాలు, సర్వే నంబర్ 879లో వీర పిచ్చమాంబ దేవాలయానికి 1.14 ఎకరాలు ఉన్నాయి. రికార్డుల్లో 898 సర్వే నంబర్​లో దేవాదాయశాఖకు 78.30 ఎకరాల భూములున్నాయి. అక్రమార్కులు ఆలయ భూములను కబ్జాపెట్టారు. దీనిపై ''రాష్ట్ర వినియోగదారుల మండలి, కాకతీయ ఆస్తుల పరిరక్షణ వేదిక'' 
ఆధ్వర్యంలో ఐదేండ్ల కింద లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. జస్టిస్‍ సీ.వీ.రాములు స్పందించారు. 

దేవాదాయ, గ్రేటర్, కుడా, కొలతల శాఖల అధికారులు సంయుక్తంగా డిజిటల్ సర్వేతో ఆక్రమణలు గుర్తించి రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఆపై దేవాదాయశాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంతరావు, అసిస్టెంట్‍ కమిషనర్‍ వీరస్వామి, అసిస్టెంట్‍ డైరెక్టర్‍ ప్రభాకర్‍తో కూడిన టీం 2022 జనవరి 5న కోర్టుకు కబ్జాలపై మొదటి సర్వే రిపోర్ట్​ అందించారు. బీఆర్‍ఎస్‍ కి చెందిన ఓ ఎమ్మెల్సీ కాలేజీ, అప్పటి గులాబీ పార్టీ నేత ఒత్తిడితో పెట్రోల్‍ బంక్‍ ఏర్పాటుకు ఇచ్చిన స్థలం, ఓ కార్పొరేటర్‍ నిర్మించిన అపార్టుమెంట్‍, శ్మశాన వాటికలు, మరో  కార్పొరేటర్ ఇనిస్టిట్యూషన్, ఐటీఐ కాలేజీ ఈ భూముల్లోనే ఉన్నట్లు విచారణలో తేల్చారు. 

కబ్జాలకు సహకారం..! 

ఆఫీసర్ల సహకారంతోనే ఆలయ భూముల కబ్జాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉండగా, అధికారులతీరు దీనికి బలాన్నిస్తోంది. కబ్జాలు నిజమేనని లోకాయుక్త కోర్టుకు రిపోర్ట్​ ఇచ్చిన ఆఫీసర్లు భూముల్లోని ఆక్రమణలను తొలగించాలనే కోర్టు ఆదేశాలను మాత్రం పట్టించుకోలేదు. సర్వే నంబర్లు 918, 922, 877, 898 భూముల్లో సర్వే చేపట్టాలనే ఆదేశాలను అమలు చేయలేదు. చర్యలపై నాన్చుడు ధోరణిపై 2022 ఆగస్టులో విచారణ సందర్భంగా జడ్జి రాములు మరోసారి జిల్లా అధికారులపై సీరియస్‍ అయ్యారు. 

కొన్ని నెలలకు న్యాయమూర్తి మారడంతో అధికారులు కోర్టు ఆదేశాలను పక్కనపెట్టారు. లోకాయుక్త కొత్త న్యాయమూర్తిగా వచ్చిన జస్టిస్‍ రాజశేఖర్‍రెడ్డి మళ్లీ విచారణ చేపట్టారు. 10 రోజుల కింద జరిగిన విచారణకు మరోసారి అధికారులు హాజరుకాకపోవడంతో ఆగస్టు 8వ తేదీకి వాయిదా వేశారు. ఈసారి శాఖ డిప్యూటీ, అసిస్టెంట్‍ కమిషనర్లు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించడంతో ఎటువంటి చర్యలు ఉంటాయనే ఆసక్తి నెలకొంది. 

మంత్రి సురేఖ హెచ్చరిక.. 

సిటీలోని పద్మాక్షి, సిద్దేశ్వర, వీరపిచ్చమాంబతో పాటు మరో రెండు ఆలయాల భూముల కబ్జా అంశంలో అధికారుల తీరుపై ఫిర్యాదులు ఉన్నాయి. భద్రకాళి ఆలయ చెరువు కబ్జాల నేపథ్యంలో సర్వే చేపట్టి రిపోర్టు ఇవ్వాలనే లోకాయుక్త ఆదేశాలను అధికారులు లైట్‍ తీసుకున్నారు. విచారణ సమయంలో ఏదో ఒక సాకుతో నెట్టుకొస్తూ కబ్జా లీడర్లకు సహకారం అందిస్తున్నారు. ఈనెల 10న మంత్రి కొండా సురేఖ భద్రకాళి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఆలయానికి రాగా, ఆలయ భూముల కబ్జాతో పాటు భద్రకాళి చెరువు సర్వేలో అలసత్వాన్ని కొందరు మంత్రికి వివరించారు. 

దీనిపై సురేఖ సీరియస్‍గా స్పందించారు. ఆలయ భూములు కబ్జాచేస్తే సహించేది లేదన్నారు. పాత రికార్డులు తెప్పించుకున్నానని, అవసరమైతే కోర్టు డైరెక్షన్‍ ద్వారానైనా ఆలయ భూములు ఆలయాలకే దక్కేలా చూస్తామని చెప్పడంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది.