13 నిమిషాల్లో 111 బాణాల సంధింపు.. చెన్నై చిన్నారి సూపర్ ఫీట్

13 నిమిషాల్లో 111 బాణాల సంధింపు.. చెన్నై చిన్నారి సూపర్ ఫీట్

చెన్నై: తమిళనాడు క్యాపిటల్ సిటీ అయిన చెన్నైకి చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి సంజన తన అద్భుతమైన ప్రతిభతో అందర్నీ ఆకర్షిస్తోంది. తన టాలెంట్ గురించి తెలుసుకుంటే మీరు కూడా ఆ చిన్నారిని మెచ్చుకోక ఉండలేరు. ఇంతకీ ఆ బాలిక ప్రతిభ ఏంటో తెలుసుకుందాం రండి.. ఆర్చరీలో ఫెంటాస్టిక్ టాలెంట్ ఉన్న సంజన కేవలం 13 నిమిషాల్లో 111 బాణాలు సంధించింది. ఇది విన్నాక నోరెళ్ల బెట్టకండి. తను దీన్ని ఎలా చేయగలిగిందో తెలుసుకుంటే మరింత ఆశ్చర్యపోవాల్సిందే. పంద్రాగస్టు రోజున గాలిలో తలక్రిందులుగా వేలాడుతూ సంజన ఈ ఫీట్‌ను సాధించడం విశేషం.

‘చెన్నైకి చెందిన ఐదేళ్ల చిన్నారి సంజన హ్యూమన్ అల్టిమేట్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. కేవలం 13.15 నిమిషాల్లో 111 బాణాలు సంధించింది’ అని ప్రముఖ వార్తా ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌లో సంజన కోచ్ స్టేట్‌మెంట్‌ను కూడా ఏఎన్‌ఐ జత చేసింది. త్వరలో ఈ ఫీట్‌కు సంబంధించిన ఆధారాలను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపనున్నామని కోచ్ చెప్పారు. ఈ ఫొటోలను ఏఎన్‌ఐ ట్విట్టర్‌‌లో పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే 800 లైక్‌లు వచ్చాయి. చిన్నారిని ప్రశంసిస్తూ నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సంజనను అవెంజర్‌‌గా పేర్కొంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ చిన్నారి ఇండియా ఆర్చరీని పునరుజ్జీవం చేస్తుందని, దేశాన్ని ప్రపంచంలో టాప్‌లో నిలబెడుతుందని.. గర్వించే బిడ్డ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.