- 25 ఎకరాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కృషి
- విదేశాల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యం
- మంత్రి వివేక్ వెంకటస్వామి
- వినాయక లడ్డూ వేలంలో పాల్గొన్న మంత్రి
కోల్‌బెల్ట్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గ పరిధిలో విద్య, వైద్యపరమైన సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలో మంత్రి పర్యటించారు. మందమర్రి మార్కెట్లో మంత్రి, సింగరేణి యాజమాన్యం సంయుక్తంగా ఏర్పాటు చేసిన సింగరేణి వరసిద్ధి వినాయక మండలి ప్రతిష్టించిన భారీ గణనాథుడి లడ్డూ వేలం కార్యక్రమంలో సింగరేణి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణతో కలిసి పాల్గొని పూజలు చేశారు. వేలంలో రూ.1,00,016కు లడ్డూ దక్కించుకున్న రావికంటి శాలినిని, రూ.16 వేలకు గణపతి మాలను పొందిన సింగరేణి కార్మిక లీడర్ ఎడుకోల పవన్ కుమార్‌ను సన్మానించారు.
టామ్‌కామ్ రాష్ట్రానికే రోల్ మోడల్
మందమర్రి సింగరేణి సింటార్స్లోని టామ్కామ్సెంటర్లో జర్మనీ భాష నేర్చుకుంటున్న యువతీయువకులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సెంటర్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రూ.25 లక్షల వేతనాలు పొందే అంతర్జాతీయ ఉద్యోగవకాశాలను రాష్ట్ర యువతకు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. జర్మనీ, ఇతర దేశాల్లో ఉద్యోగాలు కల్పించి మందమర్రి టామ్కామ్ను రాష్ట్రానికే రోల్ మోడల్‌గా మార్చుతామని పేర్కొన్నారు.
జీవో 76 ద్వారా పట్టాలిస్తాం
సింగరేణి యాజమాన్యం సహకారంతో మందమర్రిలోని యూపీ పీహెచ్‌సీని కొత్తగా 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చబోతున్నామని మంత్రి చెప్పారు. సింగరేణి కంపెనీ వద్ద ఉన్న 25 ఎకరాల భూమిని ప్రభుత్వానికి సరెండర్చేస్తే అందులో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి అర్హులకు అందజేయనున్నట్లు చెప్పారు. మందమర్రిలో మూడు నెల్లల్లో పూర్తిస్థాయిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
మానసిక ఆందోళనతో మాట్లాడుతుండు
జైపూర్ మండలంలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ.. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల ఆదరణతో 40 ఏండ్లుగా కాకా కుటుంబం రాజకీయాల్లో ఉందన్నారు. పెద్దపల్లిలో వంశీకృష్ణ గెలిస్తే పక్కన ఉన్న ఇతర స్థానాలు బీజేపీకి దక్కాయని.. ఇది కాకా కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఏజ్ పెరిగి మానసిక ఆందోళనతో తమపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మూడేండ్ల కాలంలో ఏకంగా రూ.470 కోట్ల అప్పు ప్రేమ్‌సాగర్‌రావు ఎలా చెల్లించాడని బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు ప్రశ్నిస్తున్నారని, మొదట వారికి సమాధానం చెప్పాలని మంత్రి హితవు పలికారు. ప్రజలకు సేవ చేయడం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే తమ కుటుంబం పని అని మంత్రి స్పష్టం చేశారు.
