ముంబైలో భారీ వర్షాలు.. పలు విమానాలు హైదరాబాద్‌కు మళ్లింపు

ముంబైలో భారీ వర్షాలు.. పలు విమానాలు హైదరాబాద్‌కు మళ్లింపు

దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. మహా నగర వీధులు వర్షపు నీటితో చెరువులను తలపిస్తున్నాయి. ఈ వర్షాల వల్ల స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. వర్షపు నీటితో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు విమానాలు రద్దవ్వగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సిఎస్‌ఐఎ)లో దిగాల్సిన 14 విమానాలను హైదరాబాద్‌కు దారి మళ్లించారు.  

దారి మళ్లించిన విమానాలు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ) సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. దిగిన పద్నాలుగింటిలో పది అంతర్జాతీయ విమానాలు ఉన్నాయి. దోహా(ఖతార్)లోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 3, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి 2, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం,  అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. 

మిగిలిన ఐదు మస్కట్, కొలంబో, ఫుకెట్, అడిస్ అబాబా, అజర్‌బైజాన్‌లోని హేదర్ అలియేవ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వచ్చినవి. మరో నాలుగు దేశీయ విమానాలు. జైపూర్, కొచ్చిన్, గోవా, నాగ్‌పూర్ ప్రాంతాల నుండి వచ్చాయి.

ముంబై ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రకారం, దాదాపు 27 విమానాలను RGIA (హైదరాబాద్), సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (అహ్మదాబాద్‌), దేవి అహల్యాబాయి హోల్కర్ ఎయిర్‌పోర్ట్ (ఇండోర్‌) వంటి సమీప ఎయిర్ స్టేషన్‌లకు మళ్లించారు. రానున్న మూడు రోజుల పాటు ముంబైతో పాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. దీంతో నగరానికి ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.