సోమాలియా యువతికి మాదాపూర్ డాక్టర్లు అరుదైన సర్జరీ

సోమాలియా యువతికి మాదాపూర్ డాక్టర్లు  అరుదైన సర్జరీ

మాదాపూర్, వెలుగు :  బోధకాలు వ్యాధితో బాధపడుతున్న  సోమాలియాకు చెందిన యువతికి మాదాపూర్ మెడికవర్ డాక్టర్లు విజయవంతంగా సర్జరీ చేశారు. మంగళవారం మెడికవర్ ఆస్పత్రిలో నిర్వహించిన సమావేశంలో డాక్టర్లు మీడియాకు వివరాలు తెలిపారు. సోమాలియాకు చెందిన యువతి (18)కి  ఏడేళ్లుగా ఎడమ కాలు వాపు ఉంది. తొలుత సాధారణ వాపుగానే భావించినా,  ఎక్కువ కావటం, క్రమంగా సైజుపెరగటం మొదలైంది.

3 ఏండ్లుగా ఆమె పూర్తిగా మంచానికి పరిమితమైంది. ట్రీట్​మెంట్ కోసం యువతి అనేక దేశాల్లోని ఆస్పత్రులకు వెళ్లింది.  అయినా ఎలాంటి నివారణ, చికిత్స పొందలేకపోయారు. చివరకు మెడికవర్ ఆస్పత్రిలోని వాస్క్యులర్ విభాగానికి రాగా... ఆరోగ్య స్థితిని పూర్తిగా పరిశీలించారు. పేషెంట్​కు లింఫెడెమా నాస్ట్రస్ వెరుకోసా (బోదకాలు)  ఉన్నట్లు నిర్ధారించారు. డాక్టర్‌‌‌‌ సయ్యద్ మహ్మద్ అలీ అహ్మద్‌‌‌‌ వాస్కులర్ సర్జికల్ బృందం, డాక్టర్ మధు వినయ్ నేతృత్వం లోని ప్లాస్టిక్ సర్జరీ బృందం, డాక్టర్ వేణుగోపాల్ నేతృత్వంలోని అనస్థీషియా బృందం ఆమెకు దశలవారీ సర్జరీ చేయాలని నిర్ణయించారు. డీబల్కింగ్, చివరకు స్కిన్ గ్రాఫ్టింగ్‌‌‌‌తో రోగి లింఫోవెనస్ అనస్టామోసిస్ (సర్జరీ)  చేశారు.  

ఆమె ఒక్క కాలు నుంచి 50 కిలోల కంటే ఎక్కువ కణజాలాలను డాక్టర్లు తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ‘లింఫెడెమా నోస్ట్రస్ వెరుకోసా (బోధకాలు)కు చికిత్స ఉంది. దీనిపై రోగికి తగిన అవగాహన చాలా ముఖ్యం. సమస్య పెద్దది కాకుండానే మూల కారణం అన్వేషించి తగిన చికిత్స పొందితే త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి’ అని డాక్టర్  సయ్యద్ మహ్మద్ అలీ అహ్మద్‌‌‌‌, డాక్టర్ మధు వినయ్ తెలిపారు.