
ICICI UPI Charges: దేశంలోని యూపీఐ లాండ్ స్కేప్ నెమ్మదిగా మారిపోతోంది. యూపీఐ సేవలు ఉచితం అనే మాట ఎంత ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నా దీర్ఘకాలంలో ఆ ప్రక్రియ కొనసాగించటం కుదరదని ఇటీవల రిజర్వు బ్యాంక్ గవర్నర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్ వచ్చిన వారం రోజులకే దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన ఐసిఐసిఐ బ్యాంక్ యూపీఐ సేవలపై ఛార్జీలను ఆగస్టు 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రైవేటు బ్యాంక్ ఐసిఐసిఐ తమ సంస్థ వద్ద ఖాతాలు ఉన్న పేమెంట్ అగ్రిగేటర్ సేవలు అందించే సంస్థల నుంచి యూపీఐ సేవలపై ఛార్జీలు వసూలు చేయనున్నట్లు పేర్కొంది. వాస్తవానికి వ్యాపారులు అలాగే బ్యాంకులకు మధ్య ఈ పేమెంట్ అగ్రిగేటింగ్ సంస్థలు సేవలను ఇందిస్తుంటాయి. సులువుగా అర్థం కావాలంటే ఫోన్ పే, గూగుల్ పే, రేజర్ పే, మెుబిక్విక్, పేటీఎం లాంటి సంస్థలు తమ పేమెంట్ అగ్రిగేషన్ ఖాతాలను బ్యాంకుల వద్ద నిర్వహిస్తుంటాయి. ఐసిఐసిఐ తీసుకున్న నిర్ణయంతో యూపీఐ చెల్లింపు సేవలు అందించే యాప్స్ పై అదనపు ఛార్జీల భారం పడనుంది.
తమ వద్ద ఎస్క్రో ఖాతాలు కలిగిన పేమెంట్ అగ్రిగేటింగ్ సంస్థలపై ఒక్కో ట్రాన్సాక్షన్ పై 2 బేసిస్ పాయింట్లు వసూలు చేయనున్నట్లు చెప్పింది. ఇది గరిష్ఠంగా ఒక్కో ట్రాన్సాక్షన్ పై రూ.6గా పరిమితి పెట్టబడింది. అలాగే ఎస్క్రో ఖాతా లేని సంస్థల నుంచి ట్రాన్సాక్షన్ కు 4 బేసిస్ పాయింట్లు అలాగే గరిష్ఠంగా రూ.10 వసూలు చేయనున్నట్లు పేర్కొంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాలకు సెటిల్ చేయబడే యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని సూచించింది. అయితే ఇప్పటికే యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు యూపీఐ చెల్లింపులపై పేమెంట్ అగ్రిగేటర్లకు ఛార్జీలు విధిస్తున్నట్లు తేలింది.
►ALSO READ | హైదరాబాద్లో విషాదం.. స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చిందని యువకుడు సూసైడ్
ప్రస్తుతం రోజురోజుకూ పెరుగుతున్న యూపీఐ మర్చంట్ పేమెంట్స్ నిర్వహణకు అవసరమైన ఇన్ ఫ్రా, సాంకేతికత, భద్రత చర్యలకు చేసే ఖర్చులు పెరుగుతుండటంతో బ్యాంకులు కూడా ఛార్జీలను వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలుస్తోంది. ఇప్పటికే యూపీఐ చెల్లింపులపై ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేటు వేయకపోవటంతో ట్రాన్సాక్షన్ల ప్రాసెసింగ్ ద్వారా ఎలాంటి ఆదాయం రావటం లేదని బ్యాంకింగ్ సంస్థలు చెబుతున్నాయి.
ఛార్జీల భారం వ్యాపారులపైనేనా..?
మెుత్తానికి బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలు సామాన్య యూపీఐ చెల్లింపు వినియోగదారులపై ఎలాంటి ప్రభావాన్ని చూపనప్పటికీ.. పేమెంట్ అగ్రిగేటింగ్ సంస్థలు వాటిని ఫ్లాట్ ఫారం ఫీజు, కన్వేయన్స్ ఛార్జీలు, ఇతర ఛార్జీల పేరుతో వ్యాపార సంస్థల నుంచే వసూలు చేస్తున్నాయి. ఇది అంతిమంగా చిన్న, మధ్యతరహా వ్యాపారులపై భారాన్ని మోపనుందని తేలింది. భవిష్యత్తులో ఇది డిజిటల్ పేమెంట్స్ స్వీకరణ నిరాకరణకు దారితీయెుచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బెంగళూరులో ఇప్పటికే వ్యాపారులు నో యూపీఐ ఓన్లీ క్యాష్ అంటూ బోర్డులు పెడుతుండగా.. మళ్లీ భౌతిక కరెన్సీ చెల్లింపులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.