
- 15 సీట్లతో ప్రధాని అయిన మోదీ
- దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది
- ఆధారాల కోసం 6 నెలలు పనిచేసి సాధించాం
- కొన్ని రాష్ట్రాల్లో మాకు ఒక్క సీటు రాకపోవడం ఏంటి?
- ఒకే పార్టీ అన్ని సీట్లనూ గెలుచుకోవడం ఏంటి..?
- రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటపెడతా
- రాజ్యాంగం మా రక్తం.. దానిపై దాడి చేయడానికి మీరెవరు
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని లోక్ సభలో విపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ లీగల్ సెల్ సదస్సులో ఆయన మాట్లాడారు. కేవలం 15 సీట్లతోనే మోదీ ప్రధాన మంత్రి అయ్యారని అన్నారు. ఆ పదిహేను సీట్లు లేకుంటే వాళ్లకు అధికారం దక్కేదే కాదన్నారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందని ఫైర్ అయ్యారు. ఎన్నికల కమిషన్ ఉనికిలో లేదని, ఇది నిజమని చెప్పేందుకు తన వద్ద వంద రుజువులు ఉన్నాయని చెప్పారు. ఈ ఆధారాలు సాధించేందుకు ఆరు నెలల పాటు పనిచేశామని రాహుల్ చెప్పారు.
కొన్ని రాష్ట్రాల్లో తమకు ఒక్క సీటు రాకపోవడం.. ఒకే పార్టీ అనేక సీట్లు గెలుచుకోవడం వెనుక పెద్ద మతలబే ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికలు ఎలా హైజాక్ అయ్యాయో చెప్తానన్నారు. ఓ సెగ్మెంట్ లో 6.5 లక్షల మంది ఓటర్లు ఓటు వేశారని, అందులో 1.5 లక్షల మంది నకిలీవారని అన్నారు. ఈసీ తమకు ఓటరు లిస్టు ఇవ్వడం లేదని, అయినా తాము సేకరించామని, రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటపెడ్తామని రాహుల్ గాంధీ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ ఎలా జరిగిందో అన్ని వివరిస్తామన్నారు. ఈ విషయంలో నిప్పుతో చెలగాటం ఆడుతున్నామనే విషయం మాకు తెలుసని రాహుల్ చెప్పారు. రఫేల్ డీల్ లో పీఎంవోతో పాటు ఎన్ఎస్ఏ జోక్యం చేసుకుందని ఆరోపించారు.
అరుణ్ జైట్లీ నన్ను బెదిరించారు
వ్యవసాయ చట్టాలకు వ్యతిరకంగా పోరాడుతున్న తనను బెదించేందుకు బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ మనుషులను పంపారంటూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ చేశారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తు పోరాడుతున్న మీపై చర్య తీసుకోవాల్సి ఉంటుందని వారు తనతో చెప్పినట్టు రాహుల్ తెలిపారు.
2014నుంచీ అనుమానమే
గుజరాత్ ఎన్నికలు తనకు ఇప్పటికీ అనుమానమేనని రాహుల్ గాంధీ అన్నారు. తన అనుమానం ఇప్పటిది కాదని 2014 నుంచే ఉందని చెప్పారు. వరుసగా భారీ విజయాలు సాధించగల సామర్థ్యం ఎలా అనేది సందేహంగా ఉండేదన్నారు. అప్పట్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. తాము ఏది మాట్లాడినా రుజువులు, ఆధారాలు అడుగుతున్నారని.. ఇప్పుడు చెప్తున్నాం అణుబాంబు లాంటి ఆధారాలున్నాయని చెప్పారు. ‘మహారాష్ట్రలో ఏదో జరిగింది. లోక్‌సభలో, మేము ఎన్నికల్లో గెలిచాము. ఆపై 4 నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఓడిపోలేదు.
మేము తుడిచిపెట్టుకుపోయాం. మూడు బలమైన పార్టీలు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాయి. ఎన్నికల దుర్వినియోగం ఎలా జరిగిందనేది తెలుసుకునేందుకు ప్రయత్నించాం. దాని మూలాలు మహారాష్ట్రలో బయటపడ్డాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు మధ్యన కోటి మంది కొత్త ఓటర్లు పుట్టుకొచ్చారు. కొత్తగా ఎన్ రోల్ అయిన సెగ్మెంట్లలో బీజేపీ గెలుస్తుంది. మోసం జరిగిందనేందుకు ఇదే పెద్ద ఉదాహరణ. తమ దగ్గర కచ్చితమైన రుజువులు ఉన్నాయి. ’ అని రాహుల్ చెప్పారు. ఇది దేశద్రోహం కంటే తక్కువ కాదన్నారు. ‘ మీరు ఎక్కడ ఉన్నా, మీరు పదవీ విరమణ చేసినా, మేము మిమ్మల్ని వదలం’ అని అన్నారు.