షెడ్యూల్ కంటే వారం ముందే.. అమర్‌నాథ్ యాత్ర రద్దు

షెడ్యూల్ కంటే వారం ముందే.. అమర్‌నాథ్ యాత్ర రద్దు

జమ్మూ కాశ్మీర్‌లోని కొండ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను అధికారులు ముందస్తుగానే నిలిపివేశారు. ప్రతికూల వాతావరణం వల్ల యాత్ర మార్గంలో ఉన్న ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. ఈ ట్రాక్‌లను పునరుద్ధరించడానికి, భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

షెడ్యూల్ ప్రకారం.. ఈ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 9న రక్షా బంధన్ రోజున ముగియనుంది. అయితే వర్షాల వల్ల మార్గం ప్రమాదకరంగా మారడంతో నిర్ణీత గడువుకు ఒక వారం ముందుగానే యాత్రను రద్దు చేశారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు యాత్రికులు ప్రయాణించే బాల్టాల్, పహల్గామ్ మార్గాలను తీవ్రంగా దెబ్బతిన్నాయి.  రెండు ట్రాక్‌లలో యాత్రను మూసివేశారు. మరమ్మతు పనుల కోసం మనుషులు, యంత్రాలను తరలించడం వలన యాత్రను తిరిగి ప్రారంభించడం సాధ్యం కాదని కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ చెప్పారు. దీంతో ఆగస్టు 3 నుంచి రెండు మార్గాలలో  యాత్ర నిలిపివేశారు. 

ఈ యేడు ఎంతమంది యాత్రికులు వచ్చారంటే..

అమర్ నాథ్ తీర్థయాత్ర ముందస్తుగా మూసివేసినప్పటికీ ఈ ఏడాది 4లక్షల10వేలమందికి పైగా యాత్రికులు అమర్‌నాథ్ గుహ మందిరాన్ని సందర్శించారు. గత సంవత్సరం 5లక్షల10వేలకంటే ఎక్కువ మంది ఉన్న ఈ సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది తగ్గింది. వచ్చే ఏడాది యాత్రకు ముందు మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా సమీక్షిస్తామని అధికారులు సూచించారు.