
సుప్రీం కోర్టులోనూ కరోనా వైరస్ కలకలం సృష్టించింది. కోర్టులో పనిచేస్తున్నవారిలో 50 శాతం సిబ్బంది కరోనా బారినపడ్డారు. శనివారం ఒక్క రోజే 44 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో అలర్టైన అధికారులు కోర్టు రూముతో పాటు పరిసరాలన్నిటినీ శానిటైజేషన్ చేస్తున్నారు. కోర్టులోని సగం మంది సిబ్బంది వైరస్ బారినపడటంతో ఇవాళ్టి (సోమవారం) నుంచి కోర్టు విచారణలన్నీ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ఇంటి నుంచే నిర్వహించనున్నట్లు న్యాయమూర్తులు నిర్ణయించినట్లు సమాచారం.
మరోవైపు సోమవారం షెడ్యూల్ సమయం కంటే గంట ఆలస్యంగా కోర్టు బెంచ్‌లు ప్రారంభంకానున్నాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన బెంచీలు ఉదయం 11.30 గంటలకు, 11 గంటలకు మొదలవ్వాల్సిన బెంచీలు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ ప్రారంభించనున్నాయని సుప్రీంకోర్టు అదనపు రిజిస్ట్రార్ తెలిపారు.