
భారతదేశ సినీ చరిత్రలో ఆల్ టైమ్ కల్ట్ మూవీగా భావించే ‘షోలే’ మూవీ విడుదలై ఈ రోజుతో 50 ఏళ్లు పూర్తయింది. ఇదొక టైమ్‌లెస్ క్లాసిక్. ఎందుకంటే సినిమా విడుదలై 50 ఏళ్లు దాటుతున్నా.. ఇప్పటికీ ఈ సినిమా గురించి దేశంలో ఎక్కడో ఒకచోట మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాగే ఇండియన్ కమర్షియల్ సినిమాకు దిశానిర్దేశం చేసిన సినిమా కూడా. అందుకే ఇండియన్ సినిమాను షోలేకి ముందు, షోలేకి తర్వాత అని సినీ విశ్లేషకులు అభివర్ణిస్తారు. ఈ యాభై ఏళ్లే కాదు.. మరో యాభై ఏళ్లయినా మాట్లాడుకునే ‘షోలే’ గురించిన కొన్ని ఎవర్‌గ్రీన్ విశేషాలు..
సెల్యులాయిడ్ మ్యాజిక్:
సినిమా అంటే కేవలం కథ కాదు.. అందులోని సన్నివేశాలు, పాత్రలు, డైలాగులు. అవి ప్రజల జ్ఞాపకాలలో మిళితమై తరతరాలుగా నిలిచిపోతే అది నిజమైన సెల్యులాయిడ్ మ్యాజిక్. ‘షోలే’ అచ్చం అలాంటి సినిమానే. ఎవరు చూసినా, చూడకపోయినా దాని పేరు, ప్రభావం అందరికీ తెలుసు. 50 ఏళ్ల క్రితం వచ్చిన ఈ కల్ట్ క్లాసిక్ భారతీయ సాంస్కృతిక స్మృతిపటంలో చెరగని ముద్ర వేసింది.
ఈ మాస్టర్‌పీస్ కామెడీ, రొమాన్స్, భయం, విషాదం అన్నింటినీ కలగలిపిన ‘గ్రేట్ థాళీ’ లాంటిది. ఇందులోని పాత్రలు, డైలాగులు, కథన శైలి లాంటివన్నీ భారతీయ సినీ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి. అందుకే ప్రేక్షకుల మనసుల్లో ఎవర్‌గ్రీన్ సినిమాగా నిలిచింది. హిందీ సినిమా మేకర్స్‌కే కాదు ఎంతోమంది దర్శకులకు మార్గదర్శకంగా నిలిచిన చిత్రం ఇది. ఎంతోమంది యాక్టర్స్, రైటర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్‌కు ఇదొక డిక్షనరీ.
అంచనాలను తల్లకిందులు చేస్తూ:
అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమామాలిని లీడ్ రోల్స్‌లో వచ్చిన ఈ సినిమాకు రమేష్ సిప్పీ దర్శకత్వం వహించారు. కీలకపాత్రలో సంజీవ్ కుమార్, విలన్‌గా అమ్జాద్ ఖాన్ నటించారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఆనాటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా సలీం జావెద్‌లు ఈ కథను రాశారు. మూడు గంటలకు పైగా నిడివితో 1973 ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రానికి మొదట మిశ్రమ స్పందన లభించినప్పటికీ, మూడు వారాల తర్వాత మౌత్ టాక్‌తో అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ అజరామరంగా నిలిచింది.
‘షోలే’ తెరవెనుక కథ..
ధర్మేంద్ర, హేమామాలిని, సంజీవ్ కుమార్ కాంబినేషన్‌లో రమేష్ సిప్పీ తెరకెక్కించిన ‘సీత గీత’ చిత్రం 1972 నవంబర్‌లో విడుదలై సూపర్ హిట్ అయింది. దీంతో ఇదే కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ మరో సినిమా చేయాలనుకున్నారు రమేష్ సిప్పీ. రచయితలు సలీం జావెద్‌లకు ఆ పని అప్పజెప్పారు. అకీరా కురసోవా ‘సెవెన్ సమురాయ్’ స్ఫూర్తితో వాళ్లు ‘షోలే’ స్క్రిప్ట్ రెడీ చేశారు. వీరు పాత్రకు ధర్మేంద్ర, బసంతిగా హేమామాలిని, థాకూర్‌గా సంజీవ్ కుమార్ సెట్ అయ్యారు. మరో కీలక పాత్ర అయిన ‘జై’ పాత్రకు శత్రుఘ్న సిన్హా సహా పలువురిని పరిశీలించారు.
కానీ ఇతర ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉండడంతో ఎవరూ సెట్ అవలేదు. అప్పటికే ‘జంజీర్’ సినిమాకు వర్క్ చేస్తున్న సలీం జావెద్‌లు అందులో అమితాబ్ నటన నచ్చి జై పాత్రకు అమితాబ్‌ను రిఫర్ చేశారు. కానీ అప్పటికి అమితాబ్ స్టార్ కాకపోవడంతో కొంత ఆలోచించారు. అయితే ఆనంద్, బాంబే టు గోవా చిత్రాల్లో వేర్వేరు పాత్రలు అయినప్పటికీ అమితాబ్ చూపించిన వేరియేషన్‌కు ఫిదా అయిన బరమేష్ సిప్పీ.. జై క్యారెక్టర్‌కు ఆయన్ను ఫైనల్ చేశారు.
అవాంతరాలతో మొదలై అజరామరంగా:
1973 అక్టోబర్ 2న షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆరోజు జోరున వాన. ఒక్క షాట్ కూడా తీయలేకపోయారు. ఆ తర్వాతి రోజు అమితాబ్, జయా బచ్చన్ మధ్య ఓ సీన్ చిత్రీకరించారు. అప్పటికే ఆమె గర్భవతి. ఆ లెక్కన తన కూతురు కూడా ఆ సినిమాలో నటించిందని అమితాబ్ సరదాగా చెబుతుంటారు. ధర్మేంద్ర షూటింగ్‌లోనే పడుకుంటాను అనేవారు. అంతలా ఆయనకు లొకేషన్ నచ్చింది. హేమామాలిని కోసం ఆమెతో చేసే సీన్స్‌లో కావాలనే ఆయన ఎక్కువ టేక్స్ తీసుకునేవారు.
అలాగే బెంగళూరు నుంచి ధర్మేంద్ర, అమితాబ్ షూటింగ్‌కు వెళ్తుంటే ఒకరోజు కారు ఆగిపోవడంతో ఆటోలో షూటింగ్‌కు వెళ్లారు. హే దోస్తీ సాంగ్‌ను 21 రోజుల పాటు చిత్రీకరించారు. ట్రైన్ రాబరీ సీన్‌కు ఏడు వారాలు పట్టింది. ఔట్ డోర్ షూట్ కావడంతో లైటింగ్ సరిగా లేక షూటింగ్ ఆలస్యమయ్యేది. పైగా సినిమాపై తనకున్న ప్యాషన్‌తో రమేష్ సిప్పీ ప్రతి సీన్‌లోనూ పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించడం మరో కారణం. అప్పట్లోనే మూడున్నర కోట్లతో రూపొందిన ఈ చిత్రం విడుదలయ్యాక ముప్ఫై ఐదు కోట్లు రాబట్టడం విశేషం.
క్లైమాక్స్ మార్పు:
నిజానికి గబ్బర్‌ను చంపడం ఒరిజినల్ క్లైమాక్స్. కానీ సెన్సార్ బోర్డు ఆ సీన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఠాకూర్ ఫ్యామిలీని గబ్బర్ సింగ్ ఊచకోత కోసే సీన్స్, ఇమామ్ కొడుకుని చంపే సీన్స్‌తో పాటు క్లైమాక్స్‌లో మితిమీరిన హింస ఉందంటూ అడ్డుచెప్పారు.
అలాగే క్లైమాక్స్‌లో ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడంపై అభ్యంతరం చెప్పడంతో క్లైమాక్స్‌ను రీషూట్ చేసి గబ్బర్‌ను పట్టుకునేందుకు పోలీసులు వచ్చినట్టుగా చూపించారు. డైరెక్టర్ కట్ 204 నిమిషాలు కాగా, 198 నిమిషాల వెర్షన్ సెన్సార్ అయింది. ఆ తర్వాత డైరెక్టర్ కట్‌ను డీవీడీలుగా విడుదల చేశారు.
సలీం జావెద్‌ల కలం బలం:
సలీం- జావేద్ రాసిన కథ, డైలాగులు షోలే కి శాశ్వత కీర్తి తెచ్చాయి. ఈ సినిమాలోని నటీనటుల ప్రతిభను, సలీం జావెద్ రైటింగ్‌ను వేరు చూసి చూడలేం. అంతలా ప్రభావం చూపించింది. ఒక బందిపోటు వల్ల సమస్య తలెత్తితే దాన్ని పరిష్కరించడానికి ఇద్దరు దొంగలను తీసుకురావడం అనేది ప్రధాన కథ. అయితే ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి.
లవ్ స్టోరీ, యాక్షన్, సెంటిమెంట్, అప్పటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ కథను రాశారు. ప్రతి పాత్రకు ప్రాధాన్యతను ఇస్తూ అద్భుతంగా తీర్చిదిద్దారు. లీడ్ రోల్స్ మాత్రమే కాదు.. సినిమాలో కొన్ని సెకన్స్ పాటు కనిపించే పాత్రలు కూడా గుర్తింపును అందుకున్నాయి. ఇందులోని డైలాగ్స్.. కొటేషన్స్‌లా, సామెతలలా జనం రోజువారి జీవితాల్లోకి వచ్చాయి.
ఆస్వాదించాల్సిన అద్బుతం:
జై, -వీరుల స్నేహాన్ని చూపించిన తీరు, వీరు వాటర్‌టవర్ మీద ఎక్కి బసంతి మౌసీకి ఇచ్చిన డైలాగులు, జై రెండు వైపులా ఉండే నాణెం, ఏ దోస్తీ హమ్ నహీం తోడేంగే పాట లాంటివన్నీ ఇప్పటికీ జ్ఞాపకాలలో మెదులుతుంటాయి. అందులోని పాత్రలు, సంగీతం, సంభాషణలు, భావోద్వేగాలతో ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. తరతరాలుగా మనని అలరిస్తూ వచ్చిన ఓ మేజికల్ ఫీలింగ్ షోలే. దర్శకుడు రమేష్ సిప్పీ మాటల్లో చెప్పాలంటే.. ‘షోలే’ విజయరహస్యం ఎలా చెప్పాలో తెలియదు.. కానీ దాన్ని ఆస్వాదించాలి’.
ప్యాషన్, పర్ఫెక్షన్తో:
ఈ సినిమానే కాదు.. మేకింగ్ కూడా ఎంతో థ్రిల్ కలిగిస్తుంది. కర్ణాటకలోని రామ్ నగర్ అనే ప్రాంతంలో రెండున్నరేళ్ల పాటు ఈ చిత్రాన్ని రూపొందించారు. యాక్షన్ సీన్స్ చిత్రీకరణ, టేకింగ్, సౌండింగ్ లాంటివన్నీ అడ్వాన్స్‌గా ఉంటాయి. దర్శకుడు రమేష్ సిప్పీకి సినిమాపై ఉన్న ప్యాషన్ ఇందులోని ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. 70 ఎంఎం వైడ్ స్క్రీన్ ఫార్మట్‌లో స్టీరియో ఫోనిక్ సౌండ్ ట్రాక్‌లో తీసిన ఫస్ట్ ఇండియన్ సినిమా ఇది. వంద థియేటర్స్‌లో సిల్వర్ జూబ్లీ జరుపుకున్న తొలి భారతీయ చిత్రమిది.
అలాగే ఐదేళ్ల పాటు ఏకదాటిగా థియేటర్స్‌లో ప్రదర్శించబడిన చిత్రంగా రికార్డును రెండు దశాబ్దాలపాటు ఈ చిత్రం నిలబెట్టుకుంది. హేయ్ దోస్తీ.. మెహబూబా పాటలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్డీ బర్మన్ సంగీతం, ఆనంద్ బక్షీ లిరిక్స్ పాటలు ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసి సినిమాను అల్టిమేట్ క్లాసిక్‌గా నిలబెట్టాయి.
జో డర్ గయా సంజో మర్ గయా:
‘షోలే’ సినిమానే కాదు.. అందులోని గబ్బర్ సింగ్ పాత్ర తెలియని వాళ్లుండరు. నెగెటివ్ క్యారెక్టర్ పేరును పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ తన సినిమాకు ఎంచుకున్నారంటే ఆ పాత్ర ఎంతలా ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ గబ్బర్ సింగ్ పాత్ర ఎంతో సర్‌ప్రైజ్ చేసింది. ఆ పాత్రలో అమ్జాద్ ఖాన్ జీవించారు. గబ్బర్‌కి బ్యాక్‌స్టోరీ ఇవ్వకపోవడం వలన అతని క్రూరత్వం మరింత పెరిగింది. కిత్నే ఆద్మీ థే, జో డర్ గయా సంజో మర్ గయా లాంటి డైలాగ్స్ మన భాషలో మిళితమైపోయాయి.
అప్పటివరకూ చూసిన విలన్స్‌కు భిన్నంగా ఆ క్యారెక్టర్‌ను దర్శకుడు ప్రజెంట్ చేశారు. ఇలా కూడా విలన్ క్యారెక్టర్‌ను చూపించొచ్చా అని ఫిల్మ్ మేకర్స్ సర్‌ప్రైజ్ అయ్యారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత విలన్ క్యారెక్టరైజేషన్‌నే మారిపోయింది. చాలామంది తమ చిత్రాల్లో గబ్బర్ సింగ్ తరహా విలన్ పాత్రలను సృష్టించారు. చంబల్‌కు చెందిన గబ్బర్‌సింగ్ గుజ్జార్ లైఫ్ ఆధారంగా ఈ ఫిక్షనల్ క్యారెక్టర్‌ను సృష్టించారు.
మొదట్లో గబ్బర్ సింగ్ పాత్రకు డానీ డెంజోంగ్పను అడిగారు. కానీ ఆయన మరో కమిట్మెంట్ వల్ల చేయలేనన్నారు. సంజీవ్ కుమార్ ఆ పాత్రపై ఆసక్తి చూపించారు. కానీ సలీమ్ జావెద్‌లు థాకూర్ పాత్రలో సింపతీ ఉండాలని, అది సంజీవ్ వల్లే అవుతుందని పట్టుబట్టారు. ఫైనల్‌గా అమ్జాద్ ఖాన్‌ను ఆ పాత్ర వరించింది.