
'అరె వో సాంబా'.. ఈ ఒక్క డైలాగ్ భారతీయ సినీ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది. ఒకప్పుడు ఏ నోట విన్నా ఈ డైలాగే వినిపించేది. ఆఫీసుల్లో, టీ కొట్లలో , హోటళ్లలో గబ్బర్ సింగ్ డెలాగ్ లతో మార్మోగిపోయింది. ఈ డైలాగ్ ఎక్కడిదో కాదు 'షోలే' మూవీలోనిదే . 1975 ఆగస్లు 15న విడుదలైన ' షోలే ' చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయింది. ఈ సినిమా విడుదలై 50 ఏళ్లు పూర్తయినా.. అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిఉంది.
సినీ పరిశ్రమలో సరికొత్త ట్రెండ్
మొదట్లో ఫ్లాప్‌గా భావించిన ' షోలే' చిత్రాన్ని భావించారు. కానీ కాలక్రమేణా కల్ట్ క్లాసిక్‌గా మారి భారతీయ సినీ పరిశ్రమలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఒక సునామీలాగా ఉత్తరాదిని ముంచెత్తింది. ఎక్కడ చూసినా ఈ సినిమాలోని పాటలు, డైలాగులే వినిపించాయి. అంతలా 'షోలే' మేనియా దేశాన్ని కుదిపేసింది. బాంబాయిలోని అత్యధిక సీట్లు ఉన్న మినర్వా థియేటర్ లో వరుసగా మూడేళ్లు ఆడింది. తర్వాత రెండేళ్ల పాటు మ్యాట్నీ షో కూడా వేశారు. 240 వారంలో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నిండిపోయింది.
కథాంశం
'షోలే' కేవలం ఒక యాక్షన్ సినిమా కాదు. ఇది స్నేహం, దేశభక్తి, ప్రతీకారం, ప్రేమ వంటి అనేక ఎమోషన్ల కలబోత. దర్శకుడు రమేశ్ సిప్పీ ఈ సినిమాను రూపొందించడంలో చూపిన విజన్ అసాధారణం. ఒక గ్రామాన్ని గబ్బర్ సింగ్ అనే క్రూరమైన బందిపోటు నుండి కాపాడటానికి, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఠాకూర్ (సంజీవ్ కుమార్) జై (అమితాబ్ బచ్చన్), వీరు (ధర్మేంద్ర) అనే ఇద్దరు చిన్న దొంగల సహాయం తీసుకోవడమే ఈ సినిమా కథ. ఈ కథనం సలీమ్-జావేద్‌ల పదునైన సంభాషణలతో కలిసి అద్భుతంగా పండింది.
నటీనటుల ప్రదర్శన
ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం, ప్రతి పాత్రలోని బలం, వాటిని పోషించిన నటీనటుల అద్భుతమైన నటన. గబ్బర్ సింగ్ పాత్రలో అమ్జాద్ ఖాన్ నటించారు. గబ్బర్ సింగ్ పాత్ర అప్పటివరకు ఉన్న విలన్ పాత్రల రూపురేఖలను మార్చేసింది. గంభీరమైన వాయిస్, భయంకరమైన నవ్వు, 'కిత్నే ఆద్మీ థే?' వంటి పవర్ఫుల్ డైలాగ్స్ తో ఈ పాత్ర దేశవ్యాప్తంగా విలన్లకు కొత్త నిర్వచనం ఇచ్చింది.
జై పాత్రలో అమితాబ్ బచ్చన్ ప్రదర్శించిన నటన ప్రేక్షకుల హృదయాలను తాకింది. నిశ్శబ్దంగా ఉంటూనే, అవసరమైనప్పుడు స్పందించే జై పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. క్లైమాక్స్‌లో జై చనిపోవడం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది. ఇక వీరు పాత్రలో ధర్మేంద్ర ఒదిగిపోయారు . ధర్మేంద్ర కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అంతే కాదు బంతి పాత్రలో హేమమాలిని నటించింది. హేమా మాలిని అందంగా కనిపించడమే కాకుండా, తన నటనతో ప్రాణం పోసింది. ఆమె మాటకారితనం, నవ్వు, భయం.. ఇలా ప్రతి ఎమోషన్‌ను అద్భుతంగా పలికించింది.
హేమమాలినితో ధర్మేంద్ర రొమాంటిక్ సన్నివేశాలు. జైతో అతని స్నేహం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతీకారం తీర్చుకోవాలనే తపనతో ఉన్న ఠాకూర్ పాత్రను సంజీవ్ కుమార్ తన నటనా ప్రతిభతో అద్భుతంగా పోషించారు. తన చేతులు కోల్పోయిన తర్వాత కూడా గబ్బర్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదల సినిమాకు బలాన్ని ఇచ్చింది.
అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ రైలు పోరాటం
'షోలే' సినిమాలో అత్యంత ప్రత్యేకమైన, ఐకానిక్ సన్నివేశం అంటే రైలుపై జరిగిన పోరాట దృశ్యమే అని చెప్పుకోవాలి. కేవలం 10 నిమిషాల నిడివి గల ఈ సన్నివేశం కోసం చిత్ర బృందం దాదాపు 20 రోజులకు పైగా కష్టపడింది. ముంబై-పూణే రైల్వే మార్గంలో పాన్‌వెల్ సమీపంలో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. దొంగలు రైలుపై దాడి చేయడం, ఠాకూర్ వారిని ఎదుర్కోవడం, ఆ తర్వాత జై, వీరులను విడుదల చేసి వారి సహాయం తీసుకోవడం.. ఈ మొత్తం సన్నివేశం అప్పటి టెక్నాలజీకి ఒక అద్భుతమని చెప్పాలి. ఈ సన్నివేశంలోని యాక్షన్, స్టంట్స్, గన్‌ఫైట్లు ప్రేక్షకులను సీటు అంచున కూర్చునేలా చేస్తాయి. అప్పటికీ, ఇప్పటికీ ఈ సన్నివేశంలోని డైలాగ్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి.
'షోలే' సినిమా మొదట ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, మెల్లిగా మౌత్ టాక్ ద్వారా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అది ఒక అనుభూతి. ప్రతి తరానికి ఒక కొత్త అనుభవాన్ని అందిస్తూ, భారతీయ సినిమా చరిత్రలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. రమేశ్ సిప్పీ దర్శకత్వం, సలీమ్-జావేద్ రచనా ప్రతిభ, అద్భుతమైన నటీనటుల ప్రదర్శనతో 'షోలే' ఒక క్లాసిక్‌గా నిలిచింది. 50 ఏళ్లు గడిచినా, 'షోలే' మూవీకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.