Fact Check : రూ.500 నోట్లపై శ్రీ రాముడు.. రామ రాజ్యంలో నిజమెంత..!

 Fact Check :  రూ.500 నోట్లపై శ్రీ రాముడు.. రామ రాజ్యంలో నిజమెంత..!

జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో శ్రీరాముడి ఫోటోతో కూడిన 500 రూపాయల నోటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ నోట్‌లో మహాత్మా గాంధీకి బదులుగా శ్రీరాముని ఫోటో,  నోటు వెనుక భాగంలో ఎర్రకోటకి బదులుగా అయోధ్యలోని రామ మందిరం సంగ్రహావలోకనం కనిపిస్తుంది.  ప్రస్తుతం ఈ 500 రూపాయల నోటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.  దీనిని చాలామంది షేర్ చేస్తున్నారు. 

ఈ క్రమంలో  భారతీయ రిజర్వ్ బ్యాంక్  500 రూపాయల నోట్ల కొత్త సిరీస్‌ను విడుదల చేయబోతోందా అన్న అనుమానం కలుగుతోంది. ఇదంతా ఫేక్ అని తెలుస్తోంది. దీనిపై ఆర్బీఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.  దీనిపై బ్యాంకింగ్ రంగ నిపుణుడు, వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు అశ్వనీ రాణా మాట్లాడుతూ.. కొత్త నోటుకు సంబంధించి ఆర్బీఐ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఇది ఫేక్ న్యూస్ అని అన్నారు.  అలాంటి నోటును ఆర్బీఐ  తెచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  

500 రూపాయల నోటుపై  మహాత్మా గాంధీ స్థానంలో ఇతరులు ఫోటోలు ముద్రించడానికి ఆర్బీఐ ప్లాన్ చేస్తుందంటూ వార్తలు రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో ఏపీజే అబ్దుల్ కలాం ఫోటోతో ఆర్బీఐ కొత్త నోట్లను ముద్రించనుందంటూ వార్తలు సోషల్ మీడియాలో  చక్కర్లు కొట్టగా వాటిని ఆర్బీఐ ఖండించింది.