
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఫాస్ట్‌ఫుడ్ చెయిన్ కేఎఫ్‌సీ తన మహిళా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనుంది. రాబోయే నాలుగేళ్లలోపు వీరి సంఖ్య ఐదు వేలకు చేర్చుతామని ప్రకటించింది. కేఎఫ్‌సీ ఇండియా ఇప్పటికే పూర్తిగా మహిళా ఉద్యోగులు నడిపే రెండు రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. వీటిలో ఒకటి హైదరాబాద్‌లో, మరొకటి డార్జిలింగ్‌లో ఉంది. ప్రస్తుతం తమ కంపెనీల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య 30 శాతం (2,500 మంది) ఉందని, 2024 నాటికి 40 శాతానికి తెస్తామని కేఎఫ్‌సీ ఇండి ఎండీ సమీర్ మీనన్ వెల్లడించారు. లింగసమానత్వ సాధన కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. దేశమంతటా ప్రస్తుతం తమకు 480 రెస్టారెంట్లు ఉన్నాయని, కొత్తగా మరిన్ని రెస్టారెంట్లను తెరుస్తామని తెలిపారు. దివ్యాంగులకు కూడా అవకాశాలు కల్పిస్తామని మీనన్ చెప్పారు.