51కి పెరిగిన కల్తీ సారా మరణాలు

51కి పెరిగిన కల్తీ సారా మరణాలు
  • ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్న మరో 64 మంది
  • తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో దారుణం

చెన్నై: తమిళనాడులో కల్తీ సారా ఘటనలో మృతుల సంఖ్య 51కి పెరిగింది. ఇంకా 64 మంది హాస్పిటల్‌‌లో చికిత్స పొందుతున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. గురువారం వరకు 29 మంది డెడ్‌‌బాడీలను వారి కుటుంబసభ్యులకు అప్పగించామని కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్‌‌‌‌ తెలిపారు. ‘‘మొత్తం 165 మంది సారా బాధితులు కళ్లకురిచ్చి, జిప్‌‌మర్‌‌‌‌, సలేం, ముండియంబాక్కం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరారు.

 వారిలో ఇప్పటివరకు 47 మృతి చెందారు. 30 మంది పరిస్థితి విషమంగా ఉంది’’ అని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు ముగ్గురు బాధితులు కోలుకున్నారని, ఇది చాలా సంతోషకరమైన వార్త అని పేర్కొన్నారు. అంతకుముందు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం కలెక్టర్‌‌‌‌ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో కల్తీ సారా విక్రయాల నివారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చర్యలను తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగిన వారు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైతే ట్రీట్‌‌మెంట్ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీలో రగడ..

కళ్లకురిచ్చిలో కల్తీసారా తాగి 51 మంది మృతిచెందిన ఘటనపై తమిళనాడు అసెంబ్లీలో రగడ జరిగింది. గురువారం ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో స్పీకర్ పోడియం ఎదుట బైఠాయించారు. కళ్లకురిచ్చి ఘటనపై చర్చించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. సభకు అంతరాయం కలిగించొద్దని అసెంబ్లీ స్పీకర్ ఎం అప్పావు పలుమార్లు కోరారు. 

అయినా ప్రతిపక్ష సభ్యలు వినకపోవడంతో పళనిస్వామి, సీనియర్ ఎమ్మెల్యే ఉదయ్​కుమార్​ సహా పలువురు ఎమ్మెల్యేలను స్పీకర్ ఒక రోజు సస్పెండ్​ చేశారు. మార్షల్స్ వారిని బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలని.. ప్రతిపక్ష సభ్యులు సభా కార్యక్రమాల్లో పాల్గొనాలనేది తన, దివంగత మాజీ సీఎం కరుణానిధి సంకల్పమని చెప్పారు. 

ప్రతిపక్షాలను సభలోకి అనుమతివ్వాలని కోరారు. ‘‘కళ్లకురిచ్చి ఘటనపై తీసుకున్న చర్యలన్ని వివరించాను. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి ఘోరమైన ఘటనలను రాజకీయాలకు వాడుకోవడం మంచి సంప్రదాయం కాదు” అని అన్నారు. దీంతో స్పీకర్ ప్రతిపక్షనేత, ఎమ్మెల్యేపై రూలింగ్​ ఉపసంహరించుకున్నారు. అయితే ప్రతిపక్ష సభ్యులు మాత్రం సభలోకి రాలేదు. సస్పెన్షన్ తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్​లో పళనిస్వామి మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్య హత్య’’ అని అన్నారు. కళ్లకురిచ్చి ఘటనకు సీఎం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.