
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నిత్యం ప్రతిపక్షాల నిరసనలతోనే కాలం గడిచిపోతోంది. ప్రజా సమస్యలపై చర్చ చాలా తక్కువగా జరుగుతోంది. నిరసనలు, ఆందోళనల మధ్య వాయిదాల పర్వంగానే సభ సాగుతోంది. తొలి వారం సమావేశాలు గడిచిన తీరు ఇలాగే ఉందంటూ రాజ్యసభ ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 29న మొదలైన సమావేశాల్లో రాజ్యసభ 52.3 శాతం సమయాన్ని వృథాగా కోల్పోయిందని అందులో పేర్కొన్నారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా సభల్లో అనుచిత ప్రవర్తన కారణంగా 12 మంది ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేసిన నేపథ్యంలో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిరసనలతో వారం మొదట్లో సమయం దాదాపుగా వృథా పోయింది. అయితే గురు, శుక్రవారాల్లో మాత్రం హైప్రొడక్టివిటీ నమోదైంది.
రాజ్యసభ షెడ్యూల్ టైమ్ ప్రకారం వారం మొత్తంలో 47.7 శాతం సమయం మాత్రమే చర్చలు జరిగాయని, అయితే గురువారం నిర్ణీత సమయానికి మించి 33 నిమిషాలు ఎక్కువ సేపు సభ జరిగిందని, దీంతో వారం మొత్తంగా సభలో సద్వినియోగమైన సమయం 49.7 శాతానికి పెరిగిందని రాజ్యసభ ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చ సందర్భంగా సభలో పూర్తి సమయం సద్వినియోగం అయిందని తెలిపింది. ఇలా గతంలో 2020 ఫిబ్రవరి 7న మాత్రమే వంద శాతం సమయం ఉపయోగపడినట్లు చెప్పింది. రాజ్యసభలో తొలి వారం అగ్రి చట్టాల రద్దు బిల్లు, డ్యామ్ సేఫ్టీ బిల్లును ఆమోదించినట్లు రాజ్యసభ ప్రకటన తెలిపింది.