మండుతున్న ఢిల్లీ..52.9 డిగ్రీల టెంపరేచర్​ నమోదు

మండుతున్న ఢిల్లీ..52.9 డిగ్రీల టెంపరేచర్​ నమోదు
  • దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం:  ఐఎండీ
  • రాజస్థాన్ నుంచి వీస్తున్న వేడి గాలులే కారణమని వెల్లడి
  • పీక్​కు చేరిన కరెంట్ వాడకం.. 8,302 మెగావాట్లతో ఆల్ టైమ్ హై
  • తీవ్ర నీటి కొరత.. కారు కడిగితే రూ. 2 వేలు ఫైన్​: ఢిల్లీ జల్​బోర్డు
  • సాయంత్రానికి మారిన వాతావరణం.. ఒక్కసారిగా వర్షం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. ముంగేశ్​పూర్ ఏరియాలో బుధవారం ఏకంగా 52.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ నమోదు కాలేదని వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు ముంగేశ్​పూర్ ప్రాంతంలో 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయినట్టు వివరించారు. కాగా, నార్త్​వెస్ట్ ఢిల్లీలో సగటు ఉష్ణోగ్రత మాత్రం 49.9 డిగ్రీలుగా నమోదైనట్టు తెలిపారు. ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు కావడానికి ప్రధాన కారణం రాజస్థాన్ నుంచి వీస్తున్న హీట్ వేవ్స్ అని ఐఎండీ రీజినల్ చీఫ్ కుల్దీప్ శ్రీవాత్సవ్ తెలిపారు. హీట్ వేవ్స్ కారణంగా ఢిల్లీ శివారు ప్రాంతాలు ముందుగా ప్రభావితం అవుతాయి. 

అక్కడే రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనికితోడు రాజస్థాన్ నుంచి వీస్తున్న వేడి గాలులు వాతావరణ పరిస్థితులను మరింత ప్రమాదకరంగా మార్చాయి. ముంగేశ్​పూర్, నరేలాతో పాటు నజాఫ్​గఢ్ ఏరియాల్లో హీట్​వేవ్స్ కారణంగా ప్రజలు అల్లాడిపోయారు.

రికార్డు స్థాయిలో కరెంట్ వాడకం

బుధవారం ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరగడంతో ఢిల్లీ వాసులు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు భారీగా వినియోగించారు. దీంతో ఎప్పుడూ లేనంతగా కరెంట్ వాడకం పెరిగింది. మధ్యాహ్నం 3:36:32 టైమ్​లో పవర్ డిమాండ్ ఆల్ టైమ్ హై 8,302 మెగా వాట్లను తాకింది. ఇంత భారీ స్థాయిలో కరెంట్ వినియోగం ఢిల్లీ ఎలక్ట్రిసిటీ హిస్టరీలో ఎప్పుడూ రికార్డు కాలేదని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఎండలు ఎంత పెరిగినా.. 8.200 మెగావాట్లకు మించి కరెంట్ వినియోగం ఉండదని భావించినట్టు తెలిపారు.

సాయంత్రానికి మళ్లీ వర్షం

బుధవారం మధ్యాహ్నం వరకు ఎండ వేడి, హీట్​వేవ్స్​తో అల్లాడిపోయిన ఢిల్లీ వాసులకు సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షం కొంత రిలీఫ్ ఇచ్చింది. రికార్డ్ ఉష్ణోగ్రత నమోదైన తర్వాత పలు చోట్ల వర్షం కురిసింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం, పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది.

ఆసుపత్రులకు  పెరిగిన తాకిడి

ఎండలు, వడగాలుల కారణంగా ప్రజలు అనారోగ్యం బారినపడ్తారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సిటీలో గ్రీనరీ లేకపోవడం, సూర్యుడి కాంతి నేరుగా భూమిపై పడటమే ఎండలు పెరిగేందుకు కారణమని అంటున్నారు. హీట్​వేవ్ బారినపడి ట్రీట్​మెంట్​ కోసం ఎల్ఎన్​జేపీ హాస్పిటల్​కు వస్తున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఈ వారంలో ఎక్కువ మంది ఎండ దెబ్బ తగిలి హాస్పిటల్​లో అడ్మిట్ అయినట్టు లోక్ నాయక్ హాస్పిటల్ డాక్టర్ రితు సక్సేనా తెలిపారు. మంగళవారం ఒకే రోజు 10 మంది వడదెబ్బకు గురై అడ్మిట్ అయ్యారు. వీరంతా జ్వరం, తలనొప్పి, వాంతులతో బాధపడుతున్నారు. మరికొందరు స్పృహ తప్పి పడిపోయారు. ఎండలు ఎక్కువ ఉండటంతో వీలైనంత వరకు బయటికి వెళ్లొద్దని డాక్టర్లు సూచించారు. శరీరం డీ హైడ్రేట్​కు గురి కాకుండా చూసుకోవాలని, వాటర్ తాగాలని తెలిపారు.

ఈస్ట్ ఢిల్లీలో ఫైర్ యాక్సిడెంట్.. 16 కార్లు బుగ్గి

ఈస్ట్ ఢిల్లీలోని మధు విహార్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో 16 కార్లు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. తొమ్మిది ఫైరింజన్లతో మంటలు అదుపు చేసినట్టు ఫైర్ సేఫ్టీ అధికారులు తెలిపారు. మరో 16 కార్లు డ్యామేజ్ అయినట్టు వివరించారు. అపార్ట్​మెంట్​లో ఉంటున్న వాళ్లంతా కార్లు సెల్లార్​లో పార్క్ చేశారు. పక్కనే ఉన్న చెట్ల పొదల్లో మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించినట్టు అనుమానిస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సెల్లార్​లో వందకు పైగా కార్లు ఉన్నాయి. ఇటీవల ఈస్ట్ ఢిల్లీలోని హాస్పిటల్​లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. పని ప్రదేశాల్లో ఫైర్ సేఫ్టీ ఎక్విప్​మెంట్లు ఉంచుకోవాలని, ఎలక్ట్రికల్ లోడ్ ఆడిట్ నిర్వహించాలన్నారు. అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ఐసీయూల్లో ఆటో మేటిక్ స్ప్రింక్లర్లు అమర్చుకోవాలని సూచించారు.

భూమ్మీద అత్యధిక ఉష్ణోగ్రత 56.7 డిగ్రీలు

    ఇప్పటి వరకు భూమ్మీద రికార్డయిన అత్యధిక ఉష్ణోగ్రత 56.7 డిగ్రీలు.. ఇది అమెరికాలోని కాలిఫోర్నియా డెత్ వ్యాలీలో 1913 జులై 10 న రికార్డైంది.
    భారత దేశంలో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 52.3 డిగ్రీలు.. ఢిల్లీలో బుధవారం 2024 మే 29న నమోదైంది. 
    రాజస్థాన్​లోని ఫలోడిలో 2016 లో 51 డిగ్రీలు
    రాజస్థాన్​లోని చురూలో2019లో  50.8 డిగ్రీల ఉష్ణోగ్రత, 1956లో 50.6 డిగ్రీలు, హర్యానాలోని సిర్సాలో 50.3 డిగ్రీలు నమోదైంది.

పని ప్రదేశాల్లో నీళ్లు ఏర్పాటు చేయండి: ఎల్జీ

ఢిల్లీలో ఎండలు, వేడి గాలులు పెరగడంతో రోజువారీ కూలి పనులు చేసుకునే వారికి మధ్యాహ్నం నుంచి 3 వరకు బ్రేక్ ఇవ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అధికారులకు సూచించారు. బ్రేక్ టైమ్​కు కూడా కూలి డబ్బులు ఇవ్వాలన్నారు. కన్​స్ట్రక్షన్ సైట్ల వద్ద డ్రింకింగ్ వాటర్, కొబ్బరి నీళ్లు ఉండేలా చూడాలన్నారు. అదేవిధంగా, బస్టాండ్లలో తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎండలు పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రజలకు అవగాహన కూడా కల్పించడం లేదని తెలిపారు. గవర్నమెంట్, ప్రైవేట్ ఏజెన్సీలు వర్క్ ప్లేసుల్లో ఉద్యోగులు, కూలీల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

టెంపరేచర్ పెరగడానికి కారణమేంటి?

ఢిల్లీ శివారు ప్రాంతాల్లో ఓపెన్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. దీంతో ఆ ఏరియాల్లో రేడియేషన్ విపరీతంగా పెరిగింది. సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకాయి. చెట్లు, బిల్డింగ్​లు కూడా లేకపోవడం, బంజరు భూమి ఎక్కువగా ఉండటంతో వేడి పెరిగింది. దీనికితోడు రాజస్థాన్ వైపు నుంచి వేడి గాలులు వీస్తున్నాయి. సాధారణంగా సిటీ శివారు ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. దీనికి రేడియేషన్ తోడవడంతో ఆ ఏరియాల్లో రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. 2002, ఢిల్లీలో గరిష్టంగా 49.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. సాధారణం కంటే 9 డిగ్రీలు అధికంగా టెంపరేచర్లు నమోదవుతున్నాయి.

మూడు కారణాలు

టెంపరేచర్లు విపరీతంగా పెరగడానికి 3 కారణాలు ఉన్నాయని మూడీస్ ఆర్ఎంఎస్​లో చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్​ రాబర్ట్ ముయిర్ వుడ్ తెలిపారు. మొదటిది.. భూమి, రోడ్లలో డార్క్ మెటీరియల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. గ్లాస్, కాంక్రీట్ మెటీరియల్ కూడా వేడిగా ఎక్కువగా గ్రహిస్తాయి. 
మెట్రో పాలిటన్ సిటీల్లో ఎత్తయిన భవనాలు ఉంటాయి. ఇవి గాలి వేగాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా హీట్ పెరుగుతుంది. 
సిటీ సెంటర్​లో ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్లు, మెషనరీలు ఎక్కువ. కార్లు కూడా ఎక్కువే.  ఇవన్నీ హీట్​ను ప్రొడ్యూస్ చేస్తా యి. వేడి పెరగడం అనేది అక్కడి జనాభా పైనా ఆధారపడి ఉంటుంది. మిగతా ఏరియాల కన్నా సిటీ సెంటర్​లో 5 నుంచి 7 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది.

వాటర్ వేస్ట్ చేస్తే రూ.2 వేల ఫైన్

ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్నది. దీంతో కారు కడిగినా, నీళ్లు వేస్ట్​ చేసినా రూ.2 వేలు ఫైన్​ వేస్తామని ఢిల్లీ జల్ బోర్డు(డీజేబీ) బుధవారం ప్రకటించింది. పైప్​తో వెహికల్స్ వాష్ చేసినా, ఇంటి అవసరాలకు సరఫరా చేసే నీటిని నిర్మాణ, వాణిజ్య అవసరాలకు ఉపయోగించినా ఫైన్ కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈమేరకు డీజేబీ అధికారులకు మంత్రి ఆతిశీ కీలక ఆదేశాలు జారీ చేశారు. నీటి వృథాను అరికట్టేందుకు 200 టీమ్​లు నిరంతరం పర్యవేక్షిస్తాయని తెలిపారు. గురువారం ఉదయం 8 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందన్నారు. యమునా నది నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను హర్యానా గవర్నమెంట్ ఇవ్వట్లేదని, అందుకే నీటి ఎద్దడి ఏర్పడిందని మంత్రి ఆరోపించారు.