530 గ్రాముల విదేశీ బంగారం పట్టివేత

530 గ్రాముల విదేశీ బంగారం పట్టివేత

అక్రమంగా బంగారం దాటించడానికి కొంతమంది వినూత్న పద్ధతులు పాటిస్తుంటారు. కడుపులో, విగ్గులో.. ఇలా తెలివిగా బంగారాన్ని తరలించాలని ప్రయత్నించి అడ్డంగా బుక్ అవుతుంటారు. వాళ్లు చేసిన పనులు విస్తుగొలిపేలా ఉంటాయి. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో వారు దొరికిపోతుంటారు. గతంలో ఓ వ్యక్తి విగ్గులోపల పొరలు పొరలుగా బంగారం దాచి పెట్టిన ఘటన గుర్తుండే ఉంటుంది. తాజాగా.. ఎవరికీ తెలియదని సాక్స్‌‌లలో బంగారం తరలించాలని ప్లాన్ వేసిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వారణాసిలో చోటు చేసుకుంది. 

జులై 27వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ వారణాసి లోని LBSI ఎయిర్ పోర్టులో షార్జా నుంచి ఓ వ్యక్తి వచ్చాడు. తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు అతడిని ఆపారు. ఎందుకో అనుమానం రాగానే.. అతడిని లోనికి తీసుకెళ్లి కూర్చొబెట్టారు. ముందుగా అతడిని క్షుణ్ణంగా పరీక్షించిన అనంతరం షూ విప్పమన్నారు. వాళ్లు చెప్పినట్లుగా ఆ వ్యక్తి చేశాడు. అనంతరం సాక్స్ విప్పగా పాదాల కింద అతికించిన రెండు ప్లాస్టిక్ పౌచ్ లు బయటపడ్డాయి. బ్రౌన్ పేస్ట్ రూపంలో ఈ రెండు పౌచ్ లున్నాయి. అందులో స్వచ్చమైన బంగారం ఉన్నట్లు కనుగొన్నారు. 530 గ్రాముల 99.50 మేలిమి బంగారం ఉంది. దీని విలువ రూ. 27,33,105గా ఉంటుందని అధికారులు వెల్లడించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.