కాళేశ్వరంపై 54 ఫిర్యాదులు.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ వేగవంతం

కాళేశ్వరంపై  54 ఫిర్యాదులు..  జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ వేగవంతం

హైదరాబాద్: కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి తమకు 54 ఫిర్యాలుదు అందాయని వాటిపై విచారణ కొనసాగుతోందని పీసీ ఘోష్ తెలిపారు. ఇవాళ జలసౌధలో మీడియాతో చిట్ చాట్ చేశారు. విచారణ వేగవంతం చేశామని చెప్పారు. ఇప్పటికే ప్రాజెక్టును పరిశీలించామని అన్నారు. అన్ని విషయాలు రానున్న రోజుల్లో బయటికి వస్తాయని చెప్పారు. 

తమకు అందిన ఫిర్యాదుల్లో నష్టపరిహారం రాలేదనేవి కూడా ఉన్నాయని అన్నారు.  నిర్మాణపరమైన అంశాలపై ఏజెన్సీలను పిలిచి విచారణ చేస్తున్నామని చెప్పారు. నిజాలు తెలుసుకునేందుకు అందరి వద్ద సమాచారం సేకరిస్తున్నట్టు ఘోష్ తెలిపారు. జూన్ 30వ తేదీలోపు విచారణ పూర్తి కాదని ఇంకా సమయం పడుతుందని చెప్పారు. అసలు విషయాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేమని తెలిపారు. 

మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉన్నందున కొంత ఆలస్యమైందని చెప్పారు. ఇవాళ విచారణకు రావాలని ఏడుగురికి నోటీసులు ఇచ్చామని చెప్పారు. అలాగే రేపు విచారణ రావాలని పేర్కొంటూ 18 మందికి నోటీసులు సర్వ్ చేశామని తెలిపారు.  టెక్నికల్ అంశాల విచారణ పూర్తి అయ్యాక, ఆర్థిక అంశాల పై విచారణ మొదలు అవుతుందని చెప్పారు. ప్రభుత్వం వద్ద నుంచి రిపోర్టులు అన్ని అందాయని వాటిని పరిశీలిస్తున్నామని పీసీ ఘోష్​ వెల్లడించారు.