ఎన్హెచ్ 44పై కిలో మీటర్  కో సీసీ కెమెరా

ఎన్హెచ్ 44పై కిలో మీటర్  కో సీసీ కెమెరా
  • 55 చోట్ల ఏర్పాటు
  • రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు, ఎన్​హెచ్​ఏఐ చర్యలు

మెదక్​/ తూప్రాన్/ రామాయంపేట, వెలుగు: నేషనల్​ హైవే 44 పై ప్రమాదాల నివారణకు పోలీస్​ శాఖ, నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా (ఎన్​ హెచ్​ ఏ ఐ)  చర్యలు చేపట్టింది. వాహనాలు వేగాన్ని మానిటరింగ్​ చేయడంతోపాటు,  అక్రమ వాహనాలను పట్టుకునేందుకు  హైవే మీద  అత్యాధునిక  సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

హైదరాబాద్  నుంచి  మహారాష్ట్రలోని నాగపూర్  వెళ్లే నేషనల్ హైవే 44  మెదక్ జిల్లా పరిధిలో మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ నుంచి రామాయంపేట మండలం దామర చెరువు వరకు 55 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ రూట్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రతి కిలో మీటరుకు ఒకటి చొప్పున మొత్తం 55  సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. 

సోలార్​ పవర్​తో.. 360 డిగ్రీల్లో.. 

నేషనల్​హైవేపై ఈ కెమెరాలు సోలార్​ పవర్​ ఆధారంగా పని చేస్తాయి.  ఒక్కోటి రూ.75 వేల  విలువైన అత్యాధునిక సీసీ కెమెరాలు 360 డిగ్రీల్లో  తిరుగుతూ హైవే మీద వేగంగా వెళ్లే వాహనాల ఫొటోలు తీస్తాయి.  హై రిజల్యూషన్​ కెమెరా కావడం వల్ల ఎంత వేగంగా వెళ్లినా వాహనాల నెంబర్​ లు కూడా క్లియర్​ గా క్యాప్చర్​ అవుతాయి. తద్వారా ఓవర్​ స్పీడ్​ తో వెళ్లే వాహనాలకు ఫైన్​ వేసేందుకు అవకాశం ఉంటుంది.  హైవే మీద బిగించిన సీసీ కెమెరాలను మనోహరాబాద్, తూప్రాన్​, మాసాయిపేట, చేగుంట, నార్సింగి, రామాయంపేట పోలీస్​ స్టేషన్​ లకు అనుసంధానం చేశారు. దీనివల్ల ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినా లేదా ఇతర నేరాలు జరిగినా గుర్తించేందుకు వీలవుతుంది. 

ఇల్లీగల్​ అక్టివిటీస్​ కట్టడికి.. 

కశ్మీర్​  నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఈ హైవే  రోడ్డు దేశంలోనే అతి పొడవైనది. నిత్యం అనేక రాష్ట్రాలకు చెందిన వేలాది  వాహనాలు ఈ హైవే మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. కంపెనీలకు ముడిసరుకు, ఆయా కంపెనీల్లో తయారయ్యే ఉత్పత్తులు, ఫ్యాక్టరీల నిర్మాణాలకు ఉపయోగించి భారీ యంత్రాలు, సామగ్రి వివిధ రాష్ట్రాలకు తీసుకెళ్లే కంటెయినర్లు, ట్రక్కులు, ప్రైవేట్​ ట్రావెల్​ బస్సులు, ఆర్టీసీ బస్సులు, ఇసుక లారీలు, టిప్పర్​ లు, ప్రైవేట్​ వెహికిల్స్​ రాకపోకలతో రాత్రింబవళ్లు రోడ్డంతా రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాల అతివేగం ప్రమాదాలకు కారణమవుతుండగా, కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణమయ్యే వాహనాలను గుర్తించడం పోలీసులకు  కష్టమవుతోంది. అంతేగాక అక్రమార్జనకు అలవాటు పడిన వారు ఈ రూట్లో  వాహనాల్లో గంజాయి రవాణా చేస్తున్నారు. అలాగే వివాదాల నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారిని కిడ్నాప్​ చేసి హైదరాబాద్​ తరలించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. 

ప్రమాదాల నివారణ కోసం

దేశంలోనే అత్యంత పొడవైన 44 జాతీయ రహదారి మెదక్ జిల్లాలో 55 కిలోమీటర్లు ఉండగా, తరచూ ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎన్ హెచ్ ఏ ఐ అధికారులతో చర్చించి అత్యదునిక సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం.  కిలోమీటర్ కు  ఒక కెమెరాను, ముఖ్యంగా చౌరస్తాల్లో ఏర్పాటు చేశాం. వీటి ద్వారా అధిక వేగంతో వెళ్లే వాహనదారులకు జరిమానా పడడంతో పాటు, ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో వాహనాలు గుర్తించేందుకు ఇవి  దోహదపడుతాయి. -నరేందర్ గౌడ్ , తూప్రాన్​ డీఎస్పీ