కాళేశ్వరం ప్రాజెక్టులో 56 వేల కోట్ల అవినీతి

కాళేశ్వరం ప్రాజెక్టులో 56 వేల కోట్ల అవినీతి
  • మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

హనుమకొండ జిల్లా: కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడని, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో 56 వేల కోట్ల అవినీతి జరిగిందని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. 36 వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉండగా కమీషన్ల కోసం లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడని ఆయన పేర్కొన్నారు. సోమవారం కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో జరిగిన బీజేపీ చేరికల సభలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కలసి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.
దేశంలోనే అతిపెద్ద అవినీతి సీఎం కేసీఆర్
ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఓ సర్వేలో దేశంలోకెల్లా అతిపెద్ద అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని తేలిందని వెల్లడించారు. ఏడేళ్లలో కేసీఆర్ ఆయన కుటుంబం రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు పెద్దగా ఏమీ మేలు జరగకకపోయినా కేసీఆర్ కుటుంబం మాత్రం పెద్ద ఎత్తున ఆస్తులు కూడ బెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. ఈటల రాజేందర్ రాజీనామా చేయడం వల్లే హుజురాబాద్ నియోజకవర్గంలో అనేక స్కీంలు మొదలు పెట్టారని ఆయన పేర్కొన్నారు. ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలిస్తే ఇంతకాలం ఫాం హౌస్ లో పడుకున్న కేసీఆర్ బయటికి వస్తారని ఆయన అన్నారు.