57 ఏళ్ల వయసులో టెన్త్ పాసైన ఆశా వర్కర్

57 ఏళ్ల వయసులో టెన్త్ పాసైన ఆశా వర్కర్
  • ఉద్యోగం కాపాడుకునేందుకు ఓ మహిళ యత్నం
  • ఇంగ్లీషు సబ్జెక్టులో 4 మార్కులతో ఫెయిల్
  • కరోనా కారణంగా ఈసారి పరీక్ష రాయకుండానే పాస్

భువనేశ్వర్: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధనతో నిరుపేదరాలైన ఓ మహిళ తన ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంది. ఉద్యోగం కాపాడుకునేందుకు 55 ఏళ్ల వయసులో 2018లో ప్రైవేటుగా పదో తరగతి పరీక్ష కట్టింది. మొదటి ప్రయత్నంలో ఐదు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణురాలైన ఆమె.. ఒక్క ఇంగ్లీషు సబ్జెక్టులో 4 మార్కుల తేడాతో ఫెయిలైంది. రెండోసారి పరీక్ష రాసినా మళ్లీ ఫెయిల్. అయినా నిరాశకు లోనుకాకుండా మూడోసారి పరీక్ష నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుండగా.. కరోనా కారణంగా రాయకుండానే పాస్ అయిపోయింది. పరీక్ష పెట్టినా పాస్ అవుతానని ఈమె ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తుండడం స్థానిక మీడియాలో వైరల్ అయింది. వివరాలిలా ఉన్నాయి. 
ఒడిశాకు చెందిన స్వర్ణలత చాలా పేద కుటుంబం లో పుట్టింది. ఏడో తరగతి వరకు చదువుకున్న ఈమెకు చాలా చిన్న వయసులోనే పెళ్లి చేశారు. అలాగే విధి కూడా ఆమె జీవితంతో ఆడుకుంది. 27 ఏళ్ల వయసులోనే భర్తను పోగొట్టుకుంది. తన ఇద్దరు పిల్లల కోసం కష్టపడి పనులు చేసుకుని జీవిస్తోంది. 2005లో స్కూల్లో వంట పనులు చేస్తుండగా.. తన గ్రామంలోనే ఆశా వర్కర్ గా పనిచేసే అవకాశం వచ్చింది. తన ఇద్దరు పిల్లలను చదివించుకునేందుకు రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడుతున్న స్వర్ణలత ఉద్యోగ బాధ్యతల్లోనూ క్రమశిక్షణతో కష్టపడి పనిచేసి అందరి మన్ననలు అందుకుంది. ఆశా వర్కర్ గా ఆమె పనితనానికి ఉన్నతాధికారుల ప్రశంసలు, అవార్డులు, రివార్డులిచ్చి సత్కరించారు. ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లలు పీజీ చదువుతున్నారు. ఇలాంటి తరుణంలో ఒడిశా ప్రభుత్వం ఆశా వర్కర్లకు పదో తరగతి కనీస విద్యార్హత ఉండాలనే నిబంధన తెచ్చింది. దీంతో తన ఉద్యోగాన్ని కాపాడుకునేందుకు స్వర్ణలత 2019లో ఓపెన్ స్కూల్ లో దరఖాస్తు చేసుకుంది. మొదటి ప్రయత్నంలో ఐదు సబ్జెక్టుల్లో పాస్ అయి.. ఒక ఇంగ్లీషు సబ్జెక్టులో ఫెయిల్ అయింది. అది కూడా కేవలం 4 మార్కులతో. ఈసారి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటానని చాలా ధీమాతో పరీక్షకు సన్నద్ధమైంది. 2020 మార్చిలో కరోనా ప్రబలడంతో పరీక్షలు సెప్టెంబర్ కు పోస్ట్ పోన్ అయ్యాయి. ఈసారి పరీక్ష రాసినా మళ్లీ ఫెయిల్.. అయినా నిరాశకు లోను కాకుండా మళ్లీ ట్యూషన్ చెప్పించుకుంటూ 2021లో పరీక్షకు ఫీజు కట్టింది. అయితే ఈసారి పరీక్ష రాయకున్నా కరోనా వల్ల పాస్ అయిపోయింది. ప్రభుత్వం పాస్ చేయకపోయినా.. తాను బాగా చదువుకుని పరీక్షకు సిద్ధమయ్యానని.. నా ఆసక్తిని చూసి టీచర్లు కూడా ప్రోత్సహించారని చెబుతోంది. పరీక్ష రాస్తే కచ్చితంగా పాస్ అయిపోతానంటూ రాయకుండానే ఉత్తీర్ణురాలైనందుకు సంతోషంతో పొంగిపోయింది. టెన్త్ పాస్ అయ్యానని పెద్ద పండగలా జరుపుకోవడం స్థానికంగా వైరల్ అయింది. ఈమె గురించి మీడియా ప్రతినిధులు తెలుసుకుని పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువరించడంతో ఒఢిశా మొత్తం ఈమె పేరు మార్మోగిపోతోంది.