24 గంట‌ల్లో 572 మంది తాలిబ‌న్ల‌ను మ‌ట్టుబెట్టాం

24 గంట‌ల్లో 572 మంది తాలిబ‌న్ల‌ను మ‌ట్టుబెట్టాం

అమెరికా బ‌ల‌గాలు వెన‌క్కి వెళ్లిపోయిన నాటి నుంచి అఫ్గానిస్థాన్‌ను త‌మ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు తాలిబ‌న్ ఉగ్ర‌వాద సంస్థ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే ఆ దేశంలోని చాలా ప్రాంతాల‌ను ఆక్ర‌మించింది. అయితే ఈ ప్ర‌య‌త్నంలో బాంబు దాడులు, రాకెట్ అటాక్స్ చేస్తుండ‌డంతో ప్ర‌జా ఆస్తులు ధ్వంసం కావ‌డంతో పాటు ప్రాణాలు కూడా పోతున్నాయి. అఫ్గాన్ ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న వాళ్ల‌ను కూడా తాలిబ‌న్లు టార్గెట్ చేసుకున్నారు. ఈ విష‌యాన్ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించి మ‌రీ దాడులు చేస్తున్నారు. అయితే తాలిబ‌న్ల‌ను క‌ట్ట‌డి చేసేందుకు అఫ్గాన్ బ‌ల‌గాలు ప్ర‌య‌త్నిస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు తాలిబ‌న్లే పైచేయి సాధించిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే తొలిసారి తాలిబ‌న్ల‌ను గ‌ట్టి దెబ్బ కొట్టామ‌ని అఫ్గాన్ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. కేవ‌లం 24 గంట‌ల్లో 572మంది తాలిబ‌న్ ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టిన‌ట్లు ప్ర‌క‌టించింది.

పాక్ టెర్రిస్టులు కూడా హ‌తం

అఫ్గాన్ ఫోర్సెస్ చేసిన ఆప‌రేష‌న్ల‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 572 మంది తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. అలాగే మ‌రో 309 మంది తీవ్ర గాయాల‌య్యాయి. నాంగ‌ర్హ‌ర్, ల‌ఘ‌మాన్, ఘ‌జ్నీ, ప‌క్టియా, కాంద‌హార్, ఉరుజ్గాన్, హెరాత్, ఫ‌ర్హా, జోజాన్, స‌ర్ఏ పోల్, ఫ‌ర్యాబాద్, హెల్మాండ్, నిమ్రుజ్, త‌ఖార్, కుందుజ్, బ‌ద‌ఖ్‌షాన్, క‌పిసా ప్రావిన్సుల్లో అఫ్గాన్ పోర్సెస్ ఈ దాడులు చేసింది  అని అఫ్గాన్ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఆదివారం ఉద‌యం పోస్ట్ చేసింది. అలాగే హెల్మాండ్ ప్రావిన్స్‌లో జ‌రిపిన ఎయిర్ స్ట్రైక్స్‌లో 45 మంది తాలిబ‌న్ల‌తో పాటు ముగ్గురు పాకిస్థానీ అల్‌ఖైదా టెర్ర‌రిస్టుల‌ను కూడా మ‌ట్టుబెట్టిన‌ట్లు మ‌రో ట్వీట్‌లో వెల్ల‌డించింది. ఈ దాడుల్లో హెల్మాండ్ తాలిబ‌న్ హెడ్ మ‌వ్లావి హిజ్రాత్ హ‌త‌మైన‌ట్లు పేర్కొంది.