ఎంపీటీసీల లెక్క తేలింది! తెలంగాణ వ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలు

ఎంపీటీసీల లెక్క తేలింది! తెలంగాణ వ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలు
  • 71 జీపీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో తగ్గిన 44 స్థానాలు
  • 31 జెడ్​పీలు, 566 ఎంపీపీలు, అంతే సంఖ్యలో జెడ్​పీటీసీలు
  • తాజాగా ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు
  • 18 పంచాయతీలు మున్సిపాలిటీ పరిధిలోకి వెళితే మరిన్ని ఎంపీటీసీ స్థానాలు తగ్గే చాన్స్‌

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల లెక్క తేలింది. అంతకు ముందు 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 5,773కు తగ్గింది. గతం కంటే 44 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. 566 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 71 గ్రామ పంచాయతీలు జీహెచ్ఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో కలవడంతో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి జిల్లాల్లోని పంచాయతీలు మున్సిపాలిటీలలో విలీనం కావడంతో దీని ప్రభావం ఎంపీటీసీ స్థానాలపై పడింది. పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌శాఖ డీనోటిఫైడ్ చేసిన తర్వాత ఎంపీటీసీ స్థానాలు తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండింటి పరిధిలో దాదాపు 18 గ్రామ పంచాయతీల వరకు ఉంటాయి. అవి పూర్తిస్థాయిలో మున్సిపాలిటీలలో కలిస్తే ఇప్పుడున్న ఎంపీటీసీల సంఖ్యలో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీంతో రాష్ట్రంలో మళ్లీ ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గే చాన్స్ ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ 18 పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ, మండల ప్రజా పరిషత్ (ఎంపీటీసీ) డీలిమిటేషన్ కోసం షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ జారీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు పూర్తిస్థాయిలో ఎంపీటీసీ స్థానాలు ఖరారు కానున్నాయి. ఈ పంచాయతీలకు మున్సిపాలిటీలు నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేయాలి. పంచాయతీ రాజ్ శాఖ వీటిని డీనోటిఫైడ్ చేయాలి. అయితే, ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇరు శాఖల అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.

తగ్గిన ఒక జిల్లా పరిషత్

గత ఎన్నికలతో పోలిస్తే ఒక జిల్లా పరిషత్‌‌‌‌‌‌‌‌ (జెడ్.పీ.) స్థానం తగ్గిపోయింది. మేడ్చల్–మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి జిల్లాలోని గ్రామాలు, మండలాలు సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం కావడంతో ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియ నుంచి ఈ జిల్లా ఔట్ అయ్యింది. రాష్ట్రంలో 2019 ఎన్నికల నాటికి 32 జిల్లా పరిషత్‌‌‌‌‌‌‌‌లు ఉండగా.. తాజాగా 31 జెడ్.పీ.లకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 539 ఎంపీపీలు, జెడ్పీటీసీలకు ఎన్నికలు జరిగినా.. ప్రస్తుతం వాటి సంఖ్య 566 స్థానాలకు చేరింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 33 స్థానాలు, అత్యల్పంగా ములుగు జిల్లాలో 10 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలున్నాయి. కాగా, ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రకటన వచ్చినా.. స్థానిక ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉన్నట్లు పీ.ఆర్. అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

తేలిన పంచాయతీలు, వార్డుల లెక్క..

రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, వార్డుల లెక్క తేలింది. 2019లో 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. వాటి సంఖ్య 12,759కి తగ్గింది. అయితే, ఇటీవల నల్గొండ జిల్లాలోని హలియా మున్సిపాలిటీ పరిధిలోని ఒక పంచాయతీని డీనోటిఫైడ్ చేశారు. దీంతో పంచాయతీల సంఖ్యలో స్వల్ప మార్పులు జరిగాయి. సదరు గ్రామం పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌శాఖ పరిధిలోకి రానున్నది. పీఆర్ శాఖ ఈ పంచాయతీని నోటిఫై చేస్తే గ్రామ పంచాయతీల సంఖ్య 12,760కు చేరనున్నది. 2019లో గ్రామాల వార్డులు 1,13,136 ఉండగా.. పంచాయతీలు మున్సిపాలిటీలలో కలవడంతో వాటి సంఖ్య 1,12,500కు చేరింది.