
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రమ్ వేలానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. వేలం మొదలయ్యే ముందు కంపెనీలతో ప్రీ–బిడ్డింగ్ కాన్ఫరెన్స్ (జూన్ 20) ను సోమవారం నిర్వహించనున్నారు. వచ్చే నెల 26 నుంచి 5జీ స్పెక్ట్రమ్ వేలం మొదలు కానుంది. మొత్తం 72 గిగా హెడ్జ్ రేడియో వేవ్స్‌ను వేలం వేయనున్నారు. 20 ఏళ్లకు గాను 5జీ స్పెక్ట్రమ్‌ను కంపెనీలకు కేటాయిస్తారు. ఆగస్ట్‌లో 5జీ అందుబాటులోకి వస్తుందని అంచనా. 2018 లో పెట్టుకున్న వేలం రిజర్వ్ ప్రైస్‌ను 40 శాతం మేర తగ్గించాలని ట్రాయ్ ప్రభుత్వానికి సలహాయిచ్చిన విషయం తెలిసిందే. దీనికి ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది.
వేలం ద్వారా రూ. 1 లక్షల కోట్ల వరకు ప్రభుత్వం సేకరిస్తుందని అంచనా. రిజర్వ్ ప్రైస్ ఎక్కువగా ఉందని, 90 శాతం వరకు తగ్గించాలని కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. ప్రభుత్వం ఈ రేటును 90 శాతం తగ్గించలేదు. అయినప్పటికీ, 5జీ స్పెక్ట్రమ్ వేలం సక్సెస్ అవుతుందని, కంపెనీలు ఉత్సాహంగా పాల్గొంటాయని కమ్యూనికేషన్ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. 600, 700, 800, 900,1,800, 2,100,2,300, 2,500, 3,300 మెగా హెడ్జ్ బ్యాండ్లలో, 26 గిగా హెడ్జ్ బ్యాండ్‌లోని స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నారు. కాగా, 5జీ సెక్ట్రమ్ వేలంలో 40 శాతం రెవెన్యూ రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాల నుంచే వస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్టెలికం అంచనా వేస్తోంది.