పెరగనున్న 5జీ రేట్లు..10 శాతం వరకు అప్?

 పెరగనున్న 5జీ రేట్లు..10 శాతం వరకు అప్?

 న్యూఢిల్లీ: ఖర్చులను తట్టుకోవడానికి టెలికం ఆపరేటర్లు టారిఫ్​లను పెంచడానికి రెడీ అవుతున్నారు. రిలయన్స్ జియో,  భారతీ ఎయిర్‌‌‌‌టెల్ ప్రీమియం కస్టమర్లకు తమ అన్​లిమిటెడ్​ 5జీ డేటా ప్లాన్‌‌‌‌లను ఆపేసే అవకాశం ఉంది. ఆదాయం పెంపు కోసం 2024 జూన్​ నుంచి 4జీతో పోలిస్తే -5జీ సేవలకు కనీసం 5–-10శాతం ఎక్కువ ఛార్జీ విధించవచ్చని టెలికం రంగ ఎక్స్​పర్టులు చెబుతున్నారు. 5జీ సేవల కోసం ఈ కంపెనీలు భారీగా ఇన్వెస్ట్​ చేశాయి. 

ఈ ఖర్చును రాబట్టుకోవడానికి 2024 సెప్టెంబర్ క్వార్టర్​లో రెండు టెలికాం ఆపరేటర్లు మొబైల్ టారిఫ్‌‌‌‌లను కనీసం 10శాతం పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం.  5జీకి కస్టమర్లను అలవాటు చేయడానికి, ఇప్పటికే ఉన్న వినియోగదారులను ఆకర్షించడానికి ఈ రెండు కంపెనీలు 5జీ అన్​లిమిటెడ్​ డేటా ఆఫర్లతో పాటు  4జీ  ధరలకే 5జీ సేవలను అందిస్తున్నాయి. జనం 5జీకి అలవాటు పడటం మొదలైనందున కంపెనీలు మానిటైజేషన్​పై ఫోకస్​ చేశాయని ఎక్స్‌‌పర్ట్‌‌లు అంటున్నారు.  

ఈ రెండు సంస్థలు కొన్ని నెలల్లో 5జీ- కోసం ప్లాన్‌‌‌‌లను ప్రకటించవచ్చని  జెఫరీస్ ఒక రీసెర్చ్​నోట్​లో తెలిపింది. ఎయిర్‌‌‌‌టెల్,  జియో  5జీ రేట్లు 4జీ కంటే 5-–10శాతం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది.  ఇటువంటి ప్లాన్లకు 30–-40శాతం అదనపు డేటాను బండిల్ చేసి మార్కెట్ షేరును పెంచుకొని, లాభాలను పొందవచ్చని ఈ గ్లోబల్ బ్రోకరేజ్ తెలిపింది. రిలయన్స్​ జియో  5జీ సేవలను ప్రారంభించినప్పటికీ, నగదు కొరత వల్ల వొడాఫోన్​ ఐడియా (వీఐ) వీటిని మొదలుపెట్టలేదు. అయితే ఇప్పటికిప్పుడు 5జీకి ఎక్కువ చార్జ్​ చేసే ఆలోచన లేదని ఎయిర్​టెల్​ గత నవంబరులో ప్రకటించింది. 

తగిన సమయంలో చార్జీలు పెంచడానికి వెనకడుగు వేయబోమని ఎయిర్‌‌‌‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ అన్నారు. ప్రతి కస్టమర్​ నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయాన్ని (ఏఆర్​పీయూ) ప్రస్తుతం ఉన్న రూ. 200 నుంచి దాదాపు రూ. 250కి పెంచుకుంటామని ప్రకటించారు.  జియో,  ఎయిర్​టెల్​కు కలిపి​ ఇప్పటికే 12.5 కోట్ల మంది 5జీ యూజర్లు ఉన్నారు. దేశం  మొత్తం 5జీ యూజర్ బేస్ 2024 చివరి నాటికి 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా.  భారతదేశ టెలికాం సేవల సుంకం ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యల్పంగా  నెలకు రెండు డాలర్లు మాత్రమే ఉన్నందున టెల్కోలకు ధరలను పెంచడానికి అవకాశాలు ఉన్నాయి.  

జియో, ఎయిర్​టెల్,​  వీఐలు చివరగా 2021 నవంబరులో టారిఫ్​లను 19–-25శాతం పెంచాయి. ఈసారి పార్లమెంటు ఎన్నికల తర్వాత చార్జీల పెంపు ఉండొచ్చని భావిస్తున్నారు. భారతదేశ మొబైల్ రంగ ఆదాయం 2024 ఆర్థిక సంవత్సరంలో  రూ. 2,46,800 కోట్లు (30.5 బిలియన్ డాలర్లు) ఉండగా, ఇది 2025 ఆర్థిక సంవత్సరం లో  రూ. 2,77,300 కోట్లకు (34 బిలియన్ డాలర్లు), 2026లో  రూ 3,07,800 కోట్లకు (38 బిలియన్ డాలర్లు) పెరుగుతుందని సీఎల్​ఎస్​ఏ అంచనా వేసింది.