5జీ పేరుతో లింక్‌‌లు పంపుతున్న మోసగాళ్లు

5జీ పేరుతో లింక్‌‌లు పంపుతున్న మోసగాళ్లు
  • లింక్ ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్
  • అలర్ట్‌‌గా ఉండాని పోలీసుల సూచన

హైదరాబాద్, వెలుగు: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ‘5జీ’ నెట్‌‌వర్క్‌‌ను టార్గెట్‌‌గా చేసుకున్నారు. 4జీ నుంచి 5జీకి సిమ్‌‌ అప్‌‌డేట్ చేసుకోవాలంటూ లింకులు పంపించి అకౌంట్స్‌‌ ఖాళీ చేస్తున్నారు. ఈ మోసాన్ని సైబర్‌‌ ‌‌క్రైమ్ పోలీసులు త్వరగానే గుర్తించారు. టెలికాం సర్వీసెస్‌‌ అందించిన సమాచారంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 5జీ అప్‌‌డేట్‌‌ పేరుతో మోసాలు జరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్‌‌కి వచ్చే లింక్స్, కాల్స్‌‌ నిజమైనవా కాదా అనేది నిర్ధారించుకున్న తర్వాతే ఓపెన్ చేయాలని సూచిస్తున్నారు. అనుమానాస్పద కాల్స్ వచ్చినా, లింక్స్ వచ్చినా సర్వీస్ ప్రొవైడర్‌‌‌‌ను సంప్రదించాలని చెబుతున్నారు.

సర్వీస్ నిలిచిపోతుందని భయపెట్టి..
దేశంలో ప్రస్తుతం 4 జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటి స్థానంలో అప్‌‌డేట్‌‌ వర్షన్ 5జీ వచ్చింది. ప్రైవేట్‌‌ టెలికాం నెట్‌‌వర్క్స్ పోటీపడి ఈ సర్వీస్ అందిస్తున్నాయి. వీటినే సైబర్ నేరగాళ్లు టార్గెట్‌‌ చేశారు. ఆయా కంపెనీల పేర్లతో మొబైల్‌‌ యూజర్లకు లింక్స్ పంపిస్తున్నారు. సిమ్‌‌ అప్‌‌డేట్‌‌ చేసుకోవాలని మెసేజ్‌‌లు చేస్తున్నారు. వర్చువల్ నంబర్స్‌‌తో కాల్స్ చేస్తున్నారు. అప్‌‌డేట్‌‌ చేసుకోకపోతే సర్వీస్ నిలిచిపోతుందని అయోమయానికి గురి చేస్తున్నారు. నిర్ణీత టైంలోపు సిమ్‌‌ను 5జీలోకి మార్చుకోవాలని సూచిస్తున్నారు.

ఇట్ల దోపిడీ
లింక్స్, కాల్స్‌‌కి స్పందించిన వారిని సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేస్తున్నారు. లింక్స్‌‌ ఓపెన్‌‌ చేసి ఓల్డ్‌‌ ఫోన్‌‌ నంబర్‌‌‌‌ సిమ్‌‌ కార్డ్‌‌కి సంబంధించిన సీరియల్ నంబర్ ఎంటర్ చేయాలంటారు. తర్వాత ఓటీపీ పంపిస్తారు. ఓటీపీ ఎంటర్ చేయడంతో  సిమ్‌‌ అప్‌‌డేట్‌‌ అవుతుందని నమ్మిస్తారు. ఇలా ట్రాప్‌‌ చేసి మొబైల్‌‌తో లింకైన బ్యాంక్ అకౌంట్స్, పర్సనల్‌‌ డేటా హ్యాక్‌‌ చేసే చాన్స్​ ఉంది. ఓటీపీ చెప్పిన తర్వాత ఆన్‌‌లైన్‌‌లో మనీ ట్రాన్స్‌‌ఫర్ చేసుకునే చాన్స్​లున్నాయని సైబర్ క్రైమ్ పోలీ సులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద లింక్స్ ఓపెన్ చేయకూడదని, మోసం జరిగిన వెంటనే 1930 టోల్‌‌ ఫ్రీ నంబర్‌‌‌‌కి కాల్‌‌ చేసి రిపోర్ట్ చేయాలని సూచిస్తున్నారు.