మరో చిన్నారిని బలితీసుకున్న బోరు బావి

మరో చిన్నారిని బలితీసుకున్న బోరు బావి

హర్యానాలోని కర్నాల్‌ జిల్లాలో ఓ ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడి..చనిపోయింది. హర్‌సింగ్‌ పురా గ్రామానికి చెందిన ఈ చిన్నారి ఆదివారం సాయంత్రం తమ పంటపొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. కాసేపటి  తర్వాత చిన్నారి కన్పించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు వెతకగా బోరుబావిలో పడినట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులు, అధికారులను ఆశ్రయించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. చిన్నారి 50 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించి…రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేపట్టారు. చిన్నారికి పైపుల ద్వారా ఆక్సిజన్‌ అందిస్తూ ..వారు చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. చిన్నారి చనిపోయినట్లు తెలిపారు పోలీసులు.

కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని తురుచ్చి జిల్లాలో బోరుబావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు చిన్నారి సుజిత్‌ విల్సన్. ఆ విషాదాన్నించి ఇంకా కోలుకోక ముందే…ఇప్పుడు హర్యానాలో మరో చిన్నారిని బోరుబావి బలితీసుకుంది.