AI స్టాక్స్ కోసం వెతుకుతున్నారా..? ఈ 6 కంపెనీల్లో మీకూ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా..?

AI స్టాక్స్ కోసం వెతుకుతున్నారా..? ఈ 6 కంపెనీల్లో మీకూ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా..?

ప్రస్తుతం ప్రపంచం మెుత్తం ఏఐ చుట్టూనే తిరుగుతోంది. రోజుకో రకం కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి వస్తున్న వేళ యూజర్ల కంటే ఇన్వెస్టర్లకే ఏఐ రంగంపై ఆసక్తి పెరిగిపోతోంది. ఈ రంగంలో పెట్టుబడుల కోసం ఉన్న అవకాశాలు.. దీనితో లింక్ అయిన కంపెనీల గురించి రీసెర్చ్ చేస్తున్న తెలుగు ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోంది. 

ఇండియాలో ఏఐ అనగానే అందరికీ గుర్తొచ్చే పేర్లు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో. 2026 నాటి అసలైన కథ వేరే ఉంది. యాన్యువల్ రిపోర్ట్స్‌లో కేవలం ‘ఏఐ’ అని రాసుకోవడం కాకుండా.. దాన్నే మెయిన్ బిజినెస్‌గా మార్చుకుని దూసుకుపోతున్న 6 క్రేజీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ డీటెయిల్స్ మీకోసం..

1. నెట్‌వెబ్ టెక్నాలజీస్:
భారతదేశపు 'ఎన్విడియా'గా మారే సత్తా ఉన్న కంపెనీ ఇది. సూపర్ కంప్యూటర్లు, ఏఐ సర్వర్లు, డేటా సెంటర్లను ఇది సొంతంగా ఇండియాలోనే డిజైన్ చేసి తయారు చేస్తుంది ఇది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం ఏకంగా 90% పెరిగి రూ.2వేల 184 కోట్లకు చేరింది. ఇందులో 43% వాటా కేవలం ఏఐ సిస్టమ్స్ ద్వారానే రావడం విశేషం. ప్రస్తుతం రూ.4వేల 270 కోట్ల భారీ ఆర్డర్ బుక్ ఉన్న ఈ స్టాక్ ధర దాదాపు రూ.3వేల 888 దగ్గర ఉంది.

2. ఫ్రాక్టల్ అనలిటిక్స్:
ఇది మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ప్యూర్-ప్లే ఏఐ సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఎలాంటి లెగసీ ఐటీ బిజినెస్ లేకుండా.. పూర్తిగా గ్లోబల్ కంపెనీలకు ఏఐ సొల్యూషన్స్ అందిస్తుంది. సిటీ బ్యాంక్, నెస్లే, కాస్ట్‌కో వంటి దిగ్గజాలు దీని క్లయింట్లు. FY26 లో రూ.3వేల 300 కోట్ల ఆదాయం సాధించడమే కాకుండా.. కంపెనీ పూర్తిగా అప్పుల్లేనిదిగా మారింది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ. 921 వద్ద ట్రేడవుతోంది.

3. అఫ్లె ఇండియా:
యాడ్-టెక్ కంపెనీగా కనిపించినా.. దీని వెనుక ఉన్న అసలైన ఇంజన్ ఏఐ. యూజర్ల బిహేవియర్‌ను కనిపెట్టి, కచ్చితంగా కొనే ఛాన్స్ ఉన్నవారికే ఇది ప్రకటనలు చూపిస్తుంది. క్లిక్స్ కోసం కాకుండా కేవలం 'కన్వర్షన్స్' జరిగితేనే కంపెనీకి డబ్బులొస్తాయి. FY26 లో రూ.454.8 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ప్రస్తుతం ఈ షేరు తన రూ.1,506 వద్ద ఉండటం ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారింది.

4. ఈ2ఈ నెట్‌వర్క్స్:
భారతీయ స్టార్టప్‌లు, కంపెనీల కోసం ప్రత్యేకంగా క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందిస్తున్న చిన్న సైజు రాకెట్ ఇది. విదేశీ క్లౌడ్ సర్వీసుల కంటే తక్కువ ధరకే దేశీయంగా ఏఐ కంప్యూటింగ్ పవర్ ఇస్తోంది. దీని మంత్లీ రెవెన్యూ రన్ రేట్ ఏడాదిలోనే రూ.11.2 కోట్ల నుంచి రూ.37.4 కోట్లకు పెరిగింది. ప్రస్తుత షేరు ధర రూ.3వేల 116గా ఉంది. లిక్విడిటీ పెంచేందుకు కంపెనీ స్టాక్ స్ప్లిట్‌ను కూడా ప్రకటించింది. కాకపోతే ఇది కాస్త రిస్క్‌తో కూడిన హై-గ్రోత్ స్టాక్ అంటున్నారు నిపుణులు.

5. లేటెంట్ వ్యూ అనలిటిక్స్:
డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్‌లో ఇదొక నిశ్శబ్ద సంచలనం స-ృష్టిస్తున్న కంపెనీ. అమెరికా, యూరప్ మార్కెట్లలోని పెద్ద పెద్ద కంపెనీలకు డేటా సర్వీసెస్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.475 వద్ద తన 52 వారాల లోయర్ రేంజ్ లో లభిస్తోంది. అప్పుల్లేని ఈ కంపెనీ క్యాష్ రిచ్‌గా ఉంది. అనలిస్టులు దీనికి రూ.600 టార్గెట్ ఇస్తుండటంతో.. తక్కువ రిస్క్ తో ఏఐ స్పేస్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి మంచి ఆప్షన్ గా మారింది.

6. హ్యాపియెస్ట్ మైండ్స్:
మిగతా ఐటీ కంపెనీల్లా కాకుండా ‘బోర్న్ డిజిటల్, ఏఐ-ఫస్ట్’ నినాదంతో పుట్టిన కంపెనీ ఇది. గత ఏడాది కాలంలో ఐటీ రికవరీ మందగించడం వల్ల ఈ స్టాక్ 35% పడిపోయి రూ.380 దగ్గర దొరుకుతోంది. కానీ కంపెనీ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి. FY26 లో రూ.2వేల 162 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. SBI మ్యూచువల్ ఫండ్ లాంటి పెద్ద సంస్థలు ఈ షేరును కొనుగోలు చేస్తుండటంతో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు దీన్ని వాచ్‌లిస్ట్‌లో పెట్టుకోవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

NOTE: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ రిస్క్ తో కూడుకున్నది కాబట్టి మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. మీ పెట్టుబడి నిర్ణయాలకు వీ6 యాజమాన్యం లేదా ఉద్యోగులు బాధ్యత వహించరు.