వైరల్ స్టోరీ: ఒకే ఫ్యామిలీలో 6 ఉద్యోగాలు ఊడాయ్.. జాబ్ మార్కెట్ సంక్షోభానికి ఇది నిదర్శనమా?

వైరల్ స్టోరీ: ఒకే ఫ్యామిలీలో 6 ఉద్యోగాలు ఊడాయ్.. జాబ్ మార్కెట్ సంక్షోభానికి ఇది నిదర్శనమా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ, ఫిన్‌టెక్, ఏవియేషన్ రంగాల్లో జరుగుతున్న లే-ఆఫ్‌లు ఏ స్థాయిలో ఉన్నాయో కళ్లకు గట్టే రియల్ స్టోరీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'రెడ్డిట్' వేదికగా వెలుగులోకి వచ్చింది. తమ కుటుంబం మొత్తం రోడ్డున పడిందని.. అందరం తీవ్ర భయాందోళనల్లో ఉన్నాం.. దయచేసి ఏదైనా సలహా ఇవ్వండి అంటూ ఒక నెటిజన్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఆ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులతో పాటు నలుగురు తోబుట్టువులు.. అంటే మొత్తం ఆరుగురు ఒకేసారి ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారట.

ఏడాది క్రితం ఒకరు ఉద్యోగం కోల్పోగా.. మరొకరు ఇటీవల ఎటువంటి సెవెరెన్స్ ప్యాకేజీ లేకుండానే తొలగించబడ్డారు. ఇంకొకరు ఫిన్‌టెక్ కంపెనీలో, మరొకరు మూతపడిన ఒక విమానయాన సంస్థలో పనిచేస్తూ ఉపాధి కోల్పోయారు. కష్టపడి పైకొచ్చి, పెద్ద పెద్ద కంపెనీల్లో స్థిరపడ్డాం అనుకున్న తరుణంలో.. ఇలా అందరి ఉద్యోగాలు ఒకేసారి ఊడిపోతాయని తాము కలవకలో కూడా ఊహించలేదని ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.

జాబ్ మార్కెట్ ఎంత దారుణంగా ఉందంటే?
ఈ పోస్ట్ ద్వారా ప్రస్తుతం గ్లోబల్ జాబ్ మార్కెట్ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందో స్పష్టమవుతోంది. ఐటీ, టెక్ రంగాల్లో అనుభవం ఉన్నప్పటికీ.. నెలల తరబడి ప్రయత్నించినా ఎక్కడా కొత్త జాబ్స్ దొరకడం లేదు. కనీసం బతుకుదెరువు కోసం ఉబెర్ నడపడానికో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోనో, రిటైల్ షాపుల్లోనో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేద్దామన్నా.. వాటి ద్వారా వచ్చే ఆదాయం భారీ హోమ్ లోన్ల ఈఎంఐలను కట్టడానికి ఏమాత్రం సరిపోవడం లేదంటోంది ఈ ఫ్యామిలీ.

పెద్ద నగరాల్లో ఇళ్ల అద్దెలు కట్టలేక ఇద్దరు చిన్న తోబుట్టువులు తమ తల్లిదండ్రుల పల్లెటూరికి తిరిగి వెళ్లారు. అయితే అక్కడ వారి ఐటీ అనుభవానికి తగ్గ ఏ ఒక్క ఉద్యోగ అవకాశం లేదు. చివరికి స్థానికంగా ఉండే చిన్న చిన్న దుకాణాల్లో పని దొరకాలన్నా ఎవరిదో ఒకరి రికమండేషన్ ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు.

ఇళ్లు అమ్మేసుకోవాలా?
ప్రస్తుతం ఆ కుటుంబం ముందున్న పెద్ద సవాలు.. మూడు ఇళ్ల తాలూకు హోమ్ లోన్లను ఎలా మేనేజ్ చేయాలనేది. ఏ ఇల్లు ఉంచుకోవాలి, ఏ ఇల్లు వదిలేసుకోవాలి అనే సందిగ్ధంలో వారున్నారు వాళ్లు. ఈ పోస్ట్‌పై స్పందించిన అనేకమంది నెటిజన్లు, ఆర్థిక నిపుణులు తమ పాత ఆర్థిక సంక్షోభ అనుభవాలను పంచుకుంటూ కొన్ని కీలక సూచనలు చేశారు.

ALSO READ : జియో ఓటీటీ పాస్: కేవలం రూ.200కే 15 OTT యాప్స్, అపరిమిత 5G

ఎమోషన్స్ కి పోయి అన్ని ఇళ్లను కాపాడుకోవాలని చూస్తే పూర్తిగా మునిగిపోతారు. కాబట్టి ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఆ నగరంలోని ఇల్లు ఒకదాన్ని ఉంచుకుని.. మిగిలిన ఇళ్లను అమ్మేయడం మంచిదని ఈ ఫ్యామిలీకి కొందరు నెటిజన్లు సూచిస్తున్నారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటూ ఖర్చులను తగ్గించుకోవాలని చెబుతున్నారు. అలాగే పర్మనెంట్ జాబ్స్ దొరికే వరకు సూపర్ మార్కెట్లలో నైట్ షిఫ్ట్‌లు, లేబర్ పనులు అయినా చేస్తూ కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సలహా ఇస్తున్నారు.

ఈ పరిస్థితి కేవలం ఒక కుటుంబానిది మాత్రమే కాదు. టెక్ రంగంలో ప్రవేశిస్తున్న ఏఐ, కంపెనీల రీస్ట్రక్చరింగ్ పద్ధతుల కారణంగా రాబోయే రోజుల్లో లే-ఆఫ్‌లు మరిన్ని రంగాలకు విస్తరిస్తాయనడానికి ఇదొక హెచ్చరిక లాంటిదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు అత్యంత సేఫ్ జాబ్స్ అనుకున్న ఐటీ ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఎంతటి అనిశ్చితిలో పడ్డాయో ఈ ఫ్యామిలీకి జరిగిన ఘటన కళ్లకు కడుతోంది.