
తనకు సంతానం కలగలేదని తమిళనాడుకు చెందిన మహిళ ఓ మాతృమూర్తికి బిడ్డను దూరంగా చేయడానికి సిద్ధపడింది. 6 నెలల పసికందును కిడ్నాప్ చేసి.. తీసుకెళ్లింది. ఆ బిడ్డ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్క రోజులోనే ఆ పసివాడిని ఆమె ఒడికి చేర్చారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంటలో జరిగింది.
మంగళవారం రాత్రి భర్తతో గొడవ పడి స్వర్ణలత అనే మహిళ పుట్టింటికి వెళ్లిపోవాలని తన ఆరు నెలల కొడుకుతో రేణిగుంట రైల్వేస్టేషన్‌కు వెళ్లింది. ఆమె ఏదో బాధలో ఉన్నట్లు గమనించిన తమిళనాడులోని అరక్కోణం ప్రాంతానికి చెందిన అంబిక అనే మహిళ ఊరడిస్తున్నట్లుగా మాట్లాడింది. ఏవో మాయమాటలు చెప్పి.. స్వర్ణలత చేతిలోని బిడ్డను తీసుకున్న అంబిక.. ఆమె ఏమరపాటులో ఉన్నప్పుడు పరారైంది. తేరుకున్నాక బిడ్డ పక్కన లేకపోవడంతో రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేసింది స్వర్ణలత. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఒక్క రోజులోనే నిందితులను అరెస్టు చేశారు. ఆ బాలుడిని స్వర్ణలత కుటుంబానికి అప్పగించి.. వారికి కౌన్సెలింగ్ చేశారు.
ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసును వేగంగా ఛేదించిన పోలీస్ టీమ్‌లను అభినందించారు. ఈ కేసులో అంబికతో పాటు రేణిగుంటకు చెందిన మరియమ్మ, సుబ్బరత్నం, కుమార్, గంగలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంబికకు పిల్లలు లేని కారణంగా బాబును కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఇకముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తన బిడ్డ ఆచూకీ లభించకపోయుంటే తనకు చావే శరణ్య అనుకున్నానని చెప్పింది స్వర్ణలత. పోలీసులు బాబును అప్పగించడంతో చాలా సంతోషంగా ఉందంటూ కృతజ్ఞతలు తెలిపిందామె.