క‌రోనా లాక్ డౌన్ లో కిరాత‌కం: ఆరేళ్ల పాప కిడ్నాప్.. రేప్ చేసి కనుగుడ్లు..

క‌రోనా లాక్ డౌన్ లో కిరాత‌కం: ఆరేళ్ల పాప కిడ్నాప్.. రేప్ చేసి కనుగుడ్లు..

క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలోనూ ఆడ బిడ్డ‌ల‌పై కిరాత‌కుల అకృత్యాలు ఆగ‌డం లేదు. కొద్ది రోజుల క్రితం మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్ లో అంధురాలైన మ‌హిళ‌పై ఆమె ఇంట్లోనే అత్యాచారం జరిగిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే అదే రాష్ట్రంలో మ‌రో ఘోరం జ‌రిగింది. ద‌మోహ్ జిల్లాలోని బ‌న్సీపురా గ్రామంలో ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు గుర్తు తెలియ‌ని దుండ‌గులు. ఆ చిన్నారిని కాళ్లు చేతులు క‌ట్టేసి.. రాక్ష‌సంగా హింసించి ఊరికి దూరంగా ప‌డేసి పారిపోయారు.

బుధ‌వారం సాయంత్రం బ‌న్సీపురా గ్రామంలోని త‌న ఇంటికి స‌మీపంలోనే ఉన్న షాపు ద‌గ్గ‌ర‌కు వెళ్లింది ఆరేళ్ల‌ చిన్నారి. కానీ ఎంతసేప‌టికీ ఇంటికి రాక‌పోవ‌డంతో కంగారుప‌డిన త‌ల్లిదండ్రులు ఆ చుట్టుప‌క్క‌ల అంతా వెతికారు. ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డంతో బ‌జేరా పోలీస్ స్టేష‌న్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. కిడ్నాప్ కేసుగా న‌మోదు చేసుకున్న‌ పోలీసులు ఆ పాప కోసం వెతుకులాట ప్రారంభించారు. ఊరికి కిలోమీట‌రు దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఓ రూమ్ ద‌గ్గ‌ర స్పృహ‌లేకుండా ప‌డి ఉన్న చిన్నారిని గురువారం ఉద‌యం గుర్తించామ‌ని చెప్పారు పోలీసులు. ప్రాథ‌మిక ద‌ర్యాప్తు ఆధారంగా ఆ చిన్నారిపై రేప్ జ‌రిగినట్లు అంచ‌నా వేస్తున్నామ‌న్నారు. అయితే ఆ చిన్నారిని దుండుగులు కిరాత‌కంగా హింసించి, క‌నుగుడ్లు పీకేందుకు ప్ర‌య‌త్నం చేశార‌ని, కాళ్లు చేతులు రెండు క‌ట్టేసి అక్క‌డ వ‌దిలేసి వెళ్లిపోయార‌ని చెప్పారు. ఆ పాప‌ను స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని చెప్పారు వైద్యులు. క‌ళ్లు బాగా వాచిపోయి ఉన్నాయ‌ని, ప్ర‌స్తుతం రెటీనాను ప‌రీక్షించ‌డం కూడా క‌ష్ట‌మ‌ని తెలిపారు.

ద‌ర్యాప్తు కోసం సిట్

ఆ చిన్నారి ప‌రిస్థితి క్రిటిక‌ల్ గా ఉండ‌డంతో మెరుగైన వైద్యం కోసం జ‌బ‌ల్పూర్ త‌ర‌లించామ‌ని చెప్పారు ద‌మోహ్ జిల్లా ఎస్పీ హేమంత్ చౌహాన్. ఈ కేసు ద‌ర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. నిందితుల గురించి ఏదైనా స‌మాచారం ఇచ్చిన వారికి రూ. 10 వేల న‌గ‌దు రివార్డ్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారాయ‌న‌.

చిన్నారుల‌కు రక్ష‌ణేదీ?

ఈ ఘ‌ట‌న‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం క‌మ‌ల్ నాథ్ సీరియ‌స్ గా స్పందించారు. సామాన్యులు నిత్యావ‌స‌రాల కోసం బ‌య‌ట‌కు రావ‌డానికి కూడా క‌ష్ట‌మ‌వుతున్న లాక్ డౌన్ స‌మ‌యంలో రాష్ట్రంలో నేర‌గాళ్లు ఫ్రీగా తిరుగుతున్నారని మండిప‌డ్డారు. ఆడ బిల్ల‌ల‌కు ర‌క్ష‌ణేదంటూ సీఎం శివ‌రాజ్ సింగ్ ను ప్ర‌శ్నిస్తూ ట్వీట్ చేశారు. ప‌సిపాప‌పై కిరాత‌కంగా దాడికి పాల్ప‌డి.. క‌నుగుడ్లు పీకే ప్ర‌య‌త్నం చేయ‌డం దారుణ‌మ‌ని అన్నారు. ఈ ఘోరానికి పాల్ప‌డిన నిందితుల‌ను త్వ‌ర‌గా ప‌ట్టుకు‌ని, క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని అన్నారు.