ప్రసవాల్లో 60 శాతం సిజేరియన్లే

ప్రసవాల్లో 60 శాతం సిజేరియన్లే
  • 15 జిల్లాల్లో 70 శాతం పైనే.. నిర్మల్​లో అత్యధికంగా 82 శాతం

హైదరాబాద్‌, వెలుగురాష్ర్టంలో కడుపు ‘కోత’లు పెరుగుతున్నాయి. ప్రతి వంద ప్రసవాల్లో 60 సిజేరియన్లే ఉంటున్నాయి. ఈ ఏడాది రాష్ర్టంలో 2,99,658 జననాలు నమోదు కాగా, అందులో 1,79,231 కోత డెలివరీలే జరిగాయి. మొత్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,71,234 ( మొత్తం ప్రసవాల్లో 57%) జననాలు నమోదైతే ఇందులో46% సిజేరియన్లు ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,28,424 ( మొత్తం ప్రసవాల్లో 43%) ప్రసవాలు జరిగితే, ఇందులో 78.14% సిజేరియన్లు ఉన్నాయి. వైద్యారోగ్యశాఖ తాజా రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

రెండు జిల్లాల్లో 80 శాతం పైనే

నిర్మల్‌ జిల్లాలో జరిగిన ప్రసవాల్లో అత్యధికంగా 82% సిజేరియన్లే ఉన్నాయి. ఇక్కడ మొత్తం 7,337 ప్రసవాలు జరగ్గా, ఇందులో 6,040 సిజేరియన్లే. అత్యధిక సిజేరియన్లు జరుగుతున్న జిల్లాల్లో మహబూబాబాద్‌ (81%), సూర్యాపేట (77%), సిరిసిల్ల (77%) జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాష్ర్టంలో 15 జిల్లాల్లో 70 శాతానికిపైగా కోత ప్రసవాలే నమోదయ్యాయి. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్​వో) లెక్క ప్రకారం సిజేరియన్లు 20 శాతానికి మించకూడదు. కనీసం ఒక్క జిల్లా కూడా ఈ మార్క్‌ను చేరుకోకపోవడం గమనార్హం. అసిఫాబాద్‌లో అత్యల్పంగా 22% సిజేరియన్లు నమోదవగా, గద్వాల (32%), నారాయణపేట్‌(37%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

320 శిశు మరణాలు

20 వారాల ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీకి ముందు, లేదా డెలివరీ తర్వాత నమోదయ్యే శిశు మరణాలను వైద్య పరిభాషలో ‘స్టిల్‌ బర్త్స్‌’గా పిలుస్తారు. ఈ రకం మరణాలు 320 నమోదైనట్టు తాజా రిపోర్టులో వెల్లడైంది. పోషకాహార లోపం, తల్లి వీక్‌గా ఉండడం, బిడ్డ ఎదుగుదల లోపించడం, హైపర్ టెన్షన్‌, డయాబెటిస్‌ వంటి కారణాల వల్ల స్టిల్ బర్త్స్‌ జరిగే ప్రమాదం ఎక్కువ.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి