రెండేండ్లుగా 60 గ్రామాలకు సర్పంచుల్లేరు

రెండేండ్లుగా 60 గ్రామాలకు సర్పంచుల్లేరు
  • రిజర్వేషన్లు అనుకూలించక, మున్సిపాలిటీల నుం చి పక్కన
  • పెట్టడం వల్ల నో ఎలక్షన్స్ 60కిపైగా గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన

నెట్​వర్క్, వెలుగు: స్టేట్​వైడ్ ​60 కి పైగా గ్రామాల్లో సర్పంచులు లేరు. రిజర్వేషన్లు అనుకూలించక కొన్ని గ్రామాల్లో, మొదట మున్సిపాలిటీల్లో కలిపి, తర్వాత తొలగించడం వల్ల ఇంకొన్ని గ్రామాల్లో రెండేళ్లుగా ఎలక్షన్స్ జరగలేదు.  ఆయా చోట్ల సమస్యలు పరిష్కరించి ఎలక్షన్స్​జరిగేలా చూస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు.  సర్పంచులు లేక తమ గ్రామాలు డెవలప్​ కావట్లేదని, వెంటనే ఎలక్షన్స్​పెట్టాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నా లీడర్లుగానీ, ఆఫీసర్లుగానీ పట్టించుకోవట్లేదు.

స్పెషల్​ ఆఫీసర్ల పాలనలో అన్నీ సమస్యలే..

రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు 2019 జనవరిలో ఎలక్షన్స్​జరిగాయి. అప్పట్లో సర్పంచ్ రిజర్వేషన్ల ఖరారులో ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల ఎస్సీ, ఎస్టీ జనాభా లేని గ్రామాలను కూడా ఆ వర్గాలకు కేటాయించారు. ఏజెన్సీ పరిధిలోని కొన్ని గ్రామాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్టీలకు రిజర్వ్​ చేసినా ఆ వర్గానికి చెందినవారు లేకపోవడంతో ఒక్క నామినేషన్​ కూడా పడలేదు. దీంతో ఆయా గ్రామాల్లో ఎలక్షన్స్ ఆగిపోయాయి. గ్రామాలను డివైడ్​ చేసిన చోట్ల, ఇతర గ్రామాల్లో కలిపిన చోట్ల పబ్లిక్​ ఎలక్షన్స్​ను బహిష్కరించారు. కొన్ని గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో సర్కారు విలీనం చేసింది. కానీ పబ్లిక్​ ఆందోళనతో తిరిగి పంచాయతీలుగా మార్చినా, ఎలక్షన్స్​ మాత్రం పెట్టలేదు. దీంతో ఆయాచోట్ల ఎంపీడీఓలు, ఇతర మండల స్థాయి అధికారులను స్పెషల్​ఆఫీసర్లుగా నియమించారు. ఈ ఆఫీసర్లకు మండల పనులు చూసుకునేందుకే టైం సరిపోతలేదు. ఏవారానికో, పక్షానికో అన్నట్లుగా గ్రామాలకు వచ్చిపోతున్నారు. ఫలితంగా సర్పంచ్​లు లేని గ్రామాల్లో సమస్యలు పేరుకపోతున్నాయి. డ్రైనేజీలు, రోడ్లు అధ్వానంగాఉన్నాయి. అసలు ఆయా పంచాయతీలకు ఎన్ని ఫండ్స్​వస్తున్నాయో, ఏం పనులకు వాడుతున్నారో కూడా ప్రజలకు తెలియట్లేదు. ఈజీఎస్​ ఫండ్స్​తో నిర్మిస్తున్న సెగ్రిగేషన్​ షెడ్స్, శ్మశానవాటికలు, విలేజ్​ పార్కులను ఇన్​టైంలో కంప్లీట్ ​చేయడంలోనూ ఈ గ్రామాలు వెనుకబడ్డాయి. ఈ క్రమంలో వెంటనే ఎలక్షన్స్​పెట్టాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నా సర్కారులో స్పందన కనిపించడం లేదు.

ఎలక్షన్స్​ ఆగడానికి ఎన్నో కారణాలు..

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని ప్రశాంత్ నగర్, బీకే లక్ష్మాపూర్, కుమ్మరోనిపల్లి, కల్ములోనిపల్లి, వంగురోనీపల్లిలో ఎస్టీలు లేకున్నా సర్పంచ్​పదవిని ఆ వర్గాలకు రిజర్వ్ చేశారు. నిరసనగా ప్రశాంత్ నగర్, బీకే లక్ష్మాపూర్, కుమ్మరోనిపల్లి ప్రజలు ఎలక్షన్స్​బహిష్కరించి, రిజర్వేషన్​ మార్చాలని హైకోర్టులో కేసు వేశారు. మిగిలిన రెండు గ్రామాల్లో కేవలం వార్డుసభ్యులను మాత్రమే ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఈ ఐదు గ్రామాల్లోనూ స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తోంది. ఇదే జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీలో అచ్చంపేట మండలానికి చెందిన 7 గ్రామాలను, బల్ముర్ మండలంలోని ఒక గ్రామాన్ని విలీనం చేశారు. ఏడాది తర్వాత తొలగించినప్పటికీ మళ్లీ ఎలక్షన్స్​పెట్టలేదు.

  • పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం మండలం లింగాపూర్​, కుందనపల్లి, వెంకట్రావ్​పల్లి గ్రామాలను రామగుండం మున్సిపల్​ కార్పొరేషన్​లో విలీనం చేశారు. ఏడాది క్రితం  రామగుండం కార్పొరేషన్ నుంచి ఈ మూడు గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా మారుస్తూ జీవో ఇచ్చారు. కానీ నేటికీ ఎలక్షన్స్​ నిర్వహించలేదు.
  • వరంగల్​ అర్బన్​జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామాన్ని రెవెన్యూ విలేజ్​గా మార్చాలనే డిమాండ్​తో 2013లో జరిగిన ఎలక్షన్స్​ను గ్రామస్థులు బహిష్కరించారు. అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రిక్వెస్ట్​తో 2015 లో ఎలక్షన్స్​ జరిగాయి. ఈ పాలకవర్గం గడువు 2020 మార్చి 8 తో ముగిసినప్పటికీ ఎలక్షన్స్​ నిర్వహించలేదు.
  • కామారెడ్డి  జిల్లా పెద్దకొడప్గల్ మండలం కాటేపల్లితండాలో బీసీ వర్గానికి చెందిన కాయిత్( మధుర) లంబాడీలు ఉంటారు. తండా అనగానే  ఎస్టీలు అనే భావనతో ఎస్టీకి రిజర్వ్​ చేశారు. దీంతో ఎలక్షన్స్​ ఆగిపోయాయి.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నారాయణపేట ఎస్సీ కాలనీ పంచాయతీని ఎస్టీలకు రిజర్వ్​ చేశారు. కానీ ఇక్కడ ఒక్క ఎస్టీ కూడా లేకపోవడంతో ఎలక్షన్​ వాయిదా పడింది.
  • కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం రహపల్లి పంచాయతీ, వాంకిడి మండలం తేజపూర్​పంచాయతీ ఎస్టీలకు రిజర్వ్​ చేశారు. ఈ రెండు గ్రామాల్లో ఎస్టీలు లేకపోవడంతో ఎవరూ నామినేషన్లు వేయలేదు.
  • యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామాన్ని రెండుగా విభజించి ఒక భాగాన్ని ఎల్లగిరిలో కలపాలని అప్పట్లో ఆఫీసర్లు నిర్ణయించారు. దీనికి నిరసనగా గ్రామస్థులు ఎలక్షన్లను బహిష్కరించారు. ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో ప్రస్తుతం స్పెషలాఫీసర్ పాలన నడుస్తోంది.
  • మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్​ పంచాయతీ నుంచి వందూర్​గూడను విడదీసి కొత్త పంచాయతీ ఏర్పాటు చేశారు. దానిని ఎస్టీకి రిజర్వు చేయగా, ఆ వర్గానికి చెందిన వారెవరూ లేకపోవడంతో పంచాయతీ ఎన్నికలు ఆపేశారు. వందూర్​గూడను పాత పంచాయతీలోనే కొనసాగించాలని డిమాండ్​ చేస్తూ ఆ గ్రామస్తులు ఎలక్షన్లు బహిష్కరించారు.
  • మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెం పరిధిలో ఉన్న సునార్ తండా, బేగవత్ తండా, జుజ్జూరు తండాలను కలిపి  జుజ్జుర్ తండా పేరుతో జీపీ ఏర్పాటుచేయగా,  మిగిలిన రెండు తండాల గిరిజనులు వ్యతిరేకించారు. హైకోర్టు నుంచి స్టే తేవడంతో ఇప్పటికీ ఎలక్షన్స్​ జరపలేదు.

ఎలక్షన్స్పెట్టాలె

మంగపేట పూర్తి ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ కొందరు గిరిజనేతరులు వాళ్ల స్వలాభం కోసం మండలాన్ని నాన్ ఏజెన్సీ గా ప్రకటించాలని కోర్టును ఆశ్రయించి పంచాయతీ ఎన్నికలు జరగకుండా చేస్తున్నారు. మంగపేట పూర్తి ఏజెన్సీ మండలం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్​ నిర్వహించాలి.

– పోలెబోయిన ఆదినారాయణ, ఆదివాసీ
సేన మంగపేట మండల అధ్యక్షుడు

ఆ మండలంలో సర్పంచులే లేరు

ములుగు జిల్లా మంగపేట మండలంలో 25 గ్రామ పంచాయతీల సర్పంచ్​స్థానాలను ఎస్టీలకు కేటాయించారు. వార్డు మెంబర్లలోనూ సగం ఎస్టీలకు, మిగిలిన సగం ఇతర క్యాస్ట్​లకు రిజర్వ్​చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, విత్ డ్రా, సింబల్స్​ కేటాయింపు కూడా  పూర్తయింది. తెల్లారితే ఓటింగ్ అనగా గిరిజనేతరులు వేసిన పిటిషన్ ఆధారంగా ఎలక్షన్స్​పై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో గడిచిన రెండున్నరేళ్లుగా ఈ మండలంలో స్పెషల్​ ఆఫీసర్ల పాలన నడుస్తోంది.

సర్పంచ్ లేని ఊరెందుకు?

మా గ్రామం పంచాయతీ కాకముందు ఎట్ల ఉన్నదో ఇప్పుడూ అట్లనే ఉంది. రోడ్లు , మోరీలు లేవు. రోడ్లపైనే నీరు పారుతంది. సర్పంచి, వార్డు మెంబర్లు లేరు. ఆఫీసర్లు పట్టించుకోవటం లేదు. అన్ని ఊర్లకు ఉన్నట్లుగా సర్పంచి, వార్డు మెంబర్లు ఉంటే బాగుంటుంది.  గవర్నమెంట్ ఇప్పటికైనా మా తండా సర్పంచ్​పదవి రిజర్వేషన్​మార్చి, ఎలక్షన్స్​నిర్వహించాలి.

– పరశురాం, కాటేపల్లి తండా,     కామారెడ్డి జిల్లా

18 ఏండ్లుగా ఎలక్షన్స్ లేవు

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం పంచాయతీని 1992లో 1/70 కింద చేర్చారు. కానీ గ్రామంలో ఎస్టీ ఓటర్లు లేక ఎలక్షన్స్​ జరగలేదు.  దీనిని సవాల్​ చేస్తూ గ్రామస్థులు కోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. అనంతరం గ్రామస్థులు రెవెన్యూ, పంచాయతీరాజ్​ కమిషనర్లను, గవర్నర్​ను పలుసార్లు కలిసి మెమోరాండం సమర్పించినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఈ పంచాయతీకి 18 ఏండ్లుగా ఎన్నికలు నిర్వహించలేదు. ఫలితంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా స్పెషల్​ ఆఫీసర్ల పాలనే నడుస్తోంది.